మాట ఇస్తే నెరవేరినట్టే.. హామీ ఇస్తే అమలైనట్టే.. చేస్తాను అంటే పనిపూర్తయినట్టే.. విశ్వసనీయతకు నిలువెత్తు నిదర్శనం.. ప్రజల గుండెల్లో కొలువైన నిండైన రూపం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన దివికేగి 17 ఏళ్లు గడిచినా.. వైఎస్సార్‌ను స్మరించని హృదయం ఉండదు అంటే అతిశయోక్తి కాదు. సంక్షేమ ప్రదాతగా మహానేత సాగించిన పాలనను గుర్తుచేసుకోని రోజు ఉండదు. బడుగుల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన సేవాతత్పరుడు వైఎస్సార్. నిరుపేదల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేసిన మహనీయుడు వైఎస్సార్. బుధవారం ఈ క్రమంలోనే వైఎస్సార్ వర్ధంతిని జిల్లావ్యాప్తంగా జరుపుకున్నారు. వాడవాడలా ఘనంగా నివాళులర్పించారు.
తిరుపతి సిటీ : మాట తప్పని మడమ తిప్పని నేతగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జ్ఞాపకాలను జిల్లావాసులు స్మరించుకున్నారు. రాజన్న వర్ధంతి సందర్భంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పల్లె నుంచి పట్టణం వరకు వాడవాడల సామాన్యులు, అభిమానులు, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ శ్రేణులు వైఎస్సార్ విగ్రహాలకు, చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించారు. మళ్లీ రావా...రాజన్నా అంటూ భావోద్వేగంతో కంటతడి పెట్టారు. జిల్లాకు, తమ కుటుంబాలకు చేసిన మేలును గుర్తు చేసుకుంటూ పుష్పాంజలి ఘటించారు.
● చంద్రగిరి నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సేవాకార్యక్రమాలు నిర్వహించారు. చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద, తిరుపతి రూరల్ మండలం పేరూరులో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పాకాల మండలంలో చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి చేతులమీదుగా వైఎస్సార్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అన్నదానం చేపట్టారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఓబుల్‌రెడ్డి ఆధ్వర్యంలో అక్షయ క్షేత్రంలోని అనాథలకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
● వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి నిర్వహించారు. వాకాడు మండలంలో మహానేత విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గూడూరు పట్టణంలో జరిగిన రక్తదాన శిబిరానికి హాజరయ్యారు. అలాగే రాపూరు, సైదాపురంలో పార్టీ నాయకులు అన్నదానం చేశారు. నేతలు కోడూరు కల్పలత, పాపకన్ను మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు
● సత్యవేడు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నూకతోటి రాజేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి నిర్వహించారు. బీఎన్ కండ్రిగలో మహానేత విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అన్నదానం చేపట్టారు.
తిరుపతిలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. నగరంలోని తుడా సర్కిల్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి పార్టీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ మహానేత మరణించి 17ఏళ్లు గడుస్తున్నా ప్రజల గుండెలలో ఆయన దేవుడిగా వెలుగొందుతున్నారని చెప్పారు. మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా అంటూ ప్రజలు ఎదురుచూస్తున్నారని, ఆయన మరణంతో 700 మంది అభిమానులు తట్టుకోలేక తనువు చాలించడం ఎక్కడా చూడలేదన్నారు. మ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులరెడ్డి, మాజీ మేయర్ డాక్టర్ శిరీష పాల్గొన్నారు.
రైల్యే కోడూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైఎస్సార్ వర్ధంతి నిర్వహించారు. కోడూరు పట్టణంలోని టోల్‌గేట్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు రైల్వే కోడూరులోని పార్టీ కార్యాలయంలో డాక్టర్ వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.
సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట పట్టణంలోని పాతబస్టాండ్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఘనంగా నివాళులర్పించారు. క్షీరాభిషేకం చేసి పూలమాలలతోఅంజలి ఘటించారు.
శ్రీకాళహస్తిలో వైఎస్సార్ వర్ధంతి జరుపుకున్నారు. పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త బియ్యపు మధుసూధన్‌రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. పట్టణంలోని వైఎస్సార్ విగ్రహానికి బియ్యపు శ్రీవాణిరెడ్డి పూలమాల వేసి అంజలి ఘటించారు. మాజీ ఎమ్మెల్యే కుమార్తె పవిత్రా రెడ్డి, కుమారుడు ఆకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.


