కొండా సురేఖ ఎపిసోడ్‌కు నేడు ఎండ్‌కార్డ్‌? | Konda Surekha Row: Congress Set to Decide Her Political Fate Today | Sakshi
Sakshi News home page

కొండా సురేఖ ఎపిసోడ్‌కు నేడు ఎండ్‌కార్డ్‌?

Sep 3 2026 8:02 AM | Updated on Sep 3 2026 8:15 AM

Konda Surekha Row: Congress Set to Decide Her Political Fate Today

సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌లో కొంతకాలంగా కలకలం రేపుతున్న మంత్రి కొండా సురేఖ కుటుంబ వ్యవహారం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. మంత్రి సురేఖపై క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నివేదిక, సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయం, హైకమాండ్‌ ముందు సురేఖ వివరణ, ఆపై మీడియా ముందు సీఎంపై చేసిన ఆరోపణలు.. అన్నింటినీ పరిశీలించిన కాంగ్రెస్‌ పెద్దలు తుది నిర్ణయంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగే కీలక భేటీ నేపథ్యంలో ఈ వ్యవహారానికి తెరపడొచ్చనే చర్చా జోరందుకుంది. 

పరకాల రాజకీయాల నేపథ్యంలో మొదలైన వివాదం.. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్‌(చిట్టక్క) చేసిన వ్యాఖ్యలతో మరింత ముదిరింది. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు తీవ్రంగా భావించారు. కొండా కుటుంబంపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు పార్టీ క్రమశిక్షణా కమిటీ కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై సురేఖను వివరణ కోరగా.. తన కుమార్తె వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. అయితే పీసీసీ మాత్రం ఈ వ్యవహారం అంతా అధిష్టానమే చూసుకుంటుందని చెబుతూ వచ్చింది.  

ఈలోపు ఈ వివాదంపై విచారణ జరిపిన టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ.. సురేఖ వ్యవహారంపై ఓ నివేదిక సిద్ధం చేసింది. ఆ నివేదిక ఆగస్టు 25న టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు చేరింది. అక్కడి నుంచి తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌కు.. అటు నుంచి ఏఐసీసీకి చేరింది. అప్పటి నుంచి ఈ అంశం కాంగ్రెస్‌ హైకమాండ్‌ వద్దే ఉంది. అయితే వెంటనే చర్యలు తీసుకోకుండా.. సురేఖ వివరణ, పార్టీపై దాని ప్రభావం, తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వంటి అంశాలను అధిష్టానం పరిశీలిస్తూ వచ్చింది.

రేవంత్‌ స్పష్టమైన వైఖరి
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగా.. ఈ  ఎపిసోడ్‌ అంతా నడిచింది. తిరిగొచ్చిన వెంటనే ఆయన ఈ పరిణామాలపై భగ్గుమన్నారు. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యి ఈ అంశంపై చర్చ జరిపారు. ఈ సందర్భంగా సురేఖపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన వివరించినట్లు సమాచారం. పార్టీలో క్రమశిక్షణ విషయంలో స్పష్టమైన సందేశం వెళ్లాలన్నది రేవంత్‌ అభిప్రాయంగా తెలుస్తోంది. అలాగే పాలమూరు రాజకీయాల్లో కాకరేపిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి వ్యవహారంపైనా ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి నుంచి పదవుల నుంచి తప్పించాలని అధిష్టానాన్ని సీఎం రేవంత్‌ కోరుతుండగా.. దానికి టీపీసీసీ చీఫ్‌ మహేష్‌గౌడ్‌ సైతం మద్దతు ప్రకటించినట్లు సమాచారం. 

అయితే.. సురేఖకు మద్దతు కూడా
మరోవైపు సురేఖను వెంటనే కేబినెట్‌ నుంచి తొలగించొద్దంటూ కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్‌ నేతలు హైకమాండ్‌ను కోరినట్లు తాజా సమాచారం. ఇద్దరు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇద్దరు మంత్రులు సహా పలువురు నేతలు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో సురేఖ విషయంలో హైకమాండ్‌ ముందు రాజకీయంగా సున్నితమైన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో.. ఒకవేళ ఆమెను బర్తరఫ్‌ చేసినా ఆ తర్వాతి పరిస్థితులకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.

హైకమాండ్‌తో సురేఖ భేటీ
మరోవైపు ఢిల్లీలో నిన్నంతా కాంగ్రెస్‌ హెడ్‌క్వార్టర్స్‌ ఇందిరా భవన్‌ వేదికగా నాటకీయ పరిణామాలు జరిగాయి. అధిష్టానం పిలుపుతో అక్కడికి వెళ్లిన కొండా సురేఖ.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో భేటీ అయ్యారు. తనపై జరుగుతున్న పరిణామాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే సీఎం రేవంత్‌తో పాటు పలువురు మంత్రులపై వస్తున్న ఆరోపణల గురించి కూడా హైకమాండ్‌ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తాను చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని హైకమాండ్‌ హామీ ఇచ్చిందని ఆమె చెప్పారు. ఆ వెంటనే సీఎం రేవంత్‌, ఖర్గేతో మరోసారి భేటీ జరిపారు. అయితే రాష్ట్ర వ్యవహారాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఖర్గే.. రాహుల్‌ గాంధీతో చర్చించాకే ఏ నిర్ణయమైనా వెల్లడిస్తామని చెప్పినట్లు సమాచారం.

నేడు కీలక భేటీలు
రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్‌ తదితర అగ్రనేతలు తిరిగి అందుబాటులోకి రావడం, తెలంగాణకు చెందిన కీలక నేతలు ఢిల్లీలో ఉండటంతో గురువారం చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, మీనాక్షి నటరాజన్‌ తదితరులు హైకమాండ్‌తో చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీ తర్వాత రేవంత్‌, మహేష్‌ గౌడ్‌లు హైదరాబాద్‌కు తిరుగుపయనం అవుతారని సమాచారం. దీంతో ఇవాళ నిర్ణయం వెలువడొచ్చనే ప్రచారం జోరందుకుంది. ఇటు ఇవాళ కొండా సురేఖ దంపతులు తిరిగి వరంగల్‌కు చేరుకోనున్నారు. అనుచరులతో వాళ్లు భేటీ అవుతారని సమాచారం అందుతోంది.

కేబినెట్‌ మార్పులపై కూడా చర్చ?
ఈ నెలాఖరుకల్లా నామినేటెడ్‌ పోస్టుల భర్తీ చేయాలనే ఆలోచనలో సీఎం రేవంత్‌, పీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌లు ఉన్నారు. ఇప్పటికే అధిష్టానంతో సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఇవాళ్టి భేటీలో సురేఖపై నిర్ణయంతో పాటు కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సురేఖను తప్పిస్తే ఆమె స్థానంలో ఎవరిని తీసుకోవాలి? ఇప్పటికే ఖాళీగా ఉన్న స్థానాల్లో ఎవరికి అవకాశం ఇవ్వాలి? నామినేటెడ్‌ పదవుల భర్తీ ఎలా చేపట్టాలి? అనే అంశాలపైనా ఢిల్లీలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. 

వేటా.. ప్రత్యామ్నాయ మార్గమా?
సురేఖను కేబినెట్‌ నుంచి తొలగించే అవకాశాలు బలంగా ఉన్నాయన్న ప్రచారం కొనసాగుతున్నప్పటికీ.. హైకమాండ్‌ మరో మార్గాన్ని పరిశీలిస్తోందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఆమెకు కేబినెట్‌ నుంచి తప్పుకుని మరో కీలక పదవి ఇచ్చే అవకాశంపై కూడా చర్చ జరుగుతున్నట్లు తాజా కథనాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే కొండా వ్యవహారంపై వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతలు ఎవరూ బహిరంగంగా స్పందించవద్దని హైకమాండ్‌ నుంచి సూచనలు వెళ్లినట్లు సమాచారం. తుది నిర్ణయం వచ్చే వరకు ఎవరూ వ్యాఖ్యలు చేయకూడదన్న ఆదేశాలు.. ఈ అంశాన్ని పార్టీ ఎంత సీరియస్‌గా తీసుకుంటోందో స్పష్టం చేస్తున్నాయి. సురేఖతో పాటు జి.చిన్నారెడ్డి వ్యవహారం కూడా హైకమాండ్‌ ముందుంది. ఇద్దరిపై క్రమశిక్షణా కమిటీ సిఫారసులు చేయడంతో.. ఒకేసారి ఇద్దరిపై చర్యలు తీసుకోవాలా? లేక వేర్వేరుగా నిర్ణయం తీసుకోవాలా? అన్నదీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌ అంతర్గత రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి చేరింది. ఒకవైపు రేవంత్‌రెడ్డి కఠిన చర్యల వైపు మొగ్గు చూపుతున్నారన్న సమాచారం.. మరోవైపు సురేఖకు పార్టీలోని కొందరి మద్దతు.. ఇంకోవైపు హైకమాండ్‌ రాజకీయ లెక్కలు.. ఈ మూడు అంశాల మధ్య తుది నిర్ణయం ఆసక్తికరంగా మారింది. నేటి ఢిల్లీ పరిణామాలతో కొండా ఎపిసోడ్‌కు ఎండ్‌కార్డ్‌ పడుతుందా? లేదంటే మరో మలుపు తిరుగుతుందా?అన్నదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్‌ అయ్యింది.

ఇదీ చదవండి: పిల్లల బడిలో.. పెద్దోళ్ల ఆఫీస్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement