వేడుకగా ఏఎన్‌యూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కళకళలాడిన విశ్వవిద్యాలయ ప్రాంగణం ఏడుగురికి పురస్కారాలు ప్రదానం
ఏడుగురికి అవార్డులు
ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూ అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు భాగస్వాములు కావాలని వర్సిటీ వీసీ ఆచార్య కె. గంగాధరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్వర్ణోత్సవాలలో భాగంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం బుధవారం వర్సిటీ ప్రాంగణంలో ఘనంగా జరిగింది. దేశ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో వర్సిటీ ప్రాంగణం సందడిగా మారింది. పాత మిత్రులను కలుసుకుని, నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ పూర్వ విద్యార్థులు ఆనందోత్సాహాలతో గడిపారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ జస్టిస్ జి. రామకృష్ణ ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 1976 – 2026 వరకు వివిధ సంవత్సరాల్లో విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించిన విద్యార్థులు సమ్మేళనంలో పాల్గొన్నారు.
సహకారం అందించాలి
ఈ సందర్భంగా జస్టిస్ జి. రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయ అభివృద్ధిలో బోధన, బోధనేతర సిబ్బంది పాత్ర అత్యంత కీలకమన్నారు. తమకు విద్యనందించిన విద్యాసంస్థకు పూర్వ విద్యార్థులు తిరిగి ఏమి అందించగలరనే ఆలోచనతో ముందుకు సాగాలని సూచించారు. విద్య, పరిశోధన, మౌలిక వసతులు, విద్యార్థుల సంక్షేమం తదితర రంగాల్లో పూర్వ విద్యార్థులు తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.
ఉన్నత లక్ష్యాలు ముఖ్యం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ ఆచార్య నాగార్జునను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. విశ్వవిద్యాలయ ఆర్థిక పరిపుష్టికి తన వంతు సహకారం అందించినట్లు పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానానికి విశ్వవిద్యాలయం ఎంతో తోడ్పాటునందించిందని, వర్సిటీలోని గాంధీ అధ్యయన కేంద్రం అభివృద్ధికి కూడా సహకరిస్తానని హామీ ఇచ్చారు.
విలువలు నేర్పిన వర్సిటీ
మాజీ ఎమ్మెల్సీ టి. జనార్దన్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం విద్యార్థులకు కేవలం డిగ్రీలు మాత్రమే కాకుండా జీవితానికి అవసరమైన ఎన్నో విలువలను అందించిందన్నారు. ఐదు దశాబ్దాల అనంతరం పూర్వ విద్యార్థులంతా ఒకే వేదికపై కలుసుకోవడం చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. నేటి విద్యార్థులు విద్యార్హతలతోపాటు మానవతా విలువలను అలవర్చుకుని సమాజానికి ఉపయోగపడే గొప్ప వ్యక్తులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సీఐడీ డీజీపీ డాక్టర్ ఎస్. రవిశంకర్ అయ్యనార్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్‌పర్సన్ ప్రొఫెసర్ కె. రత్న షీలామణి, కార్యదర్శి ప్రొఫెసర్ బి. తిరుపతిరావు, మాజీ డీజీపీ బండి మరియాకుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎం. ప్రేమ్‌కుమార్, వర్సిటీ రెక్టర్ ప్రొఫెసర్ ఆర్. శివరామ్ ప్రసాద్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. సింహాచలం తదితరులు ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు ఆచార్య త్రిమూర్తిరావు, అన్ని కళాశాలల ప్రిన్సిపాల్స్, పూర్వ విద్యార్థుల కమిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. చంద్రశేఖరరావు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సమ్మేళనంలో భాగంగా విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించి వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న పూర్వ విద్యార్థులను గుర్తించి ఆల్మునై అవార్డులు అందజేశారు. కళాశాలల వారీగా ఎంపిక చేసిన ఏడుగురిని ఘనంగా సత్కరించారు. ఆర్ట్స్, కామర్స్ అండ్ లా కళాశాల నుంచి డాక్టర్ రావి వెంకట్రావు, సైన్స్ కళాశాల నుంచి ప్రొఫెసర్ ఎ.వి. దత్తాత్రేయరావు, ఫార్మసీ కళాశాల నుంచి డాక్టర్ టి. వెంకటసుబ్బారావు, ఇంజినీరింగ్ కళాశాల నుంచి జి. చంద్రరాజు, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ కళాశాల నుంచి పి. తరుణ్‌కుమార్, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల నుంచి రాజేశ్వరి, దూరవిద్యా కేంద్రం నుంచి ఎం.ఎస్.కె. ప్రసాద్‌లకు పూర్వ విద్యార్థుల పురస్కారాలను అందజేశారు.


