విద్యార్థుల సొమ్ము అధికారులే కొట్టేసినట్టు
విచారణలో వెలుగులోకి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయానికి (జేఎన్‌టీయూహెచ్) అనుబంధంగా జగిత్యాలలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో ఉపకార వేతనాలు లేని విద్యార్థులు నేరుగా హాస్టల్ ఫీజులు చెల్లిస్తారు. ఈ ఫీజు మొత్తంలో నిబంధనల ప్రకారం జీఎస్టీ చెల్లించాలి. జీఎస్టీ అకౌంట్‌కు వెళ్లాల్సిన ఈ మొత్తం ఆ కాలేజీలో పనిచేసే ఓ ఉద్యోగి అకౌంట్‌లోకి వెళ్లింది. దీనిపై ఫిర్యాదులు రావడంతో జేఎన్‌టీయూహెచ్ అధికారులు అప్రమత్తమయ్యారు. గత నెల 31వ తేదీన ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్థిక అవకతవకలు జరిగినట్టు తెలియడం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి ఈ వ్యవహారంతో సంబంధం ఉందని కమిటీ తేల్చడంతో కొడిమ్యాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కొన్నేళ్లుగా ఈ వ్యవహారం జరుగుతోందని విచారణ కమిటీ గుర్తించినట్టు తెలిసింది. అయితే..కేవలం గత ఏడాది నుంచి జరిగిన అవకతవకల వరకు మాత్రమే విచారణ చేపట్టాలని విచారణ కమిటీపై ఒత్తిడి తేవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పూర్తిస్థాయి విచారణ జరిగితే ప్రస్తుతం కీలక స్థానాల్లో ఉన్న మరికొంతమంది పాత్ర వెలుగు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కారణంగానే విచారణ నివేదికను కూడా మార్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం జేఎన్‌టీయూ వీసీ కార్యాలయంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి గతంలో జగిత్యాల కాలేజీలో పనిచేశారు.
ఆయన కాలం నుంచీ జీఎస్టీ నిధుల గోల్‌మాల్ జరిగినట్టు కమిటీ గుర్తించినట్టు తెలిసింది. వీసీ అండదండలు పుష్కలంగా ఉన్న కారణంగా ఆయన పాత కథను తెరమరుగు చేసే ప్రయత్నం జరిగిట్టు సమాచారం. కేవలం తాను అక్కడి నుంచి రిలీవ్ అయిన కాలం నుంచే విచారణ చేపట్టాలని కమిటీపై ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి 2017 నుంచి కొన్ని లక్షల్లో గోల్‌మాల్ అయితే, కమిటీ నివేదికను మాత్రం రూ. 5,23,071గా పేర్కొనడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.


