ఓటర్ జాబితాలో పేరు తొలగింపుపై బీజేపీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య మాటల యుద్ధం మొదలైంది. పంజాబ్ ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తన పేరు తొలగించడంపై చద్దా తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది పొరపాటు కాదని.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తన పేరును తొలగించారని ఆరోపించారు. ఈ ఆరోపణలను ఖండిస్తూ ఆప్ ఎదురుదాడికి దిగింది.
ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో భాగంగా ఆగస్టు 13న విడుదలైన పంజాబ్ ముసాయిదా ఓటర్ల జాబితాలో రాఘవ్ చద్దా పేరు లేదు. ఆయన పేరును ‘పర్మినెంట్‌గా షిఫ్ట్ అయ్యారు’ అనే కారణంతో తొలగించినట్లు జాబితాలో పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని చద్దా రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణించారు. అయితే ఇదంతా చద్దా వ్యూహంలో భాగమేనని.. ఢిల్లీలో ఓటరుగా పేరు నమోదు చేసుకునేందుకు ఆయన ‘బ్యాక్‌డేటెడ్’ విధానాన్ని ప్రయత్నిస్తున్నారని ఆప్ ఆరోపించింది.
‘బ్యాక్‌డేటెడ్ విధానం’ అంటే.. ఇప్పుడు ఓటరుగా నమోదు చేసుకుంటూ, గతంలోనే ఆ ప్రాంతంలో నివసిస్తున్నట్లు రికార్డుల్లో చూపించడం. రాఘవ్ చద్దా ఢిల్లీలోని రాజిందర్ నగర్‌లో ఓటరుగా నమోదు చేసుకునే విషయంలో ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారని ఆప్ ఆరోపిస్తోంది. అంటే.. ఇప్పుడు జరిగే ఓటరు నమోదును గత తేదీ నుంచే అమల్లో ఉన్నట్లు చూపించేందుకు ప్రయత్నిస్తున్నారన్నది ఆప్ వాదన.
‘రాజకీయ కక్షతోనే’..
అంతకు ముందు.. తన ఓటర్ ఐడీ పంజాబ్‌లోని మొహాలీలో నమోదై ఉందని చద్దా తెలిపారు. తాను పంజాబ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ‘షిఫ్టెడ్’గా ఎలా గుర్తించారని ప్రశ్నించారు. ఇది సాధారణ క్లరికల్ తప్పిదం కాదని.. రాజకీయ కక్షతోనే తన పేరును తొలగించారని ఆరోపించారు. అయితే ఇది ముసాయిదా జాబితా మాత్రమేనని, అభ్యంతరాలు–దావాల ప్రక్రియ ద్వారా పేరు తిరిగి చేర్చుకునే అవకాశం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు.
ఆప్ ఎదురుదాడి..
చద్దా ఆరోపణలను ఆప్ తీవ్రంగా ఖండించింది. సర్ ప్రక్రియను నిర్వహించేది ఎన్నికల సంఘమే తప్ప పంజాబ్ ప్రభుత్వం కాదని స్పష్టం చేసింది. ఓటర్ల జాబితాలో ఎవరి పేరు చేర్చాలి, ఎవరి పేరు తొలగించాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని పేర్కొంది.
అంతేకాదు.. ఢిల్లీలోని రాజిందర్ నగర్‌లో తన ఓటరు నమోదును గత తేదీ నుంచి అమల్లోకి వచ్చేలా చేయడానికి చద్దా ప్రయత్నిస్తున్నారని ఆప్ ఆరోపించింది. ఈ విషయంలో ఎన్నికల సంఘం వర్గాల నుంచి తమకు సమాచారం అందిందని తెలిపింది. ఇలాంటి బ్యాక్‌డేటెడ్ లేదంటే చట్టవిరుద్ధమైన ప్రక్రియ జరిగి ఉంటే దానిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది.
‘ఢిల్లీలోనే ఉంటున్నారు’
చద్దా ప్రస్తుతం పంజాబ్‌లో కాకుండా ఢిల్లీలో నివసిస్తున్నారని ఆప్ పేర్కొంది. ఒకవేళ ఆయన పంజాబ్‌లో నివసించకపోతే తన ఓటర్ నమోదును కొనసాగించడమో లేదంటే మార్చుకోవడమో ఆయన వ్యక్తిగత బాధ్యతేనని తెలిపింది. ఇప్పుడు ఓటర్ జాబితా నుంచి పేరు తొలగింపునకు ఆప్, పంజాబ్ ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. సర్‌లో భాగంగా తొలగించిన పేర్లపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లను స్వీకరించే ప్రక్రియ కొనసాగుతోంది. తుది ఓటర్ల జాబితాను అక్టోబర్‌లో విడుదల చేయనున్నారు.
ఇదీ చదవండి: స్టాలిన్ ఆశలకు మద్రాస్ హైకోర్టు గండి


