కొండా ఫ్యామిలీ బిగ్‌ డెసిషన్‌..? | Is Konda Couples Big Decision On Congress Quit? | Sakshi
Sakshi News home page

కొండా ఫ్యామిలీ బిగ్‌ డెసిషన్‌..?

Sep 3 2026 10:23 AM | Updated on Sep 3 2026 10:35 AM

Is Konda Couples Big Decision On Congress Quit?

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ కుటుంబ వ్యవహారం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఆమెపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందా? లేదంటే ప్రత్యామ్నాయ నిర్ణయం వెలువడుతుందా? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈ క్రమంలోనే ఇవాళ ఢిల్లీలో హైకమాండ్‌ పెద్దలంతా కీలక భేటీ నిర్వహించనున్నారు. అయితే ఆ నిర్ణయం వెలువడడం కంటే ముందే.. ఓ బిగ్‌ డెసిషన్‌ తీసుకోవాలని కొండా ఫ్యామిలీ యోచిస్తుందని సమాచారం. 

కాంగ్రెస్‌ పార్టీని వీడే యోచనలో కొండా మురళి, కొండా సురేఖ దంపతులు ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవికి మాత్రమే రాజీనామా చేయాలా?.. లేదంటే పార్టీని వీడాలా? లేదంటే మరేదైనా నిర్ణయం తీసుకోవాలా? అనే తమ తదుపరి రాజకీయ అడుగుపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తమ నిర్ణచం ఏదనేది వాళ్లు మీడియా ముఖంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

అధిష్టానం పిలుపుతో ఢిల్లీ వెళ్లి పెద్దలకు వివరణ ఇచ్చిన కొండా సురేఖ.. గత రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. సీఎం రేవంత్‌ కుటుంబంతో పాటు కొందరు మంత్రులపైనా ఆమె ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. అయితే హైకమాండ్‌ మాత్రం తమ నిర్ణయం వెల్లడించేందుకు కాస్త సమయం కావాలని చెప్పినట్లు సమాచారం. దీంతో ఇవాళ ఆమె వరంగల్‌కు వెళ్లనున్నారు. 

మధ్యాహ్నం 2 గంటలకు కొండా దంపతులు తమ నివాసంలో అనుచరులతో సమావేశం కానున్నారు. పార్టీని వీడాలా? ప్రస్తుత పరిణామాలపై వేచి చూడాలా? అనే అంశాలపై అనుచరులతో చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పటికే కుటుంబ సభ్యులతోనూ కొండా దంపతులు సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించినట్లు.. తనపై వేటేస్తే ఎమ్మెల్యే(వరంగల్‌ తూర్పు) పదవికి సైతం రాజీనామా చేసి ఉపఎన్నికకే వెళ్లాలని ఆమె ఇది వరకే నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో  కూతురు సుస్మిత రాజకీయ భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం వెల్లడించే చాన్సే ఎక్కువగా కనిపిస్తున్నట్లు సమాచారం.

కొండా సురేఖ వ్యవహారంపై ఇవాళో, రేపో కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి నిర్ణయం వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే అప్పటిదాకా వేచి ఉండాలా? లేదంటే పార్టీ నిర్ణయం వెలువడకముందే తమ వైఖరిని ప్రకటించాలా? అనే అంశంపై కుటుంబ సభ్యులతో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. కూతురు సుస్మితా పటేల్‌ పరకాలకు తానే కాబోయే ఎమ్మెల్యేనంటూ కామెంట్‌ చేయడం మొదలు .. ఈ వివాదం రాజుకుంది. గతంలోనూ సీఎం రేవంత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సుస్మిత.. తాజాగానూ అలాంటి వ్యాఖ్యలే చేశారు.  ఈ పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. కూతురి వ్యాఖ్యల్ని ఖండించని సురేఖపై వేటు వేయాల్సిందేనని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పట్టుబడుతున్నారు. సురేఖ వైఖరి, కొండా ఫ్యామిలీ తీరుతో కాంగ్రెస్‌కు నష్టమే ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు వాళ్లంతా.

కొండా దంపతుల వ్యవహారంపై కాంగ్రెస్‌లో ఇప్పటికే వివాదాలు కొనసాగుతున్నాయి. కొండా సురేఖపై పార్టీ క్రమశిక్షణ కమిటీ నివేదిక అధిష్ఠానానికి చేరింది. ఆమెను బర్తరఫ్‌ చేయాలని సీఎం, టీపీసీసీ చీఫ్‌ సహా పలువురు అధిష్టానానికి నివేదించారు. అదే సమయంలో ఆమెను కొనసాగించాలని, కొండా ఫ్యామిలీని దూరం చేసుకోవడం మంచిది కాదని మరికొందరు సీనియర్లు అధిష్టానికి విజ్ఞప్తులు చేశారు. దీంతో కొండా దంపతుల తదుపరి రాజకీయ అడుగుపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

ఇదీ చదవండి: నా కంటే ముందు ఆయనపై చర్యలు తీసుకోండి: కొండా సురేఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement