టీటీడీలో ఆధిపత్య పోరు | - | Sakshi
Sakshi News home page

టీటీడీలో ఆధిపత్య పోరు

Sep 3 2026 8:35 AM | Updated on Sep 3 2026 8:35 AM

● కుట్రపూరితంగానే లోకనాథం యాదవ్‌పై ఏసీబీ దాడులు ● నిజాయితీపరుడుపై కక్షపూరిత చర్యలు ● భూమన కరుణాకరరెడ్డి

తిరుపతి మంగళం : టీటీడీలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరిందని, అందులో డిప్యూటీ ఈఓ లోకనాథం యాదవ్‌ను బలిచేశారని, ఏసీబీ దాడుల వెనుక కుట్ర ఉందంటూ టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డిఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి టీటీడీని భ్రష్టుపట్టించడంతో పాటు కక్షపూరిత కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈఓ రవిచంద్ర, అదనపు ఈఓ వెంకయ్యచౌదరి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో నిజాయితీపరుడైన డిప్యూటీ ఈఓ లోకనాథం యాదవ్‌పై కుట్రపూరితంగా ఏసీబీ దాడులు చేయించారని ఆరోపించారు. రాజకీయాలు పక్కన పెడితే లోకనాథం యాదవ్‌ తనకు 40ఏళ్లగా పరిచయస్తుడని, ఆయన ఎంత నిజాయితీపరుడో అందరికీ తెలుసునన్నారు. అలాంటి వ్యక్తిపైన ఏసీబీ దాడులు జరపడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీలో యాదవులను అణిచివేయాలన్న కుట్రలతోనే లోకనాథం యాదవ్‌పై ఇలాంటి కుట్రలకు పాల్పడ్డారని విమర్శించారు. అవినీతికే తావులేకుండా నిత్యం శ్రీవేంకటేశ్వరస్వామి సేవకే అంకితమైన పరమభక్తుడు లోకనాథం యాదవ్‌ అని వెల్లడించారు. వారిది మొదటి నుంచే సంపన్నమైన కుటుంబమని, ఆయన తాత మునిస్వామి యాదవ్‌ అప్పట్లోనే కోటీశ్వరుడని తెలిపారు. అలాంటి కుటుంబ నేపథ్యం గల అధికారిపై అవినీతి మచ్చ వేసే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారంటూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు తనపై, వైవీ. సుబ్బారెడ్డిపై చంద్రబాబు, బీఆర్‌ నాయుడు దుష్ప్రచారం చేశారని గుర్తు చేశారు. అయితే లడ్డూకు ఉపయోగించే నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదంటూ సీబీఐ ఇచ్చిన నివేదికలో తేటతెల్లమైయిందని, సుప్రీంకోర్టు వంటి ఉన్నత న్యాయస్థానం కూడా చంద్రబాబుకు, బీఆర్‌ నాయుడులకు మొట్టికాయలు వేసిందని వివరించారు. టీటీడీ వంటి ఆధ్యాత్మిక సంస్థను బీఆర్‌ నాయుడు భ్రష్టుపట్టిస్తున్నాడని ఆరోపించారు.లోకనాథం యాదవ్‌కు టీటీడీ ఉద్యోగులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement