తిరుపతి మంగళం : దళితులంటే ఎందుకంత కక్ష చంద్రబాబు అని వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ప్రశ్నించారు. గాంధీపురం, దాసరి మఠం ప్రాంత ప్రజలతో కలిసి టీటీడీ చౌల్ట్రీస్ వద్ద ప్రహరీ గోడ నిర్మిస్తున్న ప్రాంతాన్ని బుధవారం పరిశీలించారు. అనంతరం స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గాంధీపురానికి వెళ్లే మార్గాన్ని టీటీడీ మూసివేస్తూ చేపట్టిన నిర్మాణ పనులను వెంటనే ఆపివేయాలని ఆందోళన చేపట్టారు. అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ గాంధీపురం, దాసరిమఠం, గోపాల్‌రాజు కాలనీలకు వెళ్లే రోడ్డుమార్గం చాలా ఇరుకుగా ఉండడంతో జగనన్న పాలనలో రోడ్డును వెడల్పు చేసినట్లు వెల్లడించారు. అయితే చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజకీయ కక్షతో దళితవాడలకు వెళ్లే రోడ్డును మూసివేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులను ఇబ్బంది పెట్టడం సరికాదని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లల్లో తిరుపతి నగరంలో ఒక చిన్నపాటి రోడ్డు కూడా నిర్మించలేదని విమర్శించారు. పైగా ఉన్న రోడ్డును మూసివేయాలని చూడడం దుర్మార్గమన్నారు. వెంటనే గాంధీపురానికి వెళ్లే రోడ్డు మార్గం మూసివేత పనులను ఆపివేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే టీటీడీ చౌల్ట్రీస్ ప్రారంభానికి విచ్చేసే ముఖ్యమంత్రి చంద్రబాబును స్థానికులతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లాని బాబు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే అజయ్‌కుమార్, మాజీ కార్పొరేటర్ తమ్ముడు గణేఃష్, నేతలు చేజర్ల మురళీ, కడపగుంట అమరనాఽథ్‌రెడ్డి, తాలూరి ప్రసాద్, కోటి పాల్గొన్నారు.


