సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటకు చెందిన ల్యాదెల్ల రాజు మృతదేహంపై గాయాల గుర్తులున్నా, గుండెపోటుతో సహజ మరణంగా కేసును మూసివేయడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోసారి ఫోరెన్సిక్ అభిప్రాయం తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఉస్మానియా జనరల్ ఆస్పత్రి ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం అధిపతికి పోలీసులు లేఖ రాయాలని ఆదేశించింది.
పోస్టుమార్టం నివేదిక, మృతదేహం ఫొటోలు, గతంలో ఇచ్చిన ఫోరెన్సిక్ అభిప్రాయాలతో పాటు సంబంధిత రికార్డులన్నింటినీ పంపించాలని స్పష్టం చేసింది. తాజా ఫోరెన్సిక్ అభిప్రాయం అందిన అనంతరం పోలీసులు చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కొత్తగా ఇచ్చే అభిప్రాయం కాపీని పిటిషనర్‌కు కూడా అందించాలని ఆదేశించింది.
ఈ ప్రక్రియను ఉత్తర్వుల కాపీ అందిన తేదీ నుంచి మూడు నెలల్లో పూర్తి చేయాలని గడువు విధిస్తూ.. విచారణ ముగించింది. తన భర్త రాజు మృతి కేసులో పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడం లేదంటూ ప్రియాంక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశా రు. ఈ పిటిషన్‌పై జస్టిస్ తంగిరాల మాధవీ దేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. మరో సారి అన్ని పరీక్షలు నిర్వహించి, నివేదికలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.


