జాతీయ జలభద్రతకు ఏకీకృత కార్యాచరణ ఉండాలి | Uttam at the Jal Sanchay Jan Bhagidari conference held in New Delhi | Sakshi
Sakshi News home page

జాతీయ జలభద్రతకు ఏకీకృత కార్యాచరణ ఉండాలి

Sep 3 2026 4:36 AM | Updated on Sep 3 2026 4:35 AM

Uttam at the Jal Sanchay Jan Bhagidari conference held in New Delhi

సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాల పునరుద్ధరణకు కేంద్రం సహకరించాలి 

న్యూఢిల్లీలో జరిగిన ‘జల్‌ సంచయ్‌ –జన్‌ భాగీదారీ’సదస్సులో మంత్రి ఉత్తమ్‌

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చేపట్టే ప్రతి జల సంరక్షణ పనిని ఒకే జలభద్రతా ప్రణాళిక పరిధిలోకి తీసుకురావాలని, ఏకీకృత కార్యాచరణతోనే ఇది సాధ్యమవుతుందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలోని సుష్మా స్వరాజ్‌ భవన్‌లో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ బుధవారం నిర్వహించిన తొలి ‘జల్‌ సంచయ్‌–జన్‌ భాగీదారీ’సదస్సులో ఉత్తమ్‌ ప్రసంగించారు. జలభద్రతను కేవలం ఇంజనీరింగ్‌ పనులుగానో, ప్రభుత్వ శాఖల కార్యక్రమంగానో చూడకూడదన్నారు. 

తాగునీరు, వ్యవసాయం, గ్రామీణ జీవనోపాధి, పర్యావరణ పరిరక్షణ ముడిపడి ఉన్న ఈ అంశాన్ని ప్రజా ఉద్యమంగా మలచాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉపాధి హామీ, పీఎంకేఎస్‌వై, ఆర్థిక సంఘం నిధులు, కాంపా, సీఎస్‌ఆర్‌ తదితర మార్గాల్లో జల సంరక్షణ పనులు జరుగుతున్నాయని, ఈ కార్యక్రమాల మధ్య సమన్వయం లోపిస్తే ఆశించిన ఫలితాలు రావు అని హెచ్చరించారు. ఎన్ని నిర్మాణాలు చేపట్టామన్నది కాకుండా ఎంత నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది..భూగర్భ జలాలు ఎంత మేర వృద్ధి చెందాయన్న ఫలితాల ఆధారంగా పనితీరును అంచనా వేయాలని సూచించారు. 

ముందంజలో తెలంగాణ
జల సంరక్షణలో తెలంగాణ అత్యుత్తమ పనితీరు కనబరుస్తోందని ఉత్తమ్‌ తెలిపారు. 2025 ‘జల్‌ సంచయ్‌–జన్‌ భాగీదారీ’లో రాష్ట్రం బెస్ట్‌ పెర్ఫార్మర్‌గా గుర్తింపు పొందిందని, దేశంలోని టాప్‌–50 జిల్లాల్లో తెలంగాణ నుంచి 13 జిల్లాలు నిలవడం దీనికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో 44,360 చెరువులు, జలవనరులు ఉండగా, అందులో 28,739 వనరుల్లో పనులు చేపట్టామని, ఇప్పటికే 22,428 చోట్ల పునరుద్ధరణ పూర్తయిందని వివరించారు. రాష్ట్రంలోని 74 భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల ద్వారా 74.51 లక్షల ఎకరాలకు సాగునీటి సామర్థ్యం సృష్టించగా, మరో 53.18 లక్షల ఎకరాలను వాస్తవ రూపంలోకి తీసుకురావాల్సి ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement