పోర్టు చరిత్రలో అతి పెద్ద నౌకను బెర్తింగ్ చేసిన సిబ్బంది
2,66,877 టన్నుల క్రూడాయిల్ తెచ్చిన ఎమ్‌టీ ఎట్రిబేట్స్
సాక్షి, విశాఖపట్నం: కార్గో హ్యాండ్లింగ్‌లో విశాఖపట్నం పోర్టు అథారిటీ (వీపీఏ) మరో అరుదైన మైలురాయిని అందుకుంది. ఎమ్‌టీ ఎట్రిబేట్స్ అనే అత్యంత భారీ నౌకను విజయవంతంగా బెర్తింగ్ చేసి విశాఖ పోర్టు సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ భారీ క్రూడాయిల్ నౌకను ‘సింగిల్ పాయింట్ మూరింగ్ (ఎస్‌పీఎం)’ వద్ద లంగరు వేశారు. ఈ ఎస్‌పీఎం వద్ద భారీ నౌకలను నిలిపి, అక్కడి నుంచే పైప్‌లైన్ల ద్వారా ముడి చమురును నేరుగా తీరానికి తరలించే ప్రత్యేక ఫ్లోటింగ్ వ్యవస్థ ఉంది. విశాఖ పోర్టు చరిత్రలో ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద నౌక ఇదే.
2025లో నిర్మితమైన బెల్జియం దేశానికి చెందిన ఈ అత్యాధునిక ‘వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్ (వీఎల్‌సీసీ)’ నౌక 339.5 మీటర్ల పొడవు, 60.04 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. దీని డెడ్ వెయిట్ టన్నేజ్ సామర్థ్యం 3,21,761 మెట్రిక్ టన్నులు కావడం గమనార్హం. ఈ నౌక ద్వారా స్థానిక హెచ్‌పీసీఎల్ రిఫైనరీకి ఏకంగా 2,66,877 టన్నుల ముడి చమురు విశాఖకు తీసుకువచ్చారు. ఈ భారీ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా విశాఖ పోర్టు తన కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని, మౌలిక వసతుల అభివృద్ధిని మరోసారి ఘనంగా చాటుకుందని పోర్టు చైర్మన్ జస్మిత్ సింగ్ బింద్రా తెలిపారు.


