ఇదేం ‘మాయ’రోగం? | - | Sakshi
Sakshi News home page

ఇదేం ‘మాయ’రోగం?

Sep 3 2026 4:15 AM | Updated on Sep 3 2026 4:15 AM

గుంటూరు జీజీహెచ్‌లో కనిపించని పలు వైద్య పరికరాలు ఎంసీహెచ్‌ బ్లాక్‌కు రూ.27 కోట్ల పరికరాలు పంపిణీ ఎన్ని ఉన్నాయో.. ఎన్ని పని చేస్తున్నాయో లెక్క తెలియని వైనం దాతలు, ప్రభుత్వ ఆశయం నీరుగారేలా ఆస్పత్రి అధికారుల తీరు

గుంటూరు మెడికల్‌: దాతలు పెద్ద మనస్సు చేసుకుని రూ.100 కోట్లు విరాళాలు ఇచ్చి, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గర్భిణులు, బాలింతలు, మహిళలు, చిన్నారులు, పసికందులకు సూపర్‌స్పెషాలిటీ వైద్యం అందించేందుకు ఐదు అంతస్తుల్లో 600 పడకలతో భవన నిర్మాణం చేయించారు. దాతలకు తోడుగా ప్రభుత్వం రూ.27 కోట్ల విలువైన వైద్య పరికరాలు అందజేసింది. కార్పొరేట్‌ వైద్యసేవలను పేదలకు ఉచితంగా అందించేందుకు మార్గం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ భవనాన్ని ఈ ఏడాది జనవరిలో ప్రారంభించారు. అయితే అందులోని వైద్య పరికరాలు కొన్ని మాయమైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రి అధికారులు మాత్రం దాతలు, ప్రభుత్వ ఆశయాన్ని నీరుగార్చేలా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.

రూ.100 కోట్లు ఇచ్చిన పూర్వ విద్యార్థులు....

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్‌లో చదువుకున్న పూర్వ వైద్య విద్యార్థులు పేదలకు ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం అందించేందుకు రూ.100 కోట్లు విరాళం ఇచ్చారు. గుంటూరు జీజీహెచ్‌కు ఆరు జిల్లాల నుంచి వస్తున్న గర్భిణులు, బాలింతలు, సీ్త్రలు, పిల్లలకు పడకలు సరిపోక, నాణ్యమైన వైద్యం కోసం పడుతున్న అగచాట్లు పడుతున్నారు. వారి ఇబ్బందులు తొలగించేలా ఈ భవన నిర్మాణం చేయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఏడాది జనవరిలో కానూరి–జింకానా మాతా–శిశు సంరక్షణ సూపర్‌స్పెషాలిటీ బ్లాక్‌ను ప్రారంభించారు. కానీ నేటి వరకు సదరు వైద్య విభాగంలో పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందుబాటులోకి రాకపోవడం విమర్శలకు తావిస్తోంది. డాక్టర్‌ యశస్వి రమణ సూపరింటెండెంట్‌గా ఉన్న సమయంలో ఈ ఏడాది మే నెలలో పాత భవనంలో ఉన్న కాన్పుల విభాగం, పిల్లల వైద్య విభాగాలను ఎంసీహెచ్‌లోకి మార్చారు. కొన్ని రకాల వైద్య పరికరాలు, ఆపరేషన్‌ థియేటర్లను సైతం ప్రారంభించారు. పూర్తిస్థాయిలో పరికరాలను వినియోగంలోకి తీసుకురాకుండా బాక్సుల్లోనే ఉంచారు.

తీవ్ర ఆరోపణలు....

ప్రభుత్వం రూ.27 కోట్ల విలువైన వైద్య పరికరాలను ఎంసీహెచ్‌ వార్డుకు పంపిణీ చేసింది. వాటిల్లో ఎన్ని వార్డుల్లో ఉన్నాయి, ఎన్ని మెడికల్‌ స్టోర్స్‌లో ఉన్నాయి, ఎన్ని వినియోగంలో ఉన్నాయి, ఎన్ని మూలన పడి ఉన్నాయనే లెక్కలు ఆస్పత్రి అధికారుల్లో ఎవరికీ తెలియకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం వైద్య పరికరాలను తొలుత మెడికల్‌ స్టోర్స్‌లో స్టాక్‌ ఎంట్రీ చేసుకుని నిల్వ చేస్తారు. వార్డుల నుంచి వైద్య పరికరాలు కావాలని ఇండెంట్‌ పెడితే, స్టాక్‌ రిజిస్టర్‌లో ఎంట్రీ చేసుకుని సదరు వార్డుకు పంపిస్తారు. వార్డులో వైద్య పరికరాలు స్టాఫ్‌ నర్సుల పర్యవేక్షణలో ఉంటాయి. ఏయే వైద్య పరికరాలు వార్డులో ఉన్నాయి, వాటిల్లో ఎన్ని పనిచేస్తున్నాయి, ఏమైనా రిపేర్లకు గురైతే వాటిని వర్క్‌షాప్‌కు లేదా బయోమెడికల్‌ ఇంజినీర్ల వద్దకు పంపి రిపేర్లు చేయించడం వంటి పనులను నర్సింగ్‌ సిబ్బంది చూస్తారు. నూతన వైద్య పరికరాల గురించి ఎంసీహెచ్‌ వార్డుల్లో నర్సింగ్‌ సిబ్బందికి, మెడికల్‌ స్టోర్స్‌ ఇన్‌చార్జ్‌లకు తెలియకపోవడం పరిపాలనా తీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. జీజీహెచ్‌లో కాంట్రాక్ట్‌ బయోమెడికల్‌ ఇంజినీర్లతోపాటుగా ప్రైవేటు కంపెనీ బయోమెడికల్‌ ఇంజినీర్లు కూడా ఉన్నారు. కానీ సదరు కాంట్రాక్టర్‌ వైద్య పరికరాలను వినియోగంలోకి తీసుకురావడంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ స్పందించాలని బాధితులు కోరుతున్నారు.

వినియోగంలోకి తీసుకొస్తాం

జీజీహెచ్‌లో కొన్ని వైద్య పరికరాలను కాంట్రాక్టర్‌ వినియోగంలోకి తీసుకురాకుండా వదిలివెళ్లిన విషయం తన దృష్టికి వచ్చినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ గిరజవోలు దుర్గాప్రసాద్‌ తెలిపారు. కాంట్రాక్టర్‌తో మాట్లాడి వినియోగంలోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement