సాయికృష్ణ లాకప్‌డెత్‌పై స్పందించిన హైకోర్టు | High Court responds to Sai Krishna custodial death | Sakshi
Sakshi News home page

సాయికృష్ణ లాకప్‌డెత్‌పై స్పందించిన హైకోర్టు

Sep 3 2026 5:27 AM | Updated on Sep 3 2026 5:28 AM

High Court responds to Sai Krishna custodial death

సీబీఐ దర్యాప్తు విషయంలో కౌంటర్‌ దాఖలు చేయండి  

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం ఆదేశం  

సాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్‌పై సీబీఐ దర్యాప్తు కోరుతూ అతడి తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. సీబీఐ దర్యాప్తు విషయంలో పూర్తి కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్, జస్టిస్‌ గేదెల తుహిన్‌కుమార్‌ ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. తన కుమారుడు సాయికృష్ణ ఆచూకీ తెలియడం లేదని, అతడిని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఈ పిటిషన్‌ దాఖలు చేసిన తరువాత సాయికృష్ణ పోలీసుల లాకప్‌డెత్‌లో మృతిచెందినట్లు రూఢీ అయింది. దీంతో విజయలక్ష్మి తన కుమారుడి లాకప్‌డెత్‌ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. తరువాత ఈ వ్యాజ్యంలో పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీబీఐ దర్యాప్తు కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ఓసారి, ఉపసంహరించుకోవడంలేదని మరోసారి విజయలక్ష్మి చెబుతూ వచ్చారు. ఆమె తరఫున హాజరవుతున్న న్యాయవాదుల విషయంలో కూడా వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. 

విజయలక్ష్మి దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ బుధవారం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా విజయలక్ష్మి న్యాయవాది కోగంటి రిత్విక స్పందిస్తూ.. తమ పిటిషన్‌పై ప్రభుత్వ కౌంటర్‌కు తిరుగు సమాధానం (రిప్లై) దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు. అలాగే సాయికృష్ణ లాకప్‌డెత్‌పై సీబీఐ దర్యాప్తు కోరుతూ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసినట్లు చెప్పారు. దాన్ని పరిశీలించిన ధర్మాసనం.. సీబీఐ దర్యాప్తు విషయంలో కౌంటర్‌ దాఖలు చేశారా? అని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతిని ప్రశ్నించింది. దాఖలు చేయలేదని ఆమె చెప్పడంతో.. సీబీఐ దర్యాప్తు విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ధర్మాసనం విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement