వారికి ఉద్యోగ హోదాలు పట్టవు...
సక్సెస్‌కు లీడర్ కావాలని లేదంటారు...
పనితోపాటు లైఫ్‌నూ ఎంజాయ్ చేస్తారు...
వర్క్–లైఫ్ బ్యాలెన్స్ వారి సిద్ధాంతం!
విదేశీ చదువుల కంటే.. లోకల్ కోర్సులు మేలు అంటున్నారు!
ఎవరు వారు? ఈ తరం కుర్రాళ్లు... జెన్–జీలు!!!
‘‘పుట్టామా.. ఇంజినీరింగ్, మెడిసిన్, సీఏ లాంటి చదువులు చదివామా? మంచి ఉద్యోగం సంపాదించామా... జీవితం సక్సెస్’’ ఇది ఒకప్పటి బతుకు ఫిలాసఫీ. కానీ జెన్–జీలు ఇలా కాదంటోంది తాజా అధ్యయనం. అంతర్జాతీయ విద్యా సంస్థ ఎమిరైటస్ ‘‘ఇండియాస్ జెన్–జీ ఔట్‌లుక్ 2026: రీ కాల్కులేటింగ్ ఎడ్యుకేషన్, ఆంబీషన్ అండ్ సక్సెస్’’ పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనం నవతరం గురించి పలు ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి తెచ్చింది. 1997– 2012 మధ్య పుట్టిన వాళ్లను మనం జెన్–జీ అని పిలుస్తున్నాం కదా.. వీరు దేశంలోని ప్రధాన మెట్రోల్లోని 15 – 28 ఏళ్ల మధ్య వయసున్న సుమారు వెయ్యి మందిని ప్రశ్నించి వారి ఆశలు, ఆశయాలు, విజయానికి నిర్వచనాలను సేకరించింది. ముందు తరం నడిచిన బాటను కాదని కొత్త అడుగులు వేస్తున్న వారి గురించి స్థూలంగా..
ఉద్యోగ ప్రస్థానం...
మునుపటిలా చిన్న ఉద్యోగంతో మొదలుపెట్టి అంచలంచెలుగా పైకి ఎదగాలన్న సూత్రానికి వీరు విరుద్ధం. ఉద్యోగమిచ్చే మేనేజర్, జీఎం, వీపీ, చైర్మన్ వంటి హోదాల కంటే పనికి – జీవితానికి మధ్య బ్యాలెన్స్ ఉండాలనుకుంటున్న జెన్–జీలు సుమారు 74 శాతం. అసలు సక్సెస్‌ఫుల్ కెరియర్‌కు ఎగ్జిక్యుటివ్ లీడర్ కావాల్సిన అవసరమే లేదన్నది 65 శాతం మంది నమ్మకం. వీరి దృష్టిలో విజయం అంటే... నైపుణ్యాలు. అవసరానికి తగ్గట్టు మారిపోగలగడం. సంతృప్తినిచ్చే, అర్థవంతమైన పని.
లోకలే మేలు...
ఒకప్పుడు ఎంతో పాపులర్ అయిన విదేశీ చదువులపై జెన్–జీకి పెద్ద ఆశలేం లేవు. పెరిగిపోతున్న ఖర్చులు, వీసా నిబంధనల్లో వస్తున్న మార్పులు, చదువు తరువాత ఉద్యోగాలు వస్తాయన్న గ్యారంటీ లేకపోవడం వంటి కారణాల వల్ల నాణ్యమైన లోకల్ విద్యే మేలని 48 శాతం మంది అభిప్రాయపడ్డారు. కాలేజీ ముందునాటి చదువులు చదువుతున్న వారిలో 87 శాతం, కాలేజీల్లోకి అడుగుపెడుతున్న వారిలో 92 శాతం లోకల్ కోర్సులకు జై అంటున్నారు.
విదేశీ విద్యా సంస్థలు స్థానికంగా అందించే కోర్సుల్లో చేరేందుకు అభ్యంతరం లేదని సుమారు 69 శాతం మంది చెబుతున్నారు. ఒకట్రెండు సెమిస్టర్లకు విదేశాలకు వెళతారా? అంటే అప్పటి వరకూ విదేశీ చదువులపై ఆసక్తి చూపని వారిలోనూ 12 శాతం మంది సై అంటూండటం విశేషం.


