సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం
పురుషోత్తపట్నం పంపులతో గోదావరి నీటిని ఎత్తి... పోలవరం ఎడమ కాలువలో వదిలి.. ఉత్తరాంధ్రకు ‘పోలవరం నీళ్లు తెచ్చేశాం’ అంటూ వేరే లెవల్‌లో ప్రచారం
ఈ ప్రాజెక్ట్, ఈ పంపులు కొత్తవి కాదు కదా? ఇప్పటికే ఉన్నవే కదా? మరెందుకు ఈ డ్రామా?
నీళ్లు.. పురుషోత్తపటా్ననివి.. కాలువ వైఎస్సార్ హయాంలో నిర్మించింది..
ఇందులో మీరు చేసిందేమిటి? క్రెడిట్ కోసమే మీ ఆరాటం బాబూ..!
పోలవరం ఎత్తు 45.72 మీటర్లా.. 41.15 మీటర్లకే పరిమితమా? సమాధానం చెప్పాలి
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సంగతేమిటి? మీ ప్రేమంతా ప్రసంగాల్లోనేనా?
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రచారంపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికే ఉన్న పురుషోత్తపట్నం నుంచి.. ఇప్పటికే ఉన్న పంపుల ద్వారా గోదావరి నీటిని ఎత్తి, వైఎస్సార్ హయాంలో నిర్మించిన పోలవరం ఎడమ కాలువలోకి వదిలి, తామేదో ‘పోలవరం నీళ్లు ఉత్తరాంధ్రకు తెచ్చేశాం’ అంటూ డప్పు కొట్టుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అవి పోలవరం రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా వస్తున్న నీళ్లు కావని అందరికీ తెలిసినా ప్రచారం మాత్రం వేరే లెవల్‌లో చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న క్రెడిట్ చోరీపై ఈ మేరకు వైఎస్ జగన్ తన ‘ఎక్స్’« ఖాతా ద్వారా ధ్వజమెత్తారు. ‘నీళ్లు పురుషోత్తపట్నానివి.. కాలువ వైఎస్సార్ హయాంలో నిర్మించింది.. మరి ఇందులో తాను చేసిందేమిటి? క్రెడిట్ కోసమే బాబు ఆరాటం..’ అని ట్వీట్‌లో దుయ్యబట్టారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే...
బాబు పబ్లిసిటీ ఈవెంట్లు
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మీరు వరుసగా చేస్తున్న పబ్లిసిటీ ఈవెంట్లన్నీ ప్రజలను మభ్యపెట్టడానికే కదా? మొన్న వెలిగొండ.. ఇవాళ పోలవరం ఎడమ కాలువ.. ఇంకోరోజు ఇంకోటి. మీరు మొదలు పెట్టని, మీరు పూర్తి చేయని ప్రాజెక్టులకు మీ పేరు చెప్పుకోవడం, మీ అనుకూల మీడియాతో వాటి సృష్టికర్తలు మీరే అన్నట్టుగా భజన చేయించుకోవడం మీకు అలవాటే. ఒకవేళ అరకొర పనులు చేసినా, అవి కూడా అంచనాలు పెంచేసి దోచేయడానికే. ఏ సాగునీటి ప్రాజెక్టును తీసుకున్నా మీ మోడస్ ఆపరెండీ, మీ ధోరణి, మీ నైజం ఇదే.
అంతా నేనే చేశానని చెప్పుకోవడం మీకే చెల్లింది
పురుషోత్తపట్నం పంపుల ద్వారా విడుదల చేస్తామంటున్నది 3,500 క్యూసెక్కుల నీళ్లు. ఈ ప్రాజెక్ట్, ఈ పంపులు కొత్తవి కాదు కదా? ఇప్పటికే ఉన్నవే కదా? మరెందుకు ఈ డ్రామా? అసలు పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన ప్రధాన పనుల్లో 79% పనులు వైఎస్సార్ హయాంలోనే పూర్తైతే, ఇప్పుడు.. పూర్తయిన ఆ పనుల మీద నిలబడి ‘‘అంతా నేనే చేశా’’ అని చెప్పుకోవడం చంద్రబాబు గారూ మీకే చెల్లింది!
మీ డ్రామాలు రాష్ట్రానికి శాపం
పోలవరం విషయంలో 2014–19 మధ్య మీరు చేసిన డ్రామాలు, చెప్పిన అబద్ధాలు, చేసిన తప్పిదాలు, అవినీతి, దోపిడీ.. ఇవన్నీ రాష్ట్రానికి శాపంలా మారాయన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముందుచూపు, సరైన ప్రణాళిక, ప్రాధాన్యతలు పాటించకుండా, పద్ధతీ పాడూ లేకుండా మీరు తప్పులు చేస్తే, ఆ చేసిన తప్పులను సరిదిద్దడానికి మా ఐదేళ్ల పాలనలో అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. స్పిల్‌వే, కాఫర్ డ్యాం పనులను అరకొరగా చేసి ప్రాజెక్టును చెల్లాచెదురు చేశారు. చివరకు స్పిల్‌వే పనులు పూర్తి కాకుండానే, నదీ ప్రవాహాన్ని డైవర్ట్ చేయకుండానే, మెయిన్ డ్యాం పునాది పనుల్లో భాగమైన డయాఫ్రం వాల్ చేపట్టారు.
మీరు చేసిన తప్పుల వల్ల, మీ నిర్వాకాల వల్ల ప్రాజెక్టు ఆలస్యం కావడం ఒక్కటే కాకుండా.. వరదల వల్ల వచ్చిన నీరు, అప్పటికి పాక్షికంగా చేసిన స్పిల్‌వే ద్వారా డైవర్ట్ కాక, ఎగువన అరకొరగా చేసిన కాఫర్ డ్యాంవల్ల, ఆ గ్యాప్‌ల ద్వారా నీరు చొచ్చుకుని వచ్చి, మెయిన్ డ్యాం కింద పునాదులు, అంటే డయాఫ్రంవాల్ కొట్టుకుపోయి నష్టం కూడా జరిగింది. వీటన్నింటినీ సరిదిద్దుతూ ముందుగా అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, స్పిల్‌వే పనులు, కాఫర్ డ్యాంలను పూర్తిచేసి, ఆ తర్వాత మెయిన్ డ్యాం ప్రాజెక్టులో అత్యంత సంక్లిష్టమైన పనులను ఒక్కొక్కటిగా ప్రణాళికా బద్ధంగా ముందుకు తీసుకెళ్లాం. పోనీ ఇప్పుడైనా సవ్యంగా చేస్తున్నారంటే అదీ లేదు. ప్రాజెక్టును మళ్లీ సుడిగుండంలోకి నెడుతున్నారు.
ముందు పోలవరం ఎత్తు సంగతి తేల్చండి
అన్నింటికంటే ముఖ్యంగా పోలవరం ఎత్తు సంగతి తేల్చండి చంద్రబాబు గారూ. పోలవరం ఎఫ్ఆర్ఎల్ 45.72 మీటర్లు అయితే, నీటినిల్వను 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నారు. తాము 41.15 మీటర్ల వరకే నిధులిస్తామని కేంద్రం చెబుతోంది. మరి పూర్తి స్థాయి ప్రాజెక్టు ఎలా పూర్తవుతుంది? పూర్తి సామర్థ్యంతో నీటిని ఎలా నిల్వ చేస్తారు? నిర్వాసితులకు ప్యాకేజీ ఎప్పుడు చెల్లిస్తారు? ఈ ప్రశ్నలకు మీ సమాధానం ఏమిటి చంద్రబాబు గారూ?
ఉత్తరాంధ్ర మీద ప్రేమ ప్రసంగాల్లోనేనా?
మరోవైపు ఉత్తరాంధ్రకు గొప్ప మేలు చేసినట్టుగా మాట్లాడుతున్నారు. పురుషోత్తపట్నం పంపుల నుంచి వచ్చే నీళ్లతోనే ఉత్తరాంధ్రకు మేలు జరిగిపోతుందా? ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సంగతేంటి? ఈ స్కీమ్‌కు వైఎస్సార్ గారు 2009లోనే రూ.7,214.10 కోట్లతో పరిపాలనా అనుమతి ఇస్తే.. మారిన ధరలు, భూసేకరణ, నిర్మాణ వ్యయాలను పరిగణనలోకి తీసుకుని 2022లో మా ప్రభుత్వంలో రూ.17,050.20 కోట్లకు అంచనాలను సవరించి పరిపాలనా అనుమతి ఇచ్చాం. కీలకమైన ప్యాకేజ్–1, ప్యాకేజ్–2 పనులను టెండర్లు, అగ్రిమెంట్ల దశ వరకు తీసుకెళ్లాం. భూసేకరణకు ప్రత్యేక యూనిట్లు కూడా ఏర్పాటు చేశాం. మరి మీ ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ఎందుకు పట్టించుకోవడం లేదు? ఉత్తరాంధ్ర మీద ప్రేమ ప్రసంగాల్లోనేనా?
పనులపై దృష్టి పెట్టండి
చంద్రబాబు గారూ.. పోలవరం విషయంలో డ్రామాలు మానండి. పనులపై దృష్టి పెట్టండి. 41.15 మీటర్లు కాకుండా, 45.72 మీటర్ల నిర్దేశిత ఎత్తులో పోలవరాన్ని పూర్తి చేయండి. దీనివల్ల పూర్తిస్థాయి స్టోరేజీ సాధ్యపడుతుంది, తద్వారా పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేయడంతో పాటు పూర్తి గ్రావిటీతో కుడి, ఎడమ కాలువల ద్వారా నీళ్లు అందించగలుగుతాం. అప్పుడు పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతలతో సంబంధం లేకుండానే గ్రావిటీతోనే పోలవరం ఎడమ కాలువతోపాటు కుడి కాలువలకు నీళ్లు పుష్కలంగా పంపగలం. మరి ఇది చేయకుండా ఇన్ని డ్రామాలు ఎందుకు?


