67 ఏళ్ల క్రితం ఇలాంటి పరిస్థితి..
1959 తర్వాత ఎల్‌నినో తీవ్రరూపం
మార్చి వరకూ దీని ప్రభావం ఉంటుంది
రాష్ట్రవ్యాప్తంగా 80 శాతం తగ్గిన భారీ వర్షాలు
అన్ని జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే..
నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో 69 శాతం లోటు
అల్పపీడనాలు ఉత్తరానికి తరలడమే కారణం
వచ్చే ఏడాది వరకూ ఇవే పరిస్థితులు
సాక్షి ఇంటర్వ్యూలో ఐఎండీ అమరావతి కేంద్ర డైరెక్టర్ కె.నాగరత్న
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 67 సంవత్సరాల తర్వాత అంతటి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అమరావతి కేంద్రం డైరెక్టర్ కె.నాగరత్న తెలిపారు. పసిఫిక్ మహాసముద్రం వేడెక్కడం వల్ల ఏర్పడే వాతావరణ వ్యవస్థ ఎల్‌నినో 1959లో ఉన్నంత తీవ్రంగా ఇప్పుడు ఉందని అన్నారు. వచ్చే ఏడాది వరకూ దీని ప్రభావం ఉంటుందని, ఫలితంగా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉంటాయని పేర్కొన్నారు. సాక్షి ప్రతినిధికి బుధవారం ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె పలు అంశాలు వెల్లడించారు.
‘ఎల్‌నినో’ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? మన రాష్ట్రంపై దాని ప్రభావం ఏ స్థాయిలో కనిపిస్తోంది?
ప్రస్తుతం ఎల్‌నినో దేశవ్యాప్తంగా వాతావరణ వ్యవస్థలను ప్రభావితం చేస్తోంది. పసిఫిక్ మహా సముద్రంలోని ‘నినో 3.4’ రీజియన్‌లో పరిస్థితులు సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. అయితే యునైటెడ్ స్టేట్స్‌కి చెందిన నోవా (నేషనల్ ఓషియానక్ అండ్ అటా్మస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్) సంస్థ అంచనాల ప్రకారం అక్టోబర్, నవంబర్ నాటికి దీని తీవ్రత మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలో వర్షపాతం ఏ రకంగా ప్రభావితమైంది?
జూన్ నెల నుంచే రాష్ట్రంలో వర్షపాతం సాధారణం కంటే చాలా తక్కువగా నమోదవుతోంది. ముఖ్యంగా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు పడే రోజుల సంఖ్య దాదాపు 80 శాతం వరకు తగ్గిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు దక్షిణ కోస్తా వైపు రాకుండా ఉత్తర దిశగా పయనించడం వల్ల ఏపీ వ్యాప్తంగా కేవలం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే కురిశాయి. ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, కాకినాడలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా చూస్తే తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి.
సాధారణ సీజన్‌తో పోలిస్తే వర్షపాత రోజుల్లో వచ్చిన వ్యత్యాసం ఏంటి?
వర్షపాత రోజులు సాధారణంగా నమోదవుతున్నప్పటికీ, భారీ వర్షాలు కురిసే రోజులు 80 శాతం తగ్గిపోయాయి. ఇదే ప్రధాన సమస్యగా మారింది.
రాష్ట్రంలో ఏయే జిల్లాలు అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యాయి?
ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జిల్లాలూ లోటు వర్షపాతం పరిధిలోనే ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే 50 శాతం లోటు వర్షపాతం నమోదైంది. నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో గరిష్టంగా 69 శాతం వరకు వర్షపాత లోటు నమోదైంది.
ఈ పరిస్థితుల్లో వ్యవసాయ రంగానికి ఉపయోగపడేలా ఐఎండీ చేపడుతున్న చర్యలేంటి?
ఎల్‌నినో వల్ల సంభవించే పరిస్థితుల గురించి ముందే హెచ్చరికలు జారీ చేశాం. ఐఎండీ, రాష్ట్ర వ్యవసాయ శాఖ సమన్వయంతో వ్యవహరిస్తున్నాయి. వర్షాభావం దృష్ట్యా ఎక్కువ నీరు అవసరమయ్యే వరి పంట స్థానంలో తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించేందుకు కంటింజెన్సీ ప్లాన్స్ అమలు చేస్తున్నాం. రైతులకు నిరంతరం సమాచారం అందించడానికి రోజువారీగా మండల స్థాయిలో, వారానికి రెండుసార్లు జిల్లా స్థాయిలో ఆగ్రో బులెటిన్లు, ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్‌కాస్ట్‌లు విడుదల చేస్తున్నాం.
రాబోయే సీజన్లలో వాతావరణం ఎలా ఉండబోతోంది?
అంతర్జాతీయ వాతావరణ నమూనాల ప్రకారం వచ్చే ఏడాది మార్చి వరకు ‘ఎల్‌నినో’ ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. అప్పటివరకు సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదు కావచ్చు. ఏప్రిల్ తర్వాత మార్పులు సంభవించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలానికి తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
ఈ స్థాయి ఎల్‌నినో తీవ్రత గతంలో ఎప్పుడైనా ఉందా?
సాధారణంగా ఎల్‌నినో ఉన్నప్పుడు వర్షపాతం తగ్గుతుంది. కానీ ఈసారి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. అసలు వర్షపాతమే లేని పరిస్థితి ఏర్పడింది. 1959లో సరిగ్గా ఇటువంటి తీవ్రమైన పరిస్థితులు నమోదయ్యాయి. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ అదే తరహా ప్రతికూల వాతావరణాన్ని చూస్తున్నాం. సెప్టెంబర్ చివరి వరకు రాష్ట్రంలో వర్షపాతం అత్యంత తక్కువగా నమోదయ్యే సూచనలున్నాయి.
ఈ పరిస్థితుల్లో రైతులకు మీరు ఇచ్చే ప్రధాన సూచన ఏంటి?
అన్ని ప్రభుత్వ శాఖలూ వాతావరణ శాఖతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. ఐఎండీ జారీ చేసే ఆగ్రో బులెటిన్లు, అర్బన్, రూరల్, సాధారణ వాతావరణ నివేదికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఆ హెచ్చరికల ప్రాతిపదికన కార్యాచరణ రూపొందించుకోవాలి.


