కాంగ్రెస్‌లో కాంట్రవర్సీల కొండ(డా) | Minister Konda Surekha Controversy In Congress Party Full Story | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో కొండా సురేఖ.. అడుగడుగునా వివాదాలే!

Sep 3 2026 11:30 AM | Updated on Sep 3 2026 12:00 PM

Minister Konda Surekha Controversy In Congress Party Full Story

కాంగ్రెస్‌లోకి అడుగుపెట్టిన నాటి నుంచి కొండా సురేఖ చుట్టూ వివాదాలు ఆగలేదు.. ప్రత్యర్థులతో ఢీ కొట్టిన సందర్భాల కంటే సొంత పార్టీలోనే ఢీకొన్న సందర్భాలే ఎక్కువ!. పదవులు, ఆధిపత్యం, వర్గపోరు, నేతలతో విభేదాలు.. ఇలా ఒక్కో ఎపిసోడ్‌ ఒక్కో రాజకీయ ప్రకంపనగా మారింది. ఒక దశలో సినీ హీరోయిన్లను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తే.. మరో దశలో సొంత పార్టీ నేతలే ఆమె వ్యవహార శైలిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డితో విభేదాలు బహిరంగం కావడం.. వ్యవహారం కాంగ్రెస్‌ అధిష్ఠానం గడప దాటడం.. కొండా సురేఖ రాజకీయ ప్రస్థానంలో మరో కీలక మలుపుగా మారింది. అసలు 2018లో కాంగ్రెస్‌లోకి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కొండా సురేఖ చుట్టూ చోటుచేసుకున్న వివాదాలేంటి? ఎక్కడెక్కడ ఎవరితో ఢీ కొట్టారు? ఈ రాజకీయ రచ్చలో అసలు ట్విస్టులేంటి?..

కొండా సురేఖ రాజకీయ ప్రస్థానం 2018లో కాంగ్రెస్‌లో మొదలైంది కాదు. ఆమె అసలు కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానం 1996లోనే ప్రారంభమైంది. 2018లో ఆమె కాంగ్రెస్‌లోకి తిరిగి వచ్చారు.

కొండా సురేఖ తొలి కాంగ్రెస్‌ ప్రస్థానం..
1995: గీసుకొండ మండల పరిషత్‌ రాజకీయాలతో ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
1996: కాంగ్రెస్‌లో చేరి ఏపీ పీసీసీ సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టారు.
1999: శాయంపేట నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే సమయంలో కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ కోశాధికారిగా, పలు అసెంబ్లీ కమిటీల్లో సభ్యురాలిగా పనిచేశారు.
2000: ఏఐసీసీ కో-ఆప్షన్‌ సభ్యురాలిగా ఎంపికయ్యారు.
2004: శాయంపేట నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు.
2009: నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పరకాల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచి.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

కాంగ్రెస్‌లోకి రీ ఎంట్రీ నుంచి వివాదాల పరంపర
1. 2018.. కాంగ్రెస్‌లోకి రీఎంట్రీ
2018లో బీఆర్‌ఎస్‌లో టికెట్ దక్కకపోవడంతో కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్‌లోకి తిరిగి వచ్చారు. ఆ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచే వరంగల్ కాంగ్రెస్‌లో ఆమె ఆధిపత్యం, స్థానిక నేతలతో సంబంధాలపై చర్చలు మొదలయ్యాయి.

2.ఎర్రబెల్లి స్వర్ణతో ఆధిపత్య పోరు
వరంగల్ రాజకీయాల్లో కొండా సురేఖ వర్సెస్ ఎర్రబెల్లి స్వర్ణ విభేదాలు చాలాకాలంగా కొనసాగుతున్నాయి. 2018లోనే జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు మొదలయ్యాయని, ఆ తర్వాత కూడా ఈ ఆధిపత్య పోరు కొనసాగిందని నివేదికలు పేర్కొన్నాయి.

3. 2023 నుంచి మళ్లీ తెరపైకి విభేదాలు
2023లో వరంగల్ తూర్పు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి మంత్రి అయిన తర్వాత సురేఖ రాజకీయ ప్రాధాన్యం భారీగా పెరిగింది. అయితే అదే సమయంలో నియోజకవర్గంలోకి ఇతర పార్టీల నేతల చేరికలు ఆమెకు అసంతృప్తి కలిగించాయి. తనకు సమాచారం ఇవ్వకుండా ఇతర నేతలను కాంగ్రెస్‌లోకి ఎలా తీసుకుంటారని ఆమె బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.

4. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన వ్యవహారం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరంగల్‌లో పార్టీ వర్గాల మధ్య గొడవల నేపథ్యంలో మంత్రి హోదాలో కొండా సురేఖ పరకాల నియోజకవర్గంలోని గీసుకొండ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి హంగామా చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి.

5. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతల ఫిర్యాదులు
సురేఖ, ఆమె భర్త కొండా మురళి వ్యవహార శైలిపై వరంగల్ కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయాలను పక్కనపెట్టి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఏఐసీసీకి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయి.

6. 2024.. సమంత-నాగచైతన్య విడాకుల వ్యాఖ్యలు
ఇది కొండా సురేఖ పొలిటికల్‌ కెరీర్‌లోనే అత్యంత పెద్ద వివాదాల్లో ఒకటిగా మారింది. మంత్రి హోదాలో ఉండగా.. నటి సమంత, నాగచైతన్య విడిపోవడానికి అప్పటి బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ కారణమంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాజకీయ విమర్శలు కాస్తా సినీ పరిశ్రమలోకి వెళ్లడంతో పలువురు సినీ ప్రముఖులు ఆమె వ్యాఖ్యలను ఖండించారు. కేటీఆర్ ఆమెకు లీగల్ నోటీసు పంపగా, ఆ తర్వాత పరువునష్టం కేసు వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. రాజకీయంగా కేటీఆర్‌ను టార్గెట్ చేయాలనుకున్న సందర్భంలో చేసిన ఆమె వ్యాఖ్యలు.. చివరకు ఆమెపైనే పెద్ద రాజకీయ, న్యాయపరమైన వివాదంగా మారాయి.

7. రకుల్ ప్రీత్ సింగ్ పేరును ప్రస్తావించడంపై వివాదం
సమంత వివాదం సమయంలోనే నటి రాకుల్ ప్రీత్ సింగ్ పేరును కూడా సురేఖ ప్రస్తావించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రాకుల్ కూడా సురేఖ తన పేరును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించారని తీవ్రంగా స్పందించారు.

8. 2025.. మేడారం పనులు, పొంగులేటితో విభేదాలు
2025లో మేడారం పనులు, టెండర్ల విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో సురేఖకు విభేదాలు బయటపడ్డాయి. తన శాఖ వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకుంటున్నారన్న అభ్యంతరాలు సురేఖ వర్గం నుంచి వచ్చాయి. ఈ వివాదం క్రమంగా కాంగ్రెస్‌లో అంతర్గత వర్గపోరుగా మారింది.

9.కొండా మురళి వర్సెస్ పొంగులేటి
సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కూడా పొంగులేటిపై బహిరంగంగా విమర్శలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇన్‌చార్జ్ మంత్రిగా పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ ఏఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

10. మాజీ OSD సుమంత్ అరెస్ట్ ఎపిసోడ్
2025లో కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆమె జూబ్లీహిల్స్ నివాసానికి వెళ్లిన ఘటన మరో పెద్ద వివాదానికి దారితీసింది. పోలీసులు సుమంత్‌ను అదుపులోకి తీసుకునేందుకు రావడం, ఆ సమయంలో సురేఖ కుమార్తె సుస్మిత అభ్యంతరం వ్యక్తం చేయడం, అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సన్నిహితులపై రాజకీయ కుట్ర ఆరోపణలు చేయడం తీవ్ర చర్చకు దారితీశాయి. సురేఖ క్యాబినెట్ సమావేశానికి గైర్హాజరు కావడంతో వ్యవహారం మరింత ముదిరింది.

11. బీసీ వర్సెస్ రెడ్డి రాజకీయ వివాదం
ఈ ఎపిసోడ్‌లో సుస్మిత చేసిన వ్యాఖ్యలు మరో రాజకీయ చర్చకు తెరతీశాయి. బీసీ సామాజికవర్గానికి చెందిన తన తల్లిని కొందరు రెడ్డి నేతలు అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించడం కాంగ్రెస్‌లో తీవ్ర చర్చకు కారణమైంది.

12. 2025-26.. వరంగల్ కాంగ్రెస్‌లో గ్రూప్ వార్
వరంగల్ కాంగ్రెస్‌లో సురేఖ వర్గం, ఇతర నేతల మధ్య విభేదాలు కొనసాగాయి. ఆమెకు వ్యతిరేకంగా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదులు చేయడం వరుసగా జరిగింది.

13. 2026.. ఎర్రబెల్లి స్వర్ణతో మళ్లీ ఢీ
2026లో మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి విషయంలో ఎర్రబెల్లి స్వర్ణకు ప్రాధాన్యం దక్కడంతో మరోసారి కొండా వర్గం అసంతృప్తి చర్చకు వచ్చింది. 2018 నుంచి కొనసాగుతున్న ఆధిపత్య పోరు ఇంకా ముగియలేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

14. 2026.. కొండా కుటుంబం వర్సెస్ కాంగ్రెస్ నాయకత్వం
2026లో కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలతో మరోసారి కాంగ్రెస్‌లో కలకలం రేగింది. సీఎం రేవంత్‌రెడ్డిపై వచ్చిన వ్యాఖ్యల నేపథ్యంలో సురేఖపై కూడా పార్టీ క్రమశిక్షణ చర్యల డిమాండ్ వచ్చింది. విషయం చివరకు కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి వెళ్లింది.

15. ప్రస్తుతం.. రేవంత్‌తో నేరుగా ఢీ
తాజాగా ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానంతో భేటీ అనంతరం సురేఖ స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డిపై ప్రశ్నలు సంధించారు. పార్టీలో తన విషయంలో ఒక రకంగా, ఇతర నేతల విషయంలో మరో రకంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను మహిళను, బీసీ నేతను కావడంతోనే టార్గెట్ చేస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు. ఇక సీఎం రేవంత్‌రెడ్డి సైతం సురేఖపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిసింది. ఆమెను కేబినెట్ నుంచి తప్పించే అవకాశం ఉందన్న ప్రచారం కూడా ప్రస్తుతం తీవ్రంగా సాగుతోంది. అయితే తుది నిర్ణయం ఇంకా అధికారికంగా వెలువడలేదు.

మొత్తంగా చూస్తే.. కొండా సురేఖ రాజకీయ ప్రయాణంలో ప్రత్యర్థి పార్టీలతో పోరాటం ఎంత కనిపిస్తుందో.. సొంత పార్టీలో అంతర్గత పోరాటం కూడా అంతే కనిపిస్తోంది. తాజాగా వ్యవహారం ఏకంగా గాంధీభవన్ దాటి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల వద్దకు చేరడంతో.. ఈసారి వివాదానికి ఎలాంటి ముగింపు ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement