ఢిల్లీ: అతివేగం, నిర్లక్షపు డ్రైవింగ్ వాహనదారుల పట్ల శాపంగా మారింది. తాజాగా ఢిల్లీలో అతివేగంతో దూసుకవచ్చిన థార్ వాహనం రెండు ప్రాణాలను బలిగొంది. ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులను థార్ వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం వాహనదారుడు తప్పించుకునే యత్నం చేయడంతో స్థానికులు అతనిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
నిన్న బుధవారం రాత్రి ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.మృతులు అంజు, సుఖ్‌బీర్‌గా గుర్తించారు. ప్రమాద ఘటన వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం పరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు అక్కడే రోహిణిలో ప్రాంతంలో పాడి వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.


