మరోసారి రికార్డు ధరలకు అమ్ముడైన హౌసింగ్ బోర్డు భూములు
కూకట్‌పల్లి: కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని ఓపెన్ ప్లాట్లకు మరోసారి భారీ ధర పలికింది. ఎటువంటి వివాదాలు లేని, అన్ని వసతులతో అభివృద్ధి చెంది మంచి డిమాండ్ ఉన్న కేపీహెచ్‌బీ ప్రాంతంలోని ప్లాట్లు బహిరంగంగా వేలంలో రికార్డు ధరలకు అమ్ముడుపోయాయి. కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లోని 16 ప్లాట్లకు బుధవారం బహిరంగ వేలం నిర్వహించగా, ఒక చదరపు గజం భూమిని 2.70 లక్షలకు కొనుగోలు చేశారు.
ఈ ప్లాట్ల బహిరంగ వేలం కోసం ఆగస్టు 10న హౌసింగ్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. చదరపు గజానికి కనీస ధర 1.60 లక్షలుగా నిర్ధారించగా, రూ.2.70 లక్షలకు అమ్ముడు పోయిందని, మరో ప్లాట్‌ను చదరపు గజం 2.36 లక్షలకు కొనుగోలు చేశారని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి గౌతం తెలిపారు. ఇంకో రెండు ప్లాట్లను గజం 2.06 లక్షలకు వేలం పాటలో కొనుగోలు చేశారని తెలిపారు. పూర్తి పారదర్శకంగా నిర్వహించిన ఈ వేలం పాటలో ప్లాట్లను దక్కించుకోవడానికి మొత్తం 19 మంది కొనుగోలుదారులు పోటీపడ్డారు. బుధవారం బహిరంగ వేలంలో చదరపు గజం సగటు ధర సుమారు 1.79 లక్షలు పలికిందని వివరించారు. బహిరంగవేలం ద్వారా హౌసింగ్ బోర్డుకు సుమారు 47.14 కోట్ల మేర ఆదాయం వచ్చిందని తెలిపారు.


