సాక్షి, ములుగు: ములుగు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కర్రెగుట్టల అడవుల్లో మావోయిస్టులు అమర్చినట్లు భావిస్తున్న ల్యాండ్‌మైన్ పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో, ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కర్రెగుట్టల్లో ఇంకా మందుపాతరలు ఉన్నాయా? అనే ఆందోళన నెలకొంది.
వివరాల మేరకు.. వెంకటాపురం మండలం నూగురు గ్రామానికి చెందిన మడకం నాగేశ్వరరావు బుధవారం సాయంత్రం ఆవులు మేపేందుకు కర్రెగుట్ట అడవి ప్రాంతానికి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ అడవిలో అమర్చిన ల్యాండ్‌మైన్‌పై అడుగుపెట్టడంతో భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ పేలుడు ఘటనతో నూగురు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
పేలుడుకు సంబంధించిన సమాచారం అందుకున్న గ్రామస్తులు కాలినడకన అడవిలోకి వెళ్లి నాగేశ్వరరావు మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. అయితే, ఆపరేషన్ కగార్‌కు ముందు కర్రెగుట్టల అడవుల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి: బైనాక్యులర్ ఎందుకు ఎత్తుకెళ్లారు?


