ప్రారంభం రోజునే ఆక్విడెక్ట్‌కు పగుళ్లు | Cracks in the aqueduct on the opening day | Sakshi
Sakshi News home page

ప్రారంభం రోజునే ఆక్విడెక్ట్‌కు పగుళ్లు

Sep 3 2026 5:23 AM | Updated on Sep 3 2026 5:23 AM

Cracks in the aqueduct on the opening day

చంద్రబాబు ఇచ్చిన హారతి ఆరకముందే డొల్లతనం బట్టబయలు 

పగుళ్ల నుంచి కుండపోతలా నీటి లీకేజీలు 

పనుల తీరుచూసి వంతెన కింద రాకపోకలు సాగించిన ప్రయాణికుల విమర్శలు 

ఏ క్షణంలో ప్రమాదం ముంచుకొస్తుందోనని బెంబేలు

సాక్షి, విశాఖపట్నం: కెమెరా ఫ్లాష్‌లు.. చంద్రబాబు హడావుడి.. నాయకుల నానాయాగీ.. పచ్చటి పందిళ్ల సెట్స్‌ మధ్య అట్టహాసంగా సాగిన ‘జలహారతి’ ఘట్టం కాస్తా ప్రారంభించిన కాసేపటికే.. జలపాత హారతిలా మారిపోయింది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గోదావరి జలాలకు స్వాగతం పలుకుతూ సాగిన ఈ సంబరం ఆవిరవ్వడానికి ఎంతో సమయం పట్టలేదు. సీఎం ఇచ్చిన హారతి ఆరకముందే ఆర్భాటపు హడావుడి వెనుక దాగిన అసలు డొల్లతనం ఇట్టే  బట్టబయలైంది. ఉత్తరాంధ్ర దాహార్తి తీరుస్తుందని గొప్పలు చెప్పుకున్న కాంక్రీట్‌æ వంతెన.. కళ్లెదుటే జలపాతంలా లీకేజీలతో నాణ్యతా లోపాలను బట్టబయలు చేసింది.  

బిక్కుబిక్కుమంటూ ప్రయాణం 
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం కేఎల్‌ పురం వద్ద పోలవరం ఎడమ కాలువ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి జలాలను బుధవారం విడుదల చేశారు. ఆ నీరు సక్రమంగా కాలువలో పారడానికి బదులు తుని–పాయకరావుపేట మధ్య తాండవ షుగర్‌ ఫ్యాక్టరీ సమీపంలో నిర్మించిన ఆక్విడెక్ట్‌ పగుళ్ల గుండా జలపాతంలా కిందకు కారిపోతోంది. వంతెన కింది నుంచి రాకపోకలు సాగించిన ప్రయాణికులు పైనుంచి జలపాతంగా పడుతున్న నీటిని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. 

ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడుతూనే బిక్కుబిక్కుమంటూ వంతెన దాటుతున్నారు. రూ.కోట్లు వెచ్చించి కట్టిన వంతెన నిర్మాణంలో ప్రారంభం రోజునే ఇన్ని లీకేజీలతో నాణ్యతా లోపం బహిర్గతమయ్యిందంటే.. ముందుముందు దీని పరిస్థితి ఏంటని జనం చంద్రబాబు ప్రభు­త్వాన్ని నిలదీస్తున్నారు.  గతంలో అమరావతిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయంలో చోటుచేసుకున్న లీకేజీల తరహాలోనే ప్రస్తుత ఘటన కూడా ఉందని విమర్శిస్తున్నారు.  

లీకులు కాదంటూ కవరింగ్‌
ఆక్విడెక్ట్‌ కాస్తా ‘జలపాతం’గా మారడంతో ఉలిక్కిపడ్డ ప్రభుత్వం, అధికారులు డొల్లతనాన్ని కప్పిపుచ్చేందుకు నానాయాతన పడుతున్నారు. హుటాహుటిన కాలువలో నీటి సరఫరాకు బ్రేకులు వేశారు. జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, క్వాలిటీ కంట్రోల్‌æ ఇంజినీర్లు ఆక్విడెక్ట్‌ వద్దకు చేరుకుని ప్యాచ్‌ వర్క్‌లు ప్రారంభించారు. ‘అబ్బే ఇదంతా ట్రయల్‌లో భాగమే. కొత్త కాలువల్లో నీరు ఒక్కసారిగా వదిలినప్పుడు చిన్నపాటి సీపేజ్‌లు రావడం సహజం’ అంటూ కవరింగ్‌ చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తుండటం కొసమెరుపు. 

రూ.4 వేల కోట్లు నీళ్లపాలేనా? 
ఉత్తరాంధ్ర ప్రాంతానికి 23.44 టీఎంసీల నీటిని తరలించాలనేది ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఇందుకోసం పోలవరం ఎడమ కాలువ పనులకు ఏకంగా రూ. 4,192 కోట్లు కేటాయించారు. ఇన్ని వేల కోట్లు ప్రజాధనం వెచ్చించిన ప్రాజెక్టులో కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే జలహారతి కార్యక్రమం ముగిసిన వెంటనే గోదావరి జలాలు ఇలా భారీగా కిందకు ప్రవహించి వృథా అవుతున్నాయని స్పష్టమవుతోంది. 

పోలవరం కాలువ ఆక్విడెక్ట్‌ లీకేజీలపై ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. కూటమి ప్రభుత్వం కేవలం కమీషన్ల కోసం కక్కుర్తిపడి కాంట్రాక్టులు కట్టబెట్టడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శించారు. ప్రజల సొమ్ముతో నాసిరకం పనులు చేస్తూ.. పైకి మాత్రం ఆర్భాటపు హారతులతో మభ్యపెట్టడం కూటమి పాలకులకే చెల్లిందని పార్టీల ప్రతినిధులే కాదు.. ప్రజలు కూడా ప్రభుత్వ వ్యవహారంపై మండిపడుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement