నరసరావుపేట ఈస్ట్: కాంట్రాక్ట్ పారా మెడికల్ ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం జిల్లాల ఆసుపత్రుల సమన్వయ అధికారి (డీసీహెచ్‌ఎస్) కార్యాలయం ఎదుట ఉద్యోగులు ‘టీమ్ పల్నాడు– ఏపీ పారా మెడికల్ జేఏసీ’ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర పారా మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు మానవహారంగా ఏర్పడ్డారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని, వంద శాతం గ్రాస్ జీతాలు చెల్లించాలని, హెల్త్ కార్డులు, పరస్పర బదిలీలు కల్పించాలన్నారు. అనంతరం కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ పీజీసెట్–2026 నోటిఫికేషన్‌లో పొందుపర్చిన విధంగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురువారం ప్రారంభం కానుందని ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.కల్యాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు వెబ్ ఆధారిత కౌన్సెలింగ్, సర్టిఫికెట్ల పరిశీలన, రిజిస్ట్రేషన్ ప్రక్రియలను ఈనెల 8వ తేదీలోగా ఆన్‌లైన్‌లో పూర్తి చేయాలని సూచించారు. ఏపీ పీజీసెట్‌లో ఉత్తీర్ణులై, ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకే ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుందని తెలిపారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో పీజీలో ఎమ్మెస్సీ జువాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, ఏపీ పీజీసెట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
తెనాలి: దుబాయ్‌లో జరగనున్న సీపీఎల్ టీ20 క్రికెట్ లీగ్ పోటీలకు తెనాలికి చెందిన పల్నాటి నాగరాజు ఎంపికయ్యారు. చాంపియన్ స్పోర్ట్స్ అకాడమీ డైరెక్టర్ పిల్ల శరత్ ఈ మేరకు సమాచారం పంపారు. గత ఆగస్టు నెలలో తునిలో సీపీఎల్ టీ20 క్రికెట్ లీగ్ నిర్వహించారు. తొలి సీజనులో ప్రతిభ చాటిన 24 మందిని దుబాయ్‌లో జరిగే టీ 20, వన్డే మ్యాచ్‌లకు ఎంపిక చేశామని తెలిపారు.
ఐద్వా ఏపీ రాష్ట్ర కార్యదర్శి రమాదేవి
ప్రత్తిపాడు: మహిళల హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ఐద్వా ఏపీ రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి అన్నారు. వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ఇండక్షన్ కార్యక్రమాలు 15వ రోజుకు చేరాయి. బుధవారం మధ్యాహ్నం రమాదేవి విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. హక్కులపై అవగాహన పెంపొందించుకుని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. చుండి రంగనాయకులు కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ టి.వెంకట నారాయణ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని, క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలన్నారు.
నగరంపాలెం: ప్రజలు, ప్రభుత్వ అధికారులకు కొంత మంది వ్యక్తులు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారుల పేర్లు, హోదాలను ఫోన్ కాల్ ద్వారా తెలియజేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసిందని ఉమ్మడి గుంటూరు జిల్లా ఏసీబీ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అటువంటి నకిలీ ఫోన్ కాల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని సూచించారు. వ్యక్తిగత/ బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీలు, పీన్‌లు, ఇతరత్రా రహస్య సమాచారాన్ని తెలియజేయవద్దని తెలిపారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్ లేదా మెసేజ్‌లు వస్తే స్థానిక పోలీస్‌స్టేషన్‌లోగానీ ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064, ఏఎస్పీ 94913 05638, డీఎస్పీ 92465 37807 ఫోన్ నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.


