ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
54 మంది ప్రయాణికులకు తప్పిన ముప్పు
కరీంనగర్ జిల్లా సుందరగిరి శివారులో ఘటన
చిగురుమామిడి/హుస్నాబాద్: ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. 54 మందితో వెళ్తున్న బస్సు డ్రైవర్ గుంతలను తప్పించబోయి అదుపు తప్పగా నేరుగా రోడ్డుపక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ముందు టైర్లు బావిపైకి వెళ్లగా.. డ్రైవర్ అప్రమత్తమై బ్రేక్ వేయడంతో ప్రాణాపాయం తప్పింది. డ్రైవర్ కండక్టర్‌తో సహా 56 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి శివారులో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
స్థానికులు, ప్రయాణికుల వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుంచి ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు 60 మంది ప్రయాణికులతో కరీంనగర్‌కు బయల్దేరింది. ఆరుగురు ప్రయాణికులు కొండాపూర్‌లో దిగారు. సుందరగిరి సమీపంలో కల్వర్టు నిర్మాణం కోసం మట్టిపోయడంతో గుంతలు ఏర్పడ్డాయి. వాటిని తప్పించే క్రమంలో డ్రైవర్ బస్సును కుడివైపు తిప్పాడు. అయినా గుంతల్లో పడిన బస్సు అదుపుతప్పింది. అదే సమయంలో స్టీరింగ్ లింక్ రాడ్డు విరిగి, నేరుగా రోడ్డుకు కుడివైపు ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది.
డ్రైవర్ అప్రమత్తమై బ్రేక్ వేయడంతో ముందు చక్రాలు బావిపై వేలాడుతూ బస్సు నిలిచిపోయింది. సమాచారం అందుకున్న సర్పంచ్ జంగ శిరీష, సింగిల్‌విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి, ఉపసర్పంచ్ రాజు, గ్రామస్తులు అక్కడికి చేరుకుని ప్రయాణికులను సురక్షితంగా బస్సులోంచి దింపారు. పలువురికి స్వల్పగాయాలు కాగా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించారు. చిగురుమామిడి తహసీల్దార్ కనకయ్య, ఎస్సై జగదీశ్వర్, హుస్నాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. జేసీబీ సాయంతో బస్సును అక్కడి నుంచి తొలగించారు.


