ఆ బరాజ్‌కు ఫిదా.. ‘కరెంట్‌’కు ఆదా! | Electricity bill expenditure of Rs 385 crore to be saved annually | Sakshi
Sakshi News home page

ఆ బరాజ్‌కు ఫిదా.. ‘కరెంట్‌’కు ఆదా!

Sep 3 2026 4:41 AM | Updated on Sep 3 2026 4:41 AM

Electricity bill expenditure of Rs 385 crore to be saved annually

ఏటా తప్పనున్న రూ.385 కోట్లు కరెంట్‌ బిల్లుల వ్యయం  

తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బరాజ్‌ నిర్మించాలి 

అక్కడి నుంచి సుందిళ్లకు గ్రావిటీతో 80 టీఎంసీలు తరలించాలి 

మేడిగడ్డ నుంచి టీఎంసీ నీళ్లను తోడడానికి రూ.2.78 కోట్లు వ్యయం

అన్నారం నుంచి టీఎంసీ నీళ్లను తోడడానికి రూ.2.01 కోట్ల ఖర్చులు 

రెండు బరాజ్‌ల నుంచి 80 టీఎంసీలఎత్తిపోతకు ఏటా రూ.385.5 కోట్ల వ్యయం 

152 మీటర్ల ఎత్తుతో ఒక్క గ్రామం మునగదు.. ఒక్క కుటుంబం నివాసం కోల్పోదు 

సీడబ్ల్యూసీ చైర్మన్‌ నేతృత్వంలో మహారాష్ట్రతో సంప్రదింపుల్లో తెలంగాణ ప్రజెంటేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేద్కర్‌ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బరాజ్‌ నిర్మించి గ్రావిటీ ద్వారా 80 టీఎంసీల నీళ్లను నేరుగా సుందిళ్ల బరాజ్‌కు తరలిస్తే ఏటా రూ.385.5 కోట్ల విద్యుత్‌ బిల్లుల వ్యయం ఆదా కానుంది. ఎత్తిపోతల పథకాల విద్యుత్‌ చార్జీలు యూనిట్‌కు రూ.6.30పైసలు కాగా, టీఎంసీ నీళ్లను మేడిగడ్డ గడ్డ బరాజ్‌ నుంచి తోడేందుకు రూ.2.78 కోట్లు, అన్నారం బరాజ్‌ నుంచి తోడేందుకు రూ.2.01 కోట్ల విద్యుత్‌ చార్జీల వ్యయం కానుంది. 

ఈ లెక్కన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌ నుంచి 80 టీఎంసీలను అన్నారం బరాజ్‌లోకి ఎత్తిపోయడానికి రూ.222.6 కోట్ల విద్యుత్‌ చార్జీల వ్యయం కానుంది. ఇక అన్నారం బరాజ్‌ నుంచి 80 టీఎంసీలను సుందిళ్ల బరాజ్‌కు ఎత్తిపోస్తే మరో రూ.160.90 కోట్ల విద్యుత్‌ బిల్లుల ఖర్చు కానుంది. దీనికి ప్రత్యామ్నాయంగా తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్‌ నిర్మించి 80 టీఎంసీల నీళ్లను గ్రావిటీ ద్వారా నేరుగా సుందిళ్ల బరాజ్‌కు తరలిస్తే పైన పేర్కొన్న రెండు ఖర్చులు కలిపి మొత్తం రూ.385.5 కోట్ల విద్యుత్‌ బిల్లులు ఆదా కానున్నాయి.  

ఆదాపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌..
తుమ్మిడిహెట్టి బరాజ్‌ నిర్మాణానికి మహారాష్ట్ర సమ్మతి ఇప్పించాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన విజ్ఞప్తిపై బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) చైర్మన్‌ అనుపమ్‌ ప్రసాద్‌ తెలంగాణ, మహారాష్ట్ర అధికారులతో నిర్వహించిన సంప్రదింపులు నిర్వహించారు. తెలంగాణ అధికారులు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై ఇ చ్చిన సమగ్ర పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుతో పోల్చితే తుమ్మిడిహెట్టి బరాజ్‌తో ఆదా కానున్న విద్యుత్‌ బిల్లుల వ్యయాన్ని లెక్కలతో సహా వివరించారు. 

కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పరిధిలోని తుమ్మిడిహెట్టి గ్రామం వద్ద వర్ధా, వెయిన్‌ గంగా నదులు సంగమించే ప్రాంతం వద్ద 152 మీటర్ల ఎత్తులో బరాజ్‌ నిర్మిస్తేనే 80 టీఎంసీల నీళ్లను తరలించుకోవడానికి వీలుండనుంది. గ్రావిటీతో ఈ మేరకు నీళ్లను తరలిస్తే భారీ పంపులు, మోటార్ల అవసరం లేకుండా విపరీతమైన విద్యుత్‌ ఖర్చులు మిగులుతాయి. గతంలో మహారాష్ట్ర, తెలంగాణ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు బరాజ్‌ ఎత్తును 148 మీటర్లకు పరిమితం చేస్తే మళ్లించగలిగే నీళ్లు 43 టీఎంసీలకు పడిపోతాయి.  

ముంపు ఉండదు.. పునరావాసం అక్కర్లేదు
తుమ్మిడిహెట్టి బరాజ్‌ను 152 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే 3,875 హెక్టార్ల భూమి ముంపునకు గురవుతున్నప్పటికీ, అందులో 2,156 హెక్టార్లు అత్యధిక భాగం నదీ పరిధిలోనే ఉండగా, 545 హెక్టార్లు చాప్రాల అటవీ/ఈకో సెన్సిటివ్‌ జోన్‌ పరిధిలోకి రానున్నాయి. ఇందులో మహారాష్ట్ర 3,086 హెక్టార్లు మహారాష్ట్ర, 789 హెక్టార్లు తెలంగాణ భూభాగంలోకి వస్తా యి. ఇక రెండు రాష్ట్రాల్లో ఒక్క గ్రామం కూడా ముంపునకు గురికాదు. ఇరు రాష్ట్రాల్లో ఏ ఒక్క కుటుంబానికి పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉండదు. తుమ్మిడిహెట్టి నుండి సుందిళ్ల బరాజ్‌కి గ్రావిటీతో నీళ్లను తరలించి అక్కడి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకి ఎత్తిపోయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. 

తుమ్మిడిహెట్టి నుంచి 76.945 కిలోమీటర్ల గ్రావిటీ కాలువ కాల్వ నిర్మాణం గతంలోనే పూర్తి చేశారు.అక్కడి నుంచి 20.9 కిలోమీటర్ల మేర సొరంగాన్ని నిర్మించాల్సి ఉంటుంది. 8.250 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వను నిర్మించి సొరంగాన్ని సుందిళ్ల బరాజ్‌తో అనుసంధానిస్తారు. వార్ధా, వెయిన్‌గంగా నదుల సంగమ స్థలంలో లంబాకారంలో 6.517 కి.మీ.ల పొడవున బరాజ్‌ నిర్మించాలనే ప్రతిపాదన ఎంతో అనుకూలమైనదని తెలంగాణ అధికారులు వివరించారు. గేట్ల నిర్వహణ, నీటి ప్రవాహ నియంత్రణ సులువవుతుందని ప్రజెంటేషన్‌లో తెలిపారు. ఇప్పటికే బరాజ్‌ నిర్మాణానికి సీడబ్ల్యూ సీ, కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి ముఖ్యమైన అనుమతు లు లభించగా, అటవీ, పర్యావరణ తుది అనుమతుల ప్రక్రి య పురోగతిలో ఉందని నీటిపారుదల శాఖ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement