సాగు ప్రాజెక్టుల కార్యసాధకుడు వైఎస్సార్‌ | Kharge presents award to MS Swaminathan Research Foundation | Sakshi
Sakshi News home page

సాగు ప్రాజెక్టుల కార్యసాధకుడు వైఎస్సార్‌

Sep 3 2026 4:51 AM | Updated on Sep 3 2026 4:51 AM

Kharge presents award to MS Swaminathan Research Foundation

ఉమ్మడి ఏపీలో వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి హయాంలోనే పోలవరం, ప్రాణహిత–చేవెళ్ల పనులు 

ఆయన కలగన్న ప్రాణహిత, కల్వకుర్తి,ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం 

డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి అవార్డు ప్రదాన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి 

ఎంఎస్‌ స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌కు అవార్డు అందించిన ఖర్గే

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి ప్రాజెక్టుల కార్యసాధకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డేనని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. పోలవరం, ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుల పనులను వైఎస్సారే ప్రారంభించారని గుర్తుచేశారు. తెలంగాణ రైతుల కష్టాలు తీర్చేందుకు ఆయన తలపెట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుతోపాటు కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులు ప్రస్తుతం ఆగిపోయాయని.. అయితే ఆయన కలగన్న ఆ ప్రాజెక్టులను పూర్తిచేసి తెలంగాణ ప్రజలకు అంకితమిస్తానని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి అవార్డు–2026 ప్రదానోత్సవ కార్యక్రమానికి రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 

నాడు సీఎంగా ఉచిత విద్యుత్‌పై వైఎస్సార్‌ తొలి సంతకం
వైఎస్సార్‌ జీవితాంతం ప్రజాశ్రేయస్సు కోసం శ్రమించారని.. 2003లో చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు ఎర్రటి ఎండల్లో సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించిన ఆయన నాడు ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ముఖ్యంగా కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్లు, ఎండిపోతున్న పంటలతో అష్టకష్టాలు పడుతున్న రైతులకు ఉచిత విద్యుత్‌ హామీ ఇచ్చి 2004లో సీఎం అయ్యాక ఆ పథకంపై తొలి సంతకం చేసి మాట నిలబెట్టుకున్న మహనీయుడని ప్రశంసించారు. 

దాదాపు రూ. 1,300 కోట్ల విద్యుత్‌ బకాయిలను రద్దు చేయడమే కాకుండా అప్పటికి రైతులపై ఉన్న వేలాది అక్రమ కేసులన్నింటినీ తొలగించిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయడం సహా ఆయన కలలుగన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అదే వైఎస్సార్‌కు నిజమైన నివాళి అని చెప్పారు. 

వైఎస్సార్‌ పేదల పక్షపాతి: ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే 
వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి పేదల పక్షపాతి అని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొనియాడారు. డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి అవార్డు–2026ను ఎంఎస్‌ స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌కు ఖర్గే ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌తోపాటు హరిత విప్లవ పితామహుడు ఎంఎస్‌ స్వామినాథన్‌ దేశానికి చేసిన విశేష సేవలను ఆయన స్మరించుకున్నారు. 17 ఏళ్ల క్రితం వైఎస్సార్‌ను కోల్పోయినా ఆయన నెలకొల్పిన ఆదర్శాలు నేటికీ సజీవంగా ఉన్నాయన్నారు. ఏ రైతు, ఏ పేద కుటుంబం కనీస అవసరాలకు నోచుకోకుండా మిగిలిపోకూడదన్నదే రాజశేఖరరెడ్డి సిద్ధాంతమని గుర్తుచేశారు. 

ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం, ఇందిరమ్మ ఇళ్ల ద్వారా గూడు, భూమిలేని వారికి భూపంపిణీ, రైతులకు ఉచిత విద్యుత్‌ వంటి విప్లవాత్మక పథకాలను అమలు చేశారని ప్రశంసించారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంతోపాటు 39 ఎంపీ స్థానాల్లో పార్టీని గెలిపించి కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటులో వైఎస్సార్‌ కీలకపాత్ర పోషించారని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్, టీపీసీపీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, గడ్డం వివేక్, ఎంపీలు సురేశ్‌ షెట్కార్, నిరంజన్‌రెడ్డి, అనిల్‌ యాదవ్, కాంగ్రెస్‌ నేతలు దిగ్విజయ్‌ సింగ్,  జైరాం రమేశ్,  కేవీపీ రామచంద్రరావు, మధుయాష్కి, సంపత్  పాల్గొన్నారు.

వైఎస్సార్, స్వామినాథన్‌ మహనీయులు: భట్టి 
రైతుల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకొచ్చిన ఇద్దరు మహనీయుల్లో ఒకరు డాక్టర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌ అయితే, మరొకరు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొనియాడారు. వ్యవసాయ రంగానికి శాస్త్ర సాంకేతిక ఫలాలను స్వామినాథన్‌ అందించారని, రైతులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందనే భరోసాను వైఎస్సార్‌ కల్పించారని చెప్పారు. 

ఆయన మరణం తర్వాత వచ్చిన ప్రభు త్వాలు సైతం విస్మరించలేని విధంగా రైతు సంక్షేమానికి వైఎస్సార్‌ బాటలు వేశారని చెప్పారు. ఆయన నేర్పిన ఓనమాలతోనే తాను ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రిగా ఎదిగేందుకు దోహదపడ్డాయన్నారు. రచ్చబండ కొనసాగాల్సిందేనని చెప్పి బయలుదేరిన ఆయన.. ఎవరికీ కనబడనంత దూరానికి వెళ్లిపోయారని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక గొప్ప నాయకుడి వారసుడిగా పార్టీ నేతలు, కార్యకర్తలంతా ముందుకు వెళ్తుండటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement