ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌కు రండి | CM Revanth invites Rajnath Singh to Invest Telangana Global Summit | Sakshi
Sakshi News home page

ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌కు రండి

Sep 3 2026 5:57 AM | Updated on Sep 3 2026 5:57 AM

CM Revanth invites Rajnath Singh to Invest Telangana Global Summit

కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రి వివేక్, ఎంపీలు సురేశ్‌ షెట్కార్, మల్లు రవి, అనిల్‌కుమార్‌యాదవ్, పోరిక బలరాం నాయక్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానం 

సదస్సులో భాగంగా రక్షణ ఎక్స్‌పో–2026ను ప్రారంభించాలని వినతి 

ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టు కోసం మరో 750 ఎకరాల భూసేకరణకు సిద్ధమని వెల్లడి 

డీఆర్‌డీఎల్‌ ప్రాజెక్టుకు దేవరకద్ర వద్ద 416 ఎకరాల భూకేటాయింపునకు హామీ 

పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడుతోనూ సీఎం భేటీ 

తెలంగాణలో హెలీ టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టాలని వినతి

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌–2026కు హాజరు కావాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో డిసెంబర్‌ 7 నుంచి మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో భాగంగా రక్షణ ఎక్స్‌పో–2026ను ప్రారంభించాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్‌రెడ్డి బుధవారం ఉదయం రాజ్‌నాథ్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ కార్మిక, గనుల శాఖ మంత్రి జి.వివేక్‌ వెంకటస్వామి, ఎంపీలు ఎం.అనిల్‌కుమార్‌ యాదవ్, డాక్టర్‌ మల్లు రవి, సురేశ్‌ షెట్కార్, పోరిక బలరాం నాయక్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రొటోకాల్‌) హర్కర వేణుగోపాల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్లోబల్‌ సమ్మిట్‌ లక్ష్యాలను రాజ్‌నాథ్‌కు సీఎం వివరించారు. రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వారిద్దరూ చర్చించారు.  

డిఫెన్స్‌ ఎక్స్‌పోలో లైవ్‌ డెమోలు... 
ఏరోస్పేస్, రక్షణ, అంతరిక్ష రంగాలపై ప్రత్యేక సదస్సుతోపాటు ఎయిర్‌ షో, ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్, భూఉపరితల రక్షణ వ్యవస్థలకు సంబంధించిన లైవ్‌ డెమోలు డిఫెన్స్‌ ఎక్స్‌పోలో ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి రాజ్‌నాథ్‌కు వివరించారు. ఈ దృష్ట్యా డిఫెన్స్‌ ఎక్స్‌పోకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని, ఆహూతులకు మార్గనిర్దేశం చేయాలని కోరారు. ఎయిర్‌ షో నిర్వహణకు గగనతల అనుమతుల మంజూరు చేయాలని.. యుద్ధ విమానాల భాగస్వామ్యంతోపాటు సూర్యకిరణ్, సారంగ్‌ ఏరోబాటిక్‌ బృందాల ప్రదర్శనలు ఉండేలా ఆదేశాలివ్వాలని విన్నవించారు. స్టాటిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రదర్శనకు కూడా మద్దతు అందించాలన్నారు. త్రివిధ దళాలకు చెందిన అత్యాధునిక రక్షణ వ్యవస్థల డెమోలను ఈ ఎక్స్‌పోలో ఏర్పాటు చేయాలని కోరారు. 

రక్షణ శాఖ కోరినట్లుగా భూసేకరణ... 
ఆదిలాబాద్‌ విమానాశ్రయానికి సంబంధించిన భూసేకరణ గురించి రాజ్‌నాథ్‌ సింగ్, రేవంత్‌రెడ్డి మధ్య చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 750 ఎకరాల భూమిని సేకరించిందని రేవంత్‌ చెప్పారు. ఈ విమానాశ్రయం కోసం రక్షణ శాఖ మొత్తం 1,500 కోరిందని.. ఆ మేరకు మరో 750 ఎకరాల భూసేకరణ ప్రక్రియ చేపడతామని తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలంలో డీఆర్‌డీఎల్‌ ప్రాజెక్టు కోసం 416.18 ఎకరాలను నామమాత్రపు రుసుముతో 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన కేటాయించనున్నట్లు రాజ్‌నాథ్‌కు సీఎం వివరించారు. 

విమానాశ్రయాల పనులు వేగవంతం చేయాలి... 
ఆదిలాబాద్, మామూనురు (వరంగల్‌) విమానాశ్రయాల పనులు వేగవంతం చేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడుకు సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని మంత్రి కార్యాలయంలో బుధవారం ఆయన్ను పార్టీ ఎంపీలు, అధికారులతోపాటు వెళ్లి కలిశారు. మామూనూరు విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణను పూర్తి చేసి కేంద్రానికి అప్పగించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆదిలాబాద్‌ విమానాశ్రయంలో కార్గో, ప్యాసింజర్‌ టెర్మినల్‌తోపాటు మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్‌హాలింగ్‌ (ఎంఆర్‌వో) వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. ఆదిలాబాద్‌లో రన్‌వే విషయంలో తుది నిర్ణయానికి సంబంధించి రక్షణ, పౌర విమానయాన శాఖల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. దీనిపై రామ్మోహన్‌ నాయుడు స్పందిస్తూ మామునూరు ఎయిర్‌పోర్ట్‌ టెండర్లను రెండు వారాల్లో ఆహ్వానిస్తామని చెప్పారు. డిసెంబర్‌ నాటికి ఖరారు చేసి పనులకు అదే నెలలో శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో హెలీ టూరిజం అభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్‌ కోరారు. హుస్సేన్‌సాగర్‌లో సీప్లేన్‌ ల్యాండింగ్‌కు సంబంధించిన నివేదికను రెండు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని పౌర విమానయాన అధికారులు సీఎంకు తెలియజేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement