బైనాక్యులర్‌ ఎందుకు ఎత్తుకెళ్లారు? | Secunderabad Madras Regiment Reports Theft of 12 Weapons | Sakshi
Sakshi News home page

బైనాక్యులర్‌ ఎందుకు ఎత్తుకెళ్లారు?

Sep 3 2026 5:58 AM | Updated on Sep 3 2026 5:58 AM

Secunderabad Madras Regiment Reports Theft of 12 Weapons

ఆయుధాలను రాత్రి పూట వాడేందుకు తీసుకెళ్లారా? 

ఉగ్రవాద ముఠాలకు, అంతర్రాష్ట్ర నేరగాళ్లకు సరఫరా చేసేందుకే చోరీ చేశారా? 

ఆ అవసరం ఎవరికుందనే కోణంలో ఆరా 

ముఖ్య అధికారులంతా రాజస్తాన్‌ పోఖ్రాన్‌ ఫైరింగ్‌ రేంజ్‌కు.. 

అదేసమయంలో అదునుచూసి పక్కా వ్యూహంతో దొంగతనం 

పూర్తి అవగాహన ఉన్న లోపలి వ్యక్తుల హస్తంపై నజర్‌ 

అన్ని కోణాల్లో దర్యాప్తు..అడుగడుగునా జల్లెడ పడుతున్న పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలోని బొల్లారం 20 మద్రాస్‌ రెజిమెంట్‌ ఆయుధాగారం (కోటే) తాళాలు పగలగొట్టి 12 అత్యాధునిక ఆయుధాలు, 1,800కు పైగా రౌండ్ల తూటాలను దుండగులు అపహరించిన ఘటన దేశ రక్షణ శాఖను కుదిపేస్తోంది. మాయమైన వాటిలో 4 అత్యాధునిక ఏకే–203 అసాల్ట్‌ రైఫిళ్లు, ఒక ఇన్సాస్‌ రైఫిల్, 7 పిస్టళ్లు ఉన్నాయి. అయితే, ఈ భారీ ఆయుధాల సంపదతో పాటు దుండగులు ప్రత్యేకంగా ఒక ‘ప్యాసివ్‌ నైట్‌ విజన్‌ బైనాక్యులర్‌’(రాత్రి వేళల్లో చూసేందుకు ఉపయోగపడే అత్యాధునిక పరికరం) కూడా ఎత్తుకెళ్లడం ఇప్పుడు ఇంటెలిజెన్స్‌ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

అసలు తుపాకులతో పాటు ఈ బైనాక్యులర్‌ను ఎందుకు టార్గెట్‌ చేశారు? చీకటి సామ్రాజ్యంలో దీని అవసరం ఏముంటుంది? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కేవలం తుపాకులు, బుల్లెట్లు ఉంటే సరిపోదు, వాటిని అర్ధరాత్రి వేళల్లో శత్రువులపై లేదా లక్ష్యాలపై ఖచి్చతత్వంతో ప్రయోగించాలంటే ’చూపు’ అత్యంత అవసరం. సాధారణంగా నేరగాళ్లు లేదా ఉగ్రవాద మూఠాలు రాత్రి సమయాల్లోనే తమ కార్యకలాపాలను సాగిస్తుంటారు. ఘటనా స్థలంలో దొంగిలించిన ఏకే–203 రైఫిళ్లు రాత్రి వేళల్లో కూడా శత్రువులను తుదముట్టించగల సామర్థ్యం ఉన్నవి. వీటికి తోడుగా ఈ ’ప్యాసివ్‌ నైట్‌ విజన్‌ బైనాక్యులర్‌’ ఉంటే చీకట్లో సైతం వందల మీటర్ల దూరంలో ఉన్న కదలికలను స్పష్టంగా గమనించవచ్చు. 

అంటే, దొంగిలించిన ఆయుధాల శక్తిని రాత్రి పూట వంద శాతం ఉపయోగించుకోవడానికే ఈ పరికరాన్ని పక్కా ప్లాన్‌తో ఎత్తుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయుధాలతో పాటు ఆపరేషనల్‌ సపోర్ట్‌ ఇచ్చే నైట్‌ విజన్‌ పరికరాన్ని కూడా ఎత్తుకెళ్లడం వెనుక తీవ్రమైన కుట్ర దాగి ఉందని అనుమానిస్తున్నారు. రాత్రి వేళల్లో అడవులు లేదా కొండ ప్రాంతాల్లో దాక్కుని పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడే ఉగ్రవాద ముఠాలకు లేదా అంతర్రాష్ట్ర నేరగాళ్లకు వీటిని సరఫరా చేసేందుకే ఈ చోరీ జరిగిందా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.  

మిస్టరీగా మారిన దోపిడీ.. 
చోరీ గుట్టును రట్టు చేసేందుకు మల్కాజ్‌గిరి పోలీస్, ప్రత్యేక ఆపరేషన్ల బృందాలు, మిలిటరీ ఇంటెలిజెన్స్‌ సంయుక్తంగా రంగంలోకి దిగాయి. నిందితుల కోసం మొత్తం ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపును తీవ్రతరం చేశారు. ఈ మిలిటరీ స్థావరం చుట్టూ 15 అడుగుల ఎత్తైన గోడ ఉండటంతో పాటు కొన్ని చోట్ల పాక్షిక ఫెన్సింగ్‌ ఉంది. ఆయుధాగారం మొత్తం ప్రాంగణానికి మధ్యలో ఉంటూ ఎల్లప్పుడూ సాయుధ బలగాల కాపలాలో ఉంటుంది. ఈ సైనిక స్థావరానికి మూడు ప్రత్యేక ద్వారాలు ఉన్నాయి. ఒక గేట్‌ నేరుగా రాష్ట్రపతి నిలయం వైపునకు దారితీస్తుంది. 

మిగిలిన రెండు గేట్లు అల్వాల్, బొల్లారం వైపునకు వెళ్తాయి. ప్రతి గేటు వద్ద రాత్రి వేళల్లో ముగ్గురు సాయుధ సైనికులు, పగటిపూట ఇద్దరు సైనికులు కాపలాగా ఉంటారు. వీటన్నింటికీ అదనంగా, డిఫెన్స్‌ సెక్యూరిటీ కారŠప్స్‌ (డీఎస్సీ)కి చెందిన ప్రత్యేక మిలిటరీ యూనిట్‌ సాయుధ బలగాలు, మిలిటరీ పోలీస్‌ నిరంతరం ఈ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తుంటాయి. చోరీ జరిగిన ఘటనా స్థలానికి అత్యంత సమీపంలో ఉన్న ఒక గేట్‌ కౌకూర్‌ వైపునకు దారితీస్తుంది. 

ఇది ఆయుధాల నిల్వ కేంద్రానికి కేవలం 200 మీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. ఇంతటి భద్రత నడుమ సాధారణ పౌరులెవరూ ఇంతటి కట్టుదిట్టమైన రక్షణ వలయాన్ని దాటి లోపలికి వచ్చే సాహసం చేయలేరని, ఈ చోరీ సాధారణ దొంగల పని కాదని ఆయుధాగారంలో ఏ బాక్స్‌లలో ఏమున్నాయి? ఏ పరికరం దేనికి ఉపయోగపడుతుంది? అనే పూర్తి అవగాహన ఉన్న లోపలి వ్యక్తుల హస్తం ఇందులో ఖచ్చితంగా ఉందని అధికారులు భావిస్తున్నారు.

బెటాలియన్‌ లేని సమయం చూసి స్కెచ్‌.. 
ఈ చోరీ వెనుక ఉన్న పక్కా వ్యూహాన్ని పోలీసులు, ఆర్మీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ బెటాలియన్‌కు చెందిన ప్రధాన సైనిక విభాగాలు, కమాండింగ్‌ ఆఫీసర్, ఇతర సీనియర్‌ అధికారులు ఫీల్డ్‌ ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ కోసం రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ ఫైరింగ్‌ రేంజ్‌కు వెళ్లారు. ఆ సమయంలో యూనిట్‌ బాధ్యతలను సెకండ్‌ ఇన్‌ కమాండ్‌ (లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా అధికారి) చూసుకుంటున్నారు. క్యాంప్‌లో ప్రధాన సైన్యం లేని తరుణాన్ని చూసి గత నెల 30 (ఆదివారం) మధ్య రాత్రిని సరిగ్గా వాడుకుని ఈ అత్యాధునిక ఆయుధాలను చోరీ చేశారు. చోరీ జరిగిన రోజుతో పాటు, గత కొన్ని వారాలుగా ఆయుధాగార భద్రతలో డ్యూటీ చేసిన ప్రతి ఒక్కరి సైనిక రికార్డులను, వారి విశ్వసనీయతను విచారణ కమిటీ నిశితంగా పరిశీలిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement