అనుమానంతో భార్యను చంపిన భర్త | Shocking Crime Incident In Siricilla | Sakshi
Sakshi News home page

అనుమానంతో భార్యను చంపిన భర్త

Sep 3 2026 7:32 AM | Updated on Sep 3 2026 7:32 AM

Shocking Crime Incident In Siricilla

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అనుమానం పెనుభూతంగా మారి కట్టుకున్న భార్యను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు ఓ భర్త. కూతురిపై దాడి చేస్తున్న క్రమంలో అడ్డువచ్చిన అత్త కూడా కత్తిపోట్లకు గురై కరీంనగర్‌ ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర ఒడ్డరికాలనీలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ ఓదెల వెంకటేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం... రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర వడ్డెరకాలనీకి చెందిన గండికోట చంద్రయ్య–ఎల్లవ్వ దంపతుల కూతురు జ్యోతి(28)ని ముస్తాబాద్‌ మండలం చీకోడుకు చెందిన పల్లపు సురేష్‌కు ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం చేశారు. 

కొంతకాలం వీళ్ల కాపురం సజావుగా సాగి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు జన్మించారు. కొంతకాలంగా దంపతుల మధ్య కలహాలు చోటుచేసుకున్నాయి. ఎనిమిది నెలల క్రితం రెండుసార్లు చీకోడులో జ్యోతిని చంపడానికి సురేష్‌ ప్రయతి్నంచాడు. ఒకరోజు నిద్రిస్తుండగా దిండుతో చంపడానికి ప్రయతి్నంచగా.. తప్పించుకొని తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. దీంతో వారు వెళ్లి జ్యోతిని పుట్టింటికి తీసుకొచ్చారు. అప్పుడు జ్యోతి ఫిర్యాదుతో ముస్తాబాద్‌ ఠాణాలో సురేష్‌పై కేసు నమోదైంది. అప్పటి నుంచి ఎనిమిది నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది. గ్రామానికి సమీపంలో ఉన్న అర్బన్‌పార్క్‌లో మృతురాలు జ్యోతి దినసరి కూలీగా పని చేస్తుంది.

 ఆమె మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని అనుమానంతో సురేష్‌ పలుమార్లు జ్యోతిని, వారి బంధువులను దూషించాడు. ఈ క్రమంలో సురేష్‌ మరో ముగ్గురితో కారులో వచ్చి పదిర బస్టాండ్‌లో మధ్యాహ్నం నుంచి జ్యోతి కోసం కాపు కాశాడు. జ్యోతి తన తల్లి ఎల్లవ్వతో కలిసి కరీంనగర్‌ ఆస్పత్రిలో చూపించుకోవడానికి వెళ్లింది. చీకటి పడే సమయంలో బస్సు దిగి ఒడ్డెరకాలనీకి వెళ్తుండగా వెంబడించి కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన అత్తపై కూడా కత్తితో దాడి చేశాడు. జ్యోతి మృతి చెందినట్లు నిర్ధారించుకొని కత్తిని అక్కడే వదిలేసి అదే కారులో పరారయ్యాడు. నిందితుడు సురేష్‌ సిరిసిల్ల పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది. మృతురాలికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement