తిరుపతి తుడా: తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో అరుదైన గర్భాశయ శస్త్ర చికిత్సను వైద్య బృందం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రమీలాదేవి మాట్లాడుతూ శ్రీకాళహస్తికి చెందిన 43 ఏళ్ల వెంకటమ్మ గత రెండేళ్లుగా దీర్ఘకాలిక గర్భాశయ సమస్యతో బాధపడుతోందన్నారు. తీవ్రమైన రక్తహీనతతో ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చారని చెప్పారు. క్లిష్టమైన గైనకాలజీ సమస్య కావడంతో నిపుణులైన వైద్య బృందం సమగ్రంగా శస్త్రచికిత్సను ప్రణాళికాబద్ధంగా నిర్వహించిందని వెల్లడించారు. వైద్య బృందం డాక్టర్ ఎస్.భువనేశ్వరి, డాక్టర్ ఉమాదేవి, డాక్టర్ లావణ్య, నర్సింగ్ సిబ్బందికి అభినందనలు తెలిపారు.
4న గోకులాష్టమి ఆస్థానం
తిరుమల : తిరుమలలో ఈ నెల 4వ తేదీన శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. బంగారు వాకిలి ముఖ మండపంలో రాత్రి 8 నుంచి 10 గంటల వరకు ఆస్థానం జరిపించనున్నారు. ఈ సందర్భంగా బంగారు సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణస్వామివారిని వేంచేపుచేసి నివేదనలు సమర్పించనున్నారు. ఉగ్రశ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంత తిరుమంజనం నిర్వహించనున్నారు. అనంతరం ద్వాదశారాధనం చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే 5వ తేదీన తిరుమలలో ఉట్లోత్సవం జరిపించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు తిరుచ్చిపై తిరుమాడ వీధులలో విహరించనున్నారు. ఈ మేరకు 5న శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. 4న గోగర్భం డ్యామ్ వద్ద ఉద్యానవనంలో శ్రీకృష్ణునికి ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పంచాభిషేకాలు చేపట్టనున్నారు.
‘కారీరిష్టి’కి నేడు పూర్ణాహుతి
తిరుమల : సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ తిరుమలలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న కారీరిష్టి యాగం గురువారం పూర్ణాహుతితో ముగియనుంది. వైదిక సంప్రదాయంలో భాగంగా వర్ష సమృద్ధి కోసం రుత్వికులు నల్లని వస్త్రాలను ధరించి నిర్వహించే ఈ యాగంలో నల్లని గుర్రం, నల్లని గొరెర, నల్లని తేనె, నల్లని బియ్యం, నల్లని ఖర్జూరం వంటి శ్రేష్ఠమైన ద్రవ్యాలను శాస్త్రోక్తంగా ఉపయోగిస్తారు. యజుర్వేదానికి సంబంధించిన మారుతమసి మంత్రాలను జపిస్తూ ఇష్టి యాగం చేపడతారు. యాగంలో గలిజేరు ఆకులను హోమ ద్రవ్యంగా సమర్పిస్తారు. అలాగే వేపశశాకతో తయారు చేసిన సమిధలను హోమగుండం చుట్టూ వెలిగించి వైదిక విధానంలో యాగక్రతువును జరిపిస్తారు.
సిరులతల్లి సేవలో ప్రముఖులు
చంద్రగిరి : తిరుచానూరు పద్మావతీదేవిని బుధవారం పలువురు ప్రముఖులు సేవించుకున్నారు. వీరిలో మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు, ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాస్ శెట్టి ఉన్నారు. ఆలయం వద్ద వారికి అధికారులు స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల : తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 78,310 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 34,573 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.4.14 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. టికెట్లు లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఉంటే 3 గంటల్లోనే దర్శనమవుతోంది.


