జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కె. విజయలక్ష్మి
ప్రత్తిపాడు: పోషకాహారంతో తల్లీ, బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కె. విజయలక్ష్మి అన్నారు. ప్రత్తిపాడు మండలం ఈదులపాలెం కాటూరి ఆస్పత్రిలో పోస్ట్ నేటల్ మదర్స్ (బాలింతలు)కు ‘కాటూరి మాతా శిశు రక్షా కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఎంహెచ్‌వో కిట్లను ప్రారంభించి, బాలింతలకు అందజేశారు. అనంతరం గర్భిణులు, బాలింతలను మెయిన్ రోడ్డు నుంచి ఆస్పత్రికి చేరవేసేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ గర్భిణిగా ఉన్న సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో, ప్రసవం తర్వాత కూడా అన్నే తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు.
మూడు పీహెచ్‌సీలు దత్తత..
కాటూరి యాజమాన్యం సీఎస్‌ఆర్ కింద గుంటూరు జిల్లాలోని కాకుమాను పీహెచ్‌సీ, పెదగొట్టిపాడు పీహెచ్‌సీ, కొండపాటూరు హెల్త్ వెల్‌నెస్ సెంటర్‌లను దత్తత తీసుకున్నట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. ఆయా ఆస్పత్రులకు వారంలో ఒక రోజు ఆర్థోపెడిషియన్, గైనకాలజిస్ట్, పీడియాట్రీషియన్ వంటి స్పెషలిస్ట్ డాక్టర్లను పంపిస్తూ వైద్యసేవలు అందిస్తారని చెప్పారు. ఈ–సంజీవని ప్రాజెక్టు అమలు బాధ్యతతో పాటు, ఆర్‌ఓ తాగునీటి ప్లాంట్‌ను కూడా మెడికల్ కాలేజీ తరఫున అందించడం జరుగుతుందని విజయలక్ష్మి వివరించారు. ఈ సందర్భంగా కాటూరి డైరెక్టర్ డాక్టర్ స్వైరారావు చేస్తున్న సేవలను డీఎంహెచ్‌వో అభినందించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్. నాగేశ్వరరావు, గైనకాలజీ విభాగాధిపతి డా. బి. వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ డా. కె. అరవింద, పీడియాట్రిక్స్ విభాగాధిపతి డా. లత, ఆప్తమాలజీ విభాగాధిపతి డా. సి. మోహన్‌రావు, డిప్యూటీ సూపరింటెండెంట్ డా. అజయ్ పాల్గొన్నారు.


