సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయ(టీటీడీ) డిప్యూటీ ఈవో మెండు లోకనాథంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పంజా విసిరింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆయనను అరెస్ట్ చేసి కార్యాలయానికి తరలించారు. నేడు నెల్లూరు ఏసీబీ కోర్టులో లోకనాథంను ఏసీబీ అధికారులు హాజరుపరచనున్నారు.
ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో బుధవారం ఉదయం నుంచి ఈరోజు ఉదయం వరకు ఏసీబీ తనిఖీలు కొనసాగాయి. లోకనాథం ఇల్లు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. ఒకేసారి పలు ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో భారీగా ఆస్తులు, విలువైన లోహాలు, నగదు, కీలక పత్రాలు బయటపడటంతో టీటీడీ వర్గాల్లో కలకలం రేగింది. ఇప్పటివరకు సుమారు రూ.5 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
అలాగే రెండు కిలోల బంగారం, 6.5 కిలోల వెండి, రూ.12 లక్షల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లోకనాథం, కుమారుడి పేరిట 4 ఫిక్స్‌డ్ డిపాజిట్లు, తిరుపతి శ్రీనివాసనగర్‌లో ఫ్లాట్, గొల్లవానిగుంటలో 2 ఇళ్లు, వడమాలపేట మండలం పాదిరేడులో ఒక ఇల్లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కల్తీ నెయ్యి కేసులో మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్నఅప్పన్న విచారణలో వెల్లడైన పలు అంశాలు ఆధారంగా లోకనాథంపై కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: తిరుపతిలో దారుణం.. రూ.6 కోట్ల వ్యవహారంలో కలకలం!
ప్రస్తుతం గుర్తించిన ఆస్తులు, నగదు, బంగారం, వెండి విలువను లెక్కించడంతో పాటు వాటికి సంబంధించిన ఆదాయ వనరులను ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. సోదాల్లో బయటపడిన ప్రతి ఆస్తికి లెక్క ఉందా? లేక అక్రమంగా కూడబెట్టినదేనా? అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు.. తిరుమల శ్రీవారి ఆలయంలో డిప్యూటీ ఈవో స్థాయి అధికారి నివాసాలపై ఏసీబీ సోదాలు జరగడం టీటీడీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఒకవైపు కోట్ల రూపాయల ఆస్తుల గుర్తింపు.. మరోవైపు కిలోల కొద్దీ బంగారం, వెండి, నగదు బయటపడటంతో ఈ కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.


