బాబు సాష్టాంగం నమస్కారం.. చెప్పని అసలు లెక్క ఇదే! | KSR's Comments On Veligonda Project Development And History | Sakshi
Sakshi News home page

బాబు సాష్టాంగం నమస్కారం.. చెప్పని అసలు లెక్క ఇదే!

Sep 3 2026 11:52 AM | Updated on Sep 3 2026 12:56 PM

KSR's Comments On Veligonda Project Development And History

దశాబ్దాల తరబడి ఎదురు చూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కొంత మేర అయినా సాకారం అవడం సంతోషమే. మార్కాపురం, ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలకు నీరందించాలని ఈ ప్రాజెక్టును రూపొందించారు. ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించే పరిస్థితి ఇంకా రావల్సి ఉంది. ప్రస్తుతానికి తామేదో చేసేశామని చెప్పుకోవడం కోసం కూటమి ప్రభుత్వం తంటాలు పడింది. దీనికి ఎల్లో మీడియా విపరీతమైన హైప్ ఇచ్చింది.

గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరంభించిన వెలిగొండ ప్రాజెక్టు సొరంగాల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నీరు వదలే అవకాశం రావడం అదృష్టమే. చంద్రబాబు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తన పేరు గుర్తుంచుకునేలా చేసిన కార్యక్రమం పెద్దగా ఏదీ లేదని చాలామంది అంటారు. అయితే గత ప్రభుత్వాలు చేసిన వివిధ పనులను తనవిగా ప్రొజెక్టు చేసుకోవడంలో ఆయనను మించిన వారు మరొకరు ఉండకపోవచ్చు. దానిని క్రెడిట్ చోరీ అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరు పెట్టారు. ఉన్నవి, లేనివి ఏవేవో అంకెలు చెబుతూ చంద్రబాబు ఉపన్యాసాలు చేస్తుంటారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి కూడా అదే జరుగుతోంది.

తానే శంకుస్థాపన చేశానని, తానే ప్రారంభిస్తున్నానని ఆయన చెబుతారు. అంతవరకు నిజమే. కాని అసలు పనిచేసింది ఎవరు అన్నది మాత్రం చెప్పరు. అందువల్లే కృష్ణా నది నుంచి నీటిని తరలించే బృహత్తర పథకంలో వెలిగొండ ప్రాజెక్టు వివిధ దశలకు సంబందించి తన పాత్రను వివరించలేకపోయారు. నిజానికి చంద్రబాబుకు వచ్చిన రాజకీయ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉంటే ఉమ్మడి ఏపీలో ఎన్నో నీటిపారుదల ప్రాజెక్టులు ఎప్పుడో పూర్తి అయి ఉండేవి.

1996 ఎన్నికలకు ముందు జనాన్ని మాయ చేయడం కోసం పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వాటిలో అత్యధికం అంతకుముందు ఎన్టీఆర్‌ ప్రభుత్వంలో వచ్చిన ప్రతిపాదనలే. చంద్రబాబు శిలాఫలకాలైతే వేశారు కాని, వాటిని ముందుకు తీసుకువెళ్లలేదు. భారీ ప్రాజెక్టులపై ఆయనకు గతంలో పెద్దగా నమ్మకం లేకపోవడమే కారణం. అవి సకాలంలో పూర్తి కావని, రాజకీయంగా లబ్ది చేకూరదన్నది ఆయన ఉద్దేశం.

చంద్రబాబు 1998 ప్రాంతంలో ఏపీ ఎంపీలతో ఒక సమావేశం నిర్వహించారు. అందులో వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ జరిగింది. వైఎస్ అప్పటికే ఇరిగేషన్ ప్రాజెక్టుల సాధనకు పలు ఆందోళనలు చేశారు. ఆ నేపథ్యంలో చంద్రబాబుకు ఒక హెచ్చరిక చేస్తూ, నీటిపారుదల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తే చరిత్ర హీనుడవుతావు.. అని వ్యాఖ్యానించడం సంచలనం అయింది. అయినా చంద్రబాబు పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. బీజేపీతో కలిసి పోటీచేయడం ద్వారా 1999 ఎన్నికలలో గెలవలిగారు. వాజ్ పేయిపై జనంలో ఉన్న సానుభూతి కలిసి వచ్చింది.

ఆ తర్వాత కూడా ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండేవి. దాంతో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి​ అప్పట్లో ఉమ్మడి ఏపీలో ప్రతి ప్రాజెక్టు స్థలాల వద్దకు వెళ్లి శంకుస్థాపన ఫలకం పక్కన మొక్కలు నాటి నిరసన తెలిపారు. వాటిలో వెలిగొండ కూడా ఒకటి. 2004లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తొలి క్యాబినెట్ లోనే నీటిపారుదల ప్రాజెక్టుల రిపోర్టును అప్పటి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి సీవీఎస్‌ కె శర్మ ప్రవేశపెట్టారు. వాటి వివరాలు చూసిన ఆనాటి మంత్రి జేసీ దివాకరరెడ్డి ఇన్ని ప్రాజెక్టులకు అవకాశం ఉంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు చేపట్టలేకపోయారని ప్రశ్నించారు. దానికి శర్మ సమాధానం ఇస్తూ, ఆయన ప్రాధాన్యతలు వేరు, ప్రాజెక్టులను మీరు చేస్తామంటున్నారు.. అందుకే నివేదిక సమర్పించాను అని బదులు ఇచ్చారట.

తదుపరి వైఎస్సార్‌ మీడియాతో మాట్లాడుతూ పోలవరం, పులిచింతలతో సహా వివిధ ప్రాజెక్టులు చేపట్టి, పూర్తి చేస్తామని ప్రకటించారు. తదనుగుణంగానే ఆయన భారీ ఎత్తున ప్రారంభించారు. అప్పట్లో పోలవరం ప్రాజెక్టును ఓ రకంగా చంద్రబాబు వ్యతిరేకించారు. ఆ ప్రాజెక్టులో కొన్ని సమస్యలు ఉన్నాయని అప్పట్లో ఒక టీవీ చానల్‌తో అన్న వీడియో ప్రస్తుతం సర్కులేషన్‌లోకి వచ్చింది. అలాగే వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం సాంకేతికంగా సాధ్యం కాదన్న అభిప్రాయంతో దానిని చంద్రబాబు ముందుకు తీసుకువెళ్లలేకపోయారు. 

కాని వైఎస్ రాజశేఖరరెడ్డి విదేశాల నుంచి కొండలు తొలిచే యంత్రాలను తెప్పించి సొరంగాల నిర్మాణం ఆరంబించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో కనిపిస్తాయి. దీనిని చంద్రబాబు కాదనగలరా అన్నది ఒక ప్రశ్న. వైఎస్ మరణంతో ఈ ప్రాజెక్టులలో జాప్యం జరిగిన మాట వాస్తవం. తదుపరి రాష్ట్ర విభజన, ఏపీకి 2014లో చంద్రబాబు సీఎం కావడం జరిగింది. ఆ అవకాశాన్ని కూడా ఆయన వాడుకోలేకపోయారు. వెలిగొండపై పెట్టవలసినంత శ్రద్ద పెట్టలేకపోయారనిపిస్తుంది. కాకపోతే వ్యయ అంచనాలు పెంచేయడం ద్వారా కాంట్రాక్టర్‌లకు లబ్ది చేకూర్చారన్న విమర్శ వచ్చింది.

ఇవి కూడా చదవండి: పోలవరం కల సాకారమా?.. లేక ముగింపు ప్రయత్నమా?

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి టైమ్‌లో సుమారు 20 కిలోమీటర్ల సొరంగం తీయడమే కాకుండా, రిజర్వాయిర్‌ను చాలావరకు ముందుకు తీసుకువెళ్లారు. చంద్రబాబు టైమ్‌లో కేవలం సుమారు ఆరు కిలోమీటర్లకే టన్నెల్ తవ్వారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్ జగన్ పది కిలోమీటర్ల టన్నెళ్లను పూర్తి చేసి, అవసరమైన ముఖ్యమైన కాల్వలను తవ్వించారు. తదుపరి వాటిని జాతికి అంకితం చేశారు. అయితే మానవత్వ కారణాలతో రిజర్వాయిర్ నిర్మాణం వల్ల నిర్వాసితులు అయ్యేవారికి పూర్తి స్థాయిలో పరిహారం, సహాయం అందించి వారు సెటిల్ అవడం కోసం నీళ్లను వదలే కార్యక్రమాన్ని వాయిదా వేశారు. జగన్ తిరిగి గెలిచి ఉంటే బహుశా 2024 జూన్, జూలైలలో ఆ పని కూడా అయిపోయేదేమో! కాని ఎన్నికలలో ఓటమి ఎదురవడంతో ఆగిపోయింది.

కూటమి ప్రభుత్వం వచ్చాక రెండేళ్లపాటు ముందుకు సాగలేదు. ఒక మిషన్ టన్నెల్‌లో విరిగిపోయిందని, ఆ కాంట్రాక్టర్ స్టే తెచ్చుకున్నారని చంద్రబాబు చెబుతున్నారు. కాని అది సాకేనేమో అనిపిస్తుంది. నిర్వాసితులకు 2024లోనే ఎందుకు పరిహారం ఇవ్వలేకపోయారు? గ్రామాలను ఖళీ చేయించలేదు? ఒక టన్నెల్ ద్వారా అయినా నీటిని ఇచ్చి ఉండవచ్చు కదా! అలా చేస్తే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికు, జగన్‌కు జనం క్రెడిట్ ఇస్తారన్న ఉద్దేశంతోనే ఆ పని చేయలేదన్నది వైఎస్సార్‌సీపీ విమర్శ. ఇప్పటికీ నిర్వాసితులు సెటిల్ కాకముందే నీటిని వదలడంతో ఎన్ని వందల కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయన్నది తెలిసిన విషయమే.

బాధితులు మంత్రిని, కలెక్టర్ తదితర అధికారులను నిలదీసిన, ఆగ్రహం వ్యక్తం చేసిన ఘట్టాలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ సందర్భంలో ప్రాజెక్టు నిర్మాణంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌ల కృషిని కూడా అభినందించి ఉంటే, చంద్రబాబుకు వయసుకు తగ్గట్లుగా హుందాగా ఉండేది. అలా చేయకపోగా వైఎస్సార్‌సీపీపైన ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ విమర్శలు చేయడం బాగోలేదు. 

1996-2004 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేసింది కేవలం పది లక్షలేనని, అది కూడా శంకుస్థాపన సభ ఏర్పాట్ల కోసమేనని జగన్ వ్యాఖ్యానించారు. ఈ ఒక్కదానికి చంద్రబాబు సమాధానం చెప్పగలిగితే, ఆయన ప్రభుత్వం ఏ మేరకు పనిచేసింది అర్థం అవుతుంది. శ్రీశైలంలో కనీస నీటి మట్టంగా 834 అడుగులుగా నిర్ణయిస్తూ చంద్రబాబు జీఓ ఇచ్చారు. ఇదే కొనసాగి ఉంటే అసలు వెలిగొండకు నీరు వచ్చే అవకాశమే ఉండదట. వైఎస్ ప్రభుత్వం దానిని 854 అడుగులకు పునరుద్దరించడంతో వెలిగొండతో పలు రాయలసీమ ప్రాజెక్ట్‌లకు నీరు అందించగలిగే పరిస్థితి వచ్చిందన్నది నిజమా? కాదా? టన్నెల్ తవ్వడానికి భారీ యంత్రాన్ని తెప్పించింది వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కాదని అనగలరా!

ఇప్పుడు చంద్రబాబు చేయవలసింది వెలిగొండ రెండో దశ కూడా పూర్తి చేసి నిర్దిష్ట లక్ష్యం ప్రకారం సమారు ఐదులక్షల ఎకరాలకు నీరవ్వడం. అది చేసి, ఆ క్రెడిట్ తనదేనని చెప్పుకుంటే అభ్యంతరం లేదు. ఇది ఎంతవరకు జరుగుతుందన్నది చెప్పలేం. వెలిగొండ సభలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ప్రత్యేకించి రప్పించి జగన్‌ను దూషింపచేయడం మరీ దారుణంగా ఉంది. ఇదే మాగుంట గతంలో జగన్ టన్నెళ్ల ప్రారంభోత్సవం చేసినప్పుడు ఎంపీగానే ఉన్న సంగతి మర్చిపోయారా! లేక చంద్రబాబు మెప్పుకోసం తన మాగుంట కుటుంబ పరువును రోడ్డున పడేశారా అని పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు ప్రశ్నించారు.

మరో అంకం చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేయడం. వైఎస్ చేపట్టిన భారీ ప్రాజెక్టులను ఊహజనితం అని ఆ రోజుల్లో చంద్రబాబు విమర్శించేవారు. కాని సాష్టాంగ నమస్కారం చేయడం ద్వారా వెలిగొండ ప్రాజెక్టు ఊహాజనితం కాదని, వాస్తవమని చంద్రబాబుకు అర్థం అయి ఉండాలి. చంద్రబాబు వెలిగొండ చరిత్రలో చివరిలో అయినా ఒక భాగం అయ్యారు. అంతవరకు ఓకే. కాని చరిత్రను సృష్టించింది మాత్రం వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌లే అన్నది పచ్చి నిజం. వెలిగొండ నీటిలో కనిపించేది వైఎస్ రాజశేఖరరెడ్డి నీడే అన్నది అర్థం అవుతూనే ఉంది.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement