కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్నా ప్రజలకు చేసిందేమీ లేదని, ప్రతి విషయంలోనూ మోసం చేసిన ‘420 ప్రభుత్వం’గా మిగిలిపోయిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆరు గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల గొంతు కోసిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా బుధవారం ఆయన ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రైతులు, విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులు.. ఇలా ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ఆరోపించారు.
సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి తెచ్చారని, ఆరు డీఏలు, పీఆర్‌సీ, ఈహెచ్‌ఎస్ చెల్లింపుల్లో కాలయాపన చేస్తూ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధులకు రూ.4,000 పెన్షన్, రైతులకు ఎకరానికి రూ.15 వేల సాయం, ఏటా 2 లక్షల ఉద్యోగాలు, రూ.4,000 నిరుద్యోగ భృతి హామీలను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. బీసీలకు ఏటా రూ.20 వేల కోట్లు ఇస్తామన్న హామీని నీరుగార్చారని, కుల గణన పేరుతో ముస్లింలను బీసీల్లో చేర్చి అసలైన బీసీలకు అన్యాయం చేశారని విమర్శించారు.


