ప్రాణం పోసిన మూగ జీవాలు | Cattle save owner from elephant attack | Sakshi
Sakshi News home page

ప్రాణం పోసిన మూగ జీవాలు

Sep 3 2026 5:34 AM | Updated on Sep 3 2026 5:34 AM

Cattle save owner from elephant attack

మదపుటేనుగు దాడి నుంచి యజమానిని కాపాడిన పశువులు 

చిత్తూరు జిల్లా కౌండిన్య అడవిలో ఘటన

పలమనేరు/ బైరెడ్డిపల్లి: తమను ఎంతో ఆప్యాయంగా చూసుకొనే యజమానుల పట్ల జంతువులు ప్రేమను పెంచుకొంటాయి. అవసరమైతే ప్రాణం పెడతాయి. చిత్తూరు జిల్లాలో ఇదే జరిగింది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలంలోని కౌండిన్య అభయారణ్యంలో బుధవారం సాయంత్రం మదపుటేనుగు దాడి నుంచి పశువులు వాటి యజమానిని కాపాడుకొన్నాయి. బైరెడ్డిపల్లె మండలంలోని అటవీ ప్రాంత గ్రామమైన కుప్పనపల్లికి చెందిన రంగప్ప (64) అడవిలో పశువులను కాస్తుంటాడు. అతనంటే వాటికి ఎంతో ఆప్యాయత. రంగప్ప చెట్టు కింద నిద్రిస్తుండగా పాములు, జంతువులు వస్తే పెద్దగా అరుస్తూ అప్రమత్తం చేసి ప్రమాదం నుంచి కాపాడుతుంటాయి.

బుధవారం యధావిధిగా ఆయన పశువుల మందను తోలుకొని కౌండిన్యలోని దట్టమైన అడవిలోకి వెళ్ళాడు. మొన్నటి దాకా పలమనేరు ప్రాంతంలో బీభత్సం సృష్టించిన ఒంటరి మదపుటేనుగు కుప్పనపల్లి వద్దకు చేరింది. పశువులను మేతకు వదిలి బండపై కూర్చొన్న రంగప్పపై హఠాత్తుగా దాడిచేసింది. తొండంతో అతన్ని విసిరేసింది. దీంతో అతను పొదల్లో పడ్డాడు. ఆ ఏనుగు మరోసారి రంగప్ప వైపు వస్తుండటంతో పశువులన్నీ దాన్ని చుట్టుముట్టాయి. బిగ్గరగా అరుస్తూ మదపుటేనుగుపై పోరాటానికి దిగాయి. 

పశువుల గుంపు ఒక్కసారిగా మీదకు రావడంతో ఏనుగు  పరారైంది. ఇంతలో ఏనుగు ఘీంకారాలు, పశువుల అరుపులు విన్న సమీపంలోని పశువుల కాపరులు అక్కడికి పరుగున వచ్చారు. రంగప్పను బైరెడ్డిపల్లికి తరలించారు. తన మూగజీవాలే తన ప్రాణాన్ని కాపాడాయంటూ రంగప్ప సగర్వంగా చెప్పాడు. ఇప్పటి దాకా కౌండిన్యలో ఏనుగుల దాడుల్లో ప్రాణాలతో బయటపడిన వారెవరూలేదు. కానీ పశువులు ఐకమత్యంతో ఏనుగును తరిమికొట్టి యజమాని ప్రాణాలను నిలబెట్టాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement