లక్ష మందితో ‘చలో హైదరాబాద్‌’ | Telangana Employees JAC to hold massive meeting on 10th | Sakshi
Sakshi News home page

లక్ష మందితో ‘చలో హైదరాబాద్‌’

Sep 3 2026 6:01 AM | Updated on Sep 3 2026 6:01 AM

Telangana Employees JAC to hold massive meeting on 10th

టీజీఈజేఏసీ ప్రతినిధులతో కలిసి పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాస్‌రావు

10వ తేదీన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ భారీ సభ  

ప్రభుత్వంపై కోపంతో కాదు..హక్కుల కోసమే ఈ నిరసన 

ఉద్యోగులు భార్య/భర్త, పిల్లలతో కలిసి సభకు రావాలి 

చలో హైదరాబాద్‌ పోస్టర్‌ ఆవిష్కరణలో టీజీఈజేఏసీ నేతలు

సాక్షి, హైదరాబాద్‌: లక్ష మందితో ఈనెల 10వ తేదీన చలో హైదరాబాద్‌ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి(టీజీఈజేఏసీ) చైర్మన్‌ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల సాధనకు టీజీఈజేఏసీ చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం నాంపల్లిలోని టీఎన్జీఓ కేంద్ర కార్యాలయంలో చలో హైదరాబాద్‌ వాల్‌పోస్టర్‌ను టీజీఈజేఏసీ ప్రతినిధులతో కలిసి చైర్మన్‌ మారం జగదీశ్వర్‌ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

మా పోరాటం ఆగదు : మారం జగదీశ్వర్‌ 
‘మా పోరాటం రాజ్యాంగబద్ధం. ఉచితాలు అడగడం లేదు. చట్టబద్ధంగా రావాల్సినవే అడుగుతున్నాం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో చర్చించిన తర్వాత సీఎం ఇచ్చిన హామీలనే అమలు చేయాలంటున్నాం. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో చాయ్‌ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. సంఘ భవనాలకు ట్యాక్స్‌ మినహాయింపు ఉంటుంది. అది కూడా అమలు చేయడం లేదు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలపై చర్చించడానికి కార్యదర్శి సమయం ఇవ్వరు. మంత్రులను కలిస్తే తర్వాత మాట్లాడుదాం అంటారు. ఇక ఎవరిని అడగాలి. విధిలేని పరిస్థితుల్లో ఉద్యమించాల్సిన పరిస్థితి వచ్చింది. ఉద్యోగులు కలిసి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. అదేవిధంగా కొట్లాడి సమస్యలను పరిష్కరించుకుందామని ఉద్యోగులంతా ఏకమయ్యారు. ఇక్కడ యూనియన్లు, రాజకీయాలు లేవు. అందరూ జేఏసీ నిర్ణయానికి అనుగుణంగా పనిచేయాలి. చలో హైదరాబాద్‌ను విజయవంతం చేసేందుకు జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్, హైదరాబాద్‌ సిటీ, రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల జేఏసీలతో సమావేశం నిర్వహించాం. ఈ జిల్లాల నుంచి 50 వేల మంది వస్తారని వారంతా చెప్పారు. ఉద్యోగులే కాకుండా భార్య/భర్త, పిల్లలతో కలిసి రావాలని పిలుపునిచ్చాం. వెంట టిఫిన్‌/స్నాక్స్‌ తెచ్చకోవాలి. జేఏసీ ఏమీ ప్రొవైడ్‌ చేయదు’అని జగదీశ్వర్‌ వ్యాఖ్యానించారు. 

అనుమతి కోసం చివరి వరకు నాన్చొద్దు : ఏలూరి శ్రీనివాసరావు 
‘చలో హైదరాబాద్‌లో భాగంగా ఉద్యోగులంతా ఎల్బీ స్టేడియానికి చేరుకోవాలి. అక్కడ సభ ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటివరకు అనుమతి రాలేదు. నాలుగుచోట్ల సభ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్నాం. ఎల్బీ స్టేడియం, ఎనీ్టఆర్‌ గ్రౌండ్స్, నిజాం కాలేజీ గ్రౌండ్స్, సరూర్‌నగర్‌ స్టేడియం వద్ద సభ నిర్వహించుకునేందుకు దరఖాస్తు సమరి్పంచాం. ఎల్బీ స్టేడియంలో సభ ఏర్పాటుకు అనుమతి వస్తుందని, ఈ అనుమతి అంశాన్ని తక్షణమే తేల్చాలని, చివరి నిమిషం వరకు నాన్చొద్దు. మూడేళ్లుగా మా డిమాండ్లపై పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి సరైన పరిష్కారం లభించకపోవడంతోనే ఉద్యమిస్తున్నాం. మా సమస్యలపై సీఎం సుముఖంగా ఉన్నా, అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. ఉద్యోగుల ఆవేదనను సీఎం అర్థం చేసుకుని ప్రత్యేక చొరవ తీసుకోవాలి’అని శ్రీనివాసరావు కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ నేతలు బి.శ్యామ్, ముజీబ్, జి.సదానంద్‌ గౌడ్, చావ రవి, ఎం.మోహన్‌ నారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement