విద్యాభవన్ ముందు ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులు
శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి
ఎడ్యుకేషన్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఎపీటీఎఫ్ నిరసన
పలువురు ఉపాధ్యాయులు అరెస్టు.. విడుదల
మంగళగిరి రూరల్: సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని, తమిళనాడు తరహాలో శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆత్మకూరులోని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ కార్యాలయం విద్యాభవన్ ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. పోలీసులు ధర్నాకు అనుమతి లేదని నలుగురు ఉపాధ్యాయులను అరెస్ట్ చేసి, తాడేపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో ఫెడరేషన్ కార్యదర్శి కె.బసవలింగారావు, ఎండీ ఖలీల్, బొడ్డు శేఖర్, గుడిపాటి దాస్ ఉన్నారు. అనంతరం వారిని విడుదల చేశారు.
స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్‌తో చర్చలు జరపాలని, లోపలికి అనుమతించాలని టీచర్స్ కోరగా.. పోలీస్ యాక్ట్ సెక్షన్–30 అమల్లో ఉన్నందున ధర్నాలు, నిరసనకు అనుమతి లేదని వారిని అడ్డుకున్నారు. అయినప్పటికీ విద్యాభవనం ముందే టీచర్లు ధర్నా కొనసాగించారు. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల మీడియాతో మాట్లాడుతూ.. ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి శాశ్వత మినహాయింపు ఇవ్వాలని విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 23(1) సవరించాలన్నారు. టెట్‌లో ఉపాధ్యాయుల పాస్ మార్కులు 40 శాతం తగ్గించి ఆఫ్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాలని, గణితం, సైన్సు, బయాలజీ బోధించే ఉపాధ్యాయులకు వారి వారి సబ్జెక్టుల్లోనే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఇన్–సర్వీసు టీచర్లకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ ప్రత్యేక టెట్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారని, కానీ ప్రత్యేక టెట్ నోటిఫికేషన్‌లో ఎటువంటి మార్పులు లేకుండా ఇంతకు ముందు ఉన్న నిబంధనలతోనే జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అడిషనల్ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎం.వెంకట కృష్ణారెడ్డికి తమ డిమాండ్‌లతో కూడిన వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ టీచర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కె.బసవలింగారావు, రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి పాండురంగ ప్రసాద్ రావు, బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి పీడీ సోషలిజం, ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.శేషారావు, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.రాధిక, రాష్ట్ర కౌన్సిలర్ తేలప్రోలు శ్రీనివాసరావు పాల్గొన్నారు.


