ఇలాంటి వాళ్లున్నందుకు ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి
పోలీసులపై నిప్పులు చెరిగిన హైకోర్టు
3 నెలలవుతున్నా.. ఓ బాలిక ఆచూకీని కనిపెట్టలేకపోయారా?
బాలిక మిస్సింగ్ కేసును తేలిగ్గా తీసుకుంటారా?
ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా కనిపెట్టలేకపోవడం ముమ్మాటికీ పోలీసుల వైఫల్యమే
ఇది పోలీసులు సిగ్గుపడాల్సిన విషయం... రాష్ట్ర పోలీసుల్లో గుంటూరు పోలీసులు చాలా గ్రేట్
సమాచార ప్రధాన కమిషనర్‌నే అడ్డుకున్న ఘనత వీరిది
మీరు సక్రమంగా దర్యాప్తు చేస్తున్నారంటే మేం నమ్మాలా?
కనిపించకుండా పోయిన బాలికను మా ముందు హాజరుపరిచి తీరాల్సిందే
ఏకంగా రాష్ట్ర డీజీపీకే హైకోర్టు ధర్మాసనం ఆదేశం
తదుపరి విచారణ నేటికి వాయిదా
కుమార్తె ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తండ్రి
సాక్షి, అమరావతి: పదవ తరగతి చదివే తన కుమార్తె కనిపించడం లేదంటూ దాదాపు మూడు నెలల క్రితం గుంటూరుకు చెందిన ఓ వ్యాపారి ఫిర్యాదు చేస్తే, పోలీసులు ఇప్పటి వరకు ఆ బాలిక ఆచూకీ తెలుసుకోలేకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు నెలల క్రితం కనిపించకుండా పోయిన బాలిక ఆచూకీని ఇప్పటివరకు కనిపెట్టలేకపోవడం సిగ్గుచేటని పోలీసులను ఉద్దేశించి హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇలాంటి పోలీసులు ఉన్నందుకు రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలంది. ఆ బాలికను కిడ్నాప్ చేశారా? ఆ బాలికను ఎవరికైనా అమ్మేశారా? అసలు ఏం జరిగిందో తేల్చారా.. అని ప్రశ్నించింది. ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ రోజుల్లో ఓ పదవ తరగతి అమ్మాయి ఆచూకీ తెలుసుకోలేకపోయారంటే అంతకన్నా సిగ్గుపడాల్సిన విషయం ఏమీ ఉండదంది. ఇన్ని రోజులైనా ఆ బాలిక ఆచూకీ కనిపెట్టలేకపోయారంటే.. ఇది ముమ్మాటికీ పోలీసుల వైఫల్యమేనని తేల్చి చెప్పింది. ‘కుమార్తె కనిపించడం లేదంటూ తండ్రి ఫిర్యాదు ఇచ్చి దాదాపు మూడు నెలలు అవుతోంది.
ఇప్పటి వరకు ఏం చేశారు? మీరు దర్యాప్తు చేస్తున్నారంటే మేం నమ్మాలా? ఓ బాలిక మిస్సింగ్ కేసును తేలిగ్గా తీసుకుంటారా? రాష్ట్ర పోలీసులందరిలో కల్లా గుంటూరు పోలీసులు చాలా గ్రేట్ (వ్యంగ్యంగా). పోలీస్‌స్టేషన్‌లోకి రాకుండా సమాచార ప్రధాన కమిషనర్‌నే అడ్డుకున్న ఘనత వీరిది. ప్రధాన కమిషనర్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా ఉంటుంది. చట్ట ప్రకారం ప్రధాన కమిషనర్‌కు తగిన ప్రోటోకాల్ ఉంది. ఆయన్నే అడ్డుకున్నారంటే, గుంటూరు పోలీసులు ఎంత గొప్పోళ్లో అర్థమవుతోంది. ఇలాంటి పోలీసులు ఉండటం ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు.’ అని హైకోర్టు నిప్పులు చెరిగింది. సదరు బాలికను షేక్ జాన్ సైదా అలియాస్ రబ్బానీ అనే వ్యక్తి తీసుకెళ్లారని తెలిసినా కూడా పోలీసులు పట్టించుకోకపోవడంపై మండిపడింది. ఆ బాలికను గురువారం తమ ముందు హాజరుపరిచి తీరాలని ఏకంగా డీజీపీనే హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ గేదెల తుహిన్ కుమార్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కుమార్తె ఆచూకీ కోసం హైకోర్టు తలుపుతట్టిన తండ్రి...
గుంటూరు భాష్యం పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న తన కుమార్తె ట్యూషన్‌కి వెళ్లి తిరిగి రాలేదంటూ గుంటూరుకు చెందిన వ్యాపారి వాసు ఈ ఏడాది జూన్ 10న పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అదే రోజున మిస్సింగ్ కేసు నమోదు చేశారు. వాసు ఒత్తిడితో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొన్ని క్లూస్ సంపాదించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ బాలిక ఆచూకీని మాత్రం తెలుసుకోలేకపోయారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరితో విసిగిపోయిన వాసు హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తెను కోర్టు ముందు హాజరుపరిచి, ఆమెను తమకు అప్పగించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఆయన హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
చేతనైతే పట్టుకోవాలని సవాలు విసిరినా పోలీసులు స్పందించడం లేదు...
ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ బట్టు దేవానంద్ ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది డీవీ శశిధర్ వాదనలు వినిపించారు. ట్యూషన్‌కు వెళ్లిన పిటిషనర్ కుమార్తె గత 80 రోజులుగా కనిపించడం లేదన్నారు. ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమైన షేక్ జాన్ సైదా అలియాస్ రబ్బానీ అనే వ్యక్తి ఆ బాలికను ట్రాప్ చేసి తీసుకెళ్లారన్న విషయం దర్యాప్తులో రూఢీ అయినట్లు పోలీసులు చెబుతున్నారని, అయితే తదుపరి ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. రబ్బానీ ఉపయోగించిన బైక్ మొదలు, సదరు బాలికను తీసుకెళ్లడం, నెల్లూరులో ఫోన్ కొనడం, కోయంబత్తూర్‌లో లాడ్జీల్లో దిగడం, అక్కడి నుంచి కేరళ వెళ్లడం, మళ్లీ అక్కడి నుంచి హైదరబాద్ రావడం వంటి వాటికి ఆధారాలు సేకరించినట్లు పోలీసులు చెబుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. చేతనైతే తనను పట్టుకోవాలని సైదా ఇన్‌స్టాలో సవాలు విసిరాడని, అయినప్పటికీ పోలీసులు ఆ బాలిక ఆచూకీని మాత్రం తెలుసుకోవడం లేదన్నారు. సైదా మొబైల్ నెంబర్, ఇన్‌స్ట్రా ఐడీ, చిరునామా కూడా పోలీసులు తెలుసుకున్నారని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, గుంటూరు పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎస్‌హెచ్‌ఓ.. ఎస్‌పీలతో ప్రయోజనం లేదు.. డీజీపీనే కరెక్ట్...
అనంతరం పోలీసుల తరఫున ప్రభుత్వ సహాయ న్యాయవాది (ఏజీపీ) కృష్ణ ప్రణీత్ స్పందిస్తూ, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. తల్లిదండ్రులతో కలిసి మూడు రాష్ట్రాలకు వెళ్లారన్నారు. ఫిర్యాదు రాగానే కేసు నమోదు చేసి, ఆ బాలిక, రబ్బాని ఎక్కడున్నారో తెలుసుకున్నామని, తీరా అక్కడి వెళ్లాక వారు అక్కడ లేరని తెలిపారు. బాలిక ఆచూకీ తెలుసుకునేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేస్తున్నారంటే తామెలా నమ్మగలమంటూ వ్యాఖ్యానించింది. ఆ బాలికను గురువారం తమ ముందు హాజరుపరిచి తీరాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. డీజీపీకి కాకుండా జిల్లా ఎస్‌పీకి ఆదేశాలు ఇవ్వాలని ప్రణీత్ కోరగా, ధర్మాసనం అందుకు నిరాకరిస్తూ, ఎస్‌హెచ్‌ఓ, ఎస్‌పీలకు ఆదేశాలిస్తే ప్రయోజనం ఉండదని, డీజీపీకే ఆదేశాలు ఇవ్వడం సబబని తేల్చి చెప్పింది.


