సాక్షి, యాదాద్రి భువనగిరి: తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న తాజా పరిణామాలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ రాజీనామా చేస్తారా? అధిష్టానం ఆమెను భర్తరఫ్ చేస్తుందా? అనే ఎపిసోడ్‌పై స్పందించారాయన. ఇందులో తమ నిర్ణయమంటూ ఏదీ ఉండదని.. ఈ అంశాన్ని పూర్తిగా కాంగ్రెస్ జాతీయ కార్యవర్గమే చూసుకుంటుందని చెప్పారాయన.
సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలో గురువారం బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రాజకీయాలు చేయాల్సిన సమయం కాదని మీడియాతో దాటవేత ధోరణిలో మాట్లాడారు. అయితే చివరకు కొండా సురేఖకు సంబంధించిన వివాదంపై స్పందించిన రాజగోపాల్‌రెడ్డి.. ఈ అంశాన్ని కాంగ్రెస్ జాతీయ కార్యవర్గం చూసుకుంటుందని తెలిపారు. దీనిపై తాము వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని, పార్టీ జాతీయ నాయకత్వం తీసుకునే నిర్ణయానికే కట్టుబడి ఉంటామని చెప్పారు.
‘‘కొండా సురేఖ పార్టీ పెద్దలను కలిసి తన వాదన వినిపించారు. ఈ ఇష్యూపై అధిష్టానం వద్ద పూర్తి సమాచారం ఉంది. అధిష్టానం నిర్ణయమే ఫైనల్.. అందరం కట్టుబడి ఉండాలి. ఎవరికి ఏ పదవి ఇవ్వాలనేది అధిష్టాన నిర్ణయం. కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరగాలన్నది అధిష్టానమే నిర్ణయిస్తుంది. రాహుల్ గాంధీపై నమ్మకం ఉంది.. ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ప్రతిపక్షంలో ఉండి బీఆర్‌ఎస్‌పై పోరాడిన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరగాలి. నేను కాంగ్రెస్ కార్యకర్తల గురించే ఆలోచిస్తా’’
ఆ నిర్ణయమే ఫైనల్
కొండా సురేఖ వ్యవహారంలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా.. పార్టీ తరఫున తామంతా దానికి కట్టుబడి ఉంటామని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాజకీయ అంశాలపై అనవసరమైన చర్చలకు తావివ్వకుండా పార్టీ అధిష్ఠానం నిర్ణయం కోసం ఎదురుచూడాలని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా గత కొంతకాలంగా సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తానే పదేళ్లు సీఎంగా కొనసాగుతానంటూ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను రాజగోపాల్‌రెడ్డి గతంలో ఖండించారు. ముఖ్యమంత్రి పదవి అనేది వ్యక్తిగత నిర్ణయం కాదని, పార్టీ అధిష్ఠానం, రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుందని ఆయన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. నిన్న సైతం ‘‘మా ఇంట్లోకి వచ్చి మమ్మల్నే వెల్లగొడతారా?’’ అంటూ సంచలన వ్యాఖ్యలు సైతం చేశారు.
ఇదిలా ఉండగా నిన్న ఢిల్లీలోనూ.. కొండా సురేఖ రేవంత్.. రేవంత్ కుటుంబం, అలాగే కొందరు మంత్రులపై అవినీతి ఆరోపణలతో అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆ సమయంలో ఆమె.. తన కూతురు వ్యాఖ్యలు పూర్తి వ్యక్తిగతమని, అయితే అధిష్టానం చెప్పకుండా తానే పదేళ్లు సీఎంగా ఉంటానని రేవంత్ ఎలా మాట్లాడతారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘ఇప్పుడు రాజకీయాలు చేసే సమయం కాదు’ అంటూ రాజగోపాల్‌రెడ్డి కాస్త స్వరం తగ్గించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇదీ చదవండి: రాజీనామా చేయమని ఖర్గేనే చెప్పారా?


