ఊరూవాడా వైఎస్సార్‌కు ఘన నివాళులు | YS Rajasekhara Reddy 17th death anniversary observed across the state | Sakshi
Sakshi News home page

ఊరూవాడా వైఎస్సార్‌కు ఘన నివాళులు

Sep 3 2026 6:03 AM | Updated on Sep 3 2026 6:03 AM

YS Rajasekhara Reddy 17th death anniversary observed across the state

రాష్ట్రవ్యాప్తంగా 17వ వర్ధంతి  

జలాభిషేకాలు, ధాన్యాభిషేకం, అన్నదానంతో సేవా కార్యక్రమాలు 

పల్లెల్లో ఆయన విగ్రహాల వద్ద హోరెత్తిన డాక్టర్‌ వైఎస్సార్‌ అమర్‌ రహే నినాదాలు 

అమెరికా, ఖతార్‌లో ప్రవాసాంధ్రులూ నిర్వహణ

సాక్షి, అమరావతి/మలికిపురం/లబ్బీపేట (విజయవాడ తూర్పు) : కోట్లాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డిని రాష్ట్ర ప్రజలు బుధవారం కన్నీటి నివాళులతో స్మరించుకున్నారు. మహానేత ఆశయాలను గుర్తుచేసుకుంటూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆయన 17వ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నుంచి తీసుకొచ్చిన జలాలతో జలాభిషేకాలు, ధాన్యాభిషేకం, అన్నదానాలు, పాలాభిషేకాలు,  పేదలకు పండ్ల పంపిణీ, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలతో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. పలుచోట్ల దుస్తులు పంపిణీ చేశారు. 

ప్రతి ఊరిలో ఆయన విగ్రహాల వద్ద మార్మోగిన ‘వైఎస్సార్‌ అమర్‌ రహే’ నినాదాలు.. మహానేతకు ప్రజల గుండెల్లో ఉన్న అభిమానానికి, ఆయన పాలనపై ఉన్న చెరగని జ్ఞాపకాలకు ప్రతీకగా నిలిచాయి. ఆయన పాలనలో పేదలకు అందించిన సంక్షేమ పథకాలను గుర్తుచేసుకున్నారు. విజయవాడలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. వందమందికి పైగా కార్యకర్తలు రక్తదానం చేశారు. కర్నూలు జిల్లా నల్లకాల్వ గ్రామంలోని వైఎస్సార్‌ స్మృతి వనంలో కూడా ఘనంగా నిర్వహించారు. చెన్నైలోనూ పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించి వైఎస్సార్‌కు నివాళులర్పించారు. పెరంబూరులోని పార్టీ కార్యాలయం ఆవరణలో వైఎస్సార్‌సీపీ తమిళనాడు విభాగం అధ్యక్షుడు ఏకే జకీర్‌ హుస్సేన్‌ నేతృత్వంలో పారిశుధ్య కార్మికులకు ఆహార ప్యాకెట్లను అందజేశారు. 

విదేశాల్లో..     
గల్ఫ్‌ దేశం ఖతార్‌ రాజధాని దోహాలోని న్యూసలాటాలో ఆ దేశ వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ జాఫర్‌ హుస్సేన్‌ ఆధ్వర్యంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతిని ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదానం చేశారు. పార్టీ నేతలు దొండపాటి శశికిరణ్, పార్టీ గల్ఫ్‌ ప్రతినిధులు, ఖతార్‌ కమిటీ సభ్యులు, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అలాగే, అమెరికాలోని న్యూజెర్సీలో శివారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌ వర్ధంతి నిర్వహించారు. వైఎస్సార్‌ చిత్రపటానికి ఆ పార్టీ రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి చల్లా మధుసూదన్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ నేతలు డాక్టర్‌ రాఘవరెడ్డి, అల్లా రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఢిల్లీలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో...
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్‌ అభిమానులు వేర్వేరుగా నివాళులు అర్పించారు. పార్లమెంట్‌లో వైఎస్సార్‌ చిత్రపటానికి వైవీ సుబ్బారెడ్డి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించగా.. ఏపీ భవన్‌లో అఖిల భారత్‌ సంఘాల సమైక్య సెక్రటరీ బండ్లపల్లి మదన్‌మోహన్‌రెడ్డి, అడ్వైజర్‌ బొమ్మారెడ్డి కోటిరెడ్డి, ఇంద్రప్రస్థ తెలుగు అసోసియేషన్‌ తరఫున రవీందర్‌రెడ్డి, డాక్టర్‌ కిరణ్‌ ఉదయ్, వైఎస్సార్‌ అభిమానులు షేక్‌ శివనాగురు (రాహుల్‌), డాక్టర్‌ హరిరెడ్డి, అన్వేష్, రవీంద్రరెడ్డి, రాజశేఖర్, హేమంత్, శివ, విజయ్, ఉదయ్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, క్రాంతికిరణ్, అపూర్వ, సురేష్, రామచంద్ర, రాజు తదితరులు కొవ్వొత్తులు వెలగించి వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement