ట్రక్కు చార్జింగ్‌ స్టేషన్ల సమాచారం ఇక ఈజీ | India needs 10. 50 million EV charging points by 2030 | Sakshi
Sakshi News home page

ట్రక్కు చార్జింగ్‌ స్టేషన్ల సమాచారం ఇక ఈజీ

Sep 3 2026 5:32 AM | Updated on Sep 3 2026 5:32 AM

India needs 10. 50 million EV charging points by 2030

స్కౌట్‌ చార్ట్–పార్క్‌ డిజిటల్‌ పరికరం ఆవిష్కరణ

ఐఐటీ–మద్రాస్‌తో కలిసి రూపొందించిన ఐసీఐటీ 

2030 నాటికి 10.50 లక్షల ట్రక్‌ చార్జింగ్‌ స్టేషన్లు

సాక్షి, అమరావతి: దేశ రహదారులపై 100 శాతం ఎలక్రిక్‌ ట్రక్కుల (ఈ–ట్రక్కుల) లక్ష్యసాధన దిశగా కేంద్రప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసింది. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించడమేగాక సమాచార వ్యవస్థను కూడా పటిష్టపరుస్తోంది. సమీపంలో చార్జింగ్‌ స్టేషన్లు ఎక్కడున్నాయో ట్రక్కు డ్రైవర్లు తెలుసుకునేందుకు ఒక డిజిటల్‌ పరికరాన్ని రూపొందించింది. స్కౌట్‌ చార్ట్–పార్క్‌ అని పేరు పెట్టిన ఈ డిజిటల్‌ పరికరాన్ని ఐఐటీ–మద్రాస్‌తో కలసి ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ క్లీన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ (ఐసీసీటీ) ఆవిష్కరించింది. ట్రక్కు డ్రైవర్లు, యజమానులు, గ్రిడ్‌ నిర్వాహకులతోపాటు ప్రభుత్వసంస్థలకు కూడా ఉపయుక్తంగా ఏఐఎస్‌–140 ట్రాకింగ్‌ ప్రమాణాలకు అనుగుణంగా దీన్ని రూపొందించారు. మొత్తం 14 బిలియన్ల జీపీఎస్‌ పింగ్‌లు, 1.57 కోట్ల రికార్డెడ్‌ స్టాప్‌ ఈవెంట్లతోసహా ట్రాకింగ్‌ చేసే సామర్థ్యం ఈ పరికరానికి ఉంది. 

2050 నాటికి వందశాతం ఈ–ట్రక్కులే లక్ష్యం
ప్రస్తుతం దేశంలో 30 లక్షల వరకు సరుకు రవాణా ట్రక్కులు ఉన్నాయి. అవి ఏటా 10 వేలకోట్ల కిలోమీటర్ల మేర ప్రయాణిస్తున్నాయి. ఆ డీజిల్‌ వాహనాలే 25 శాతం కర్బన ఉద్గారాలు వెదజల్లుతున్నాయని అంచనా. అందుకే  దేశంలో రోడ్లపై వందశాతం ఈ–ట్రక్కులను ప్రవేశపెడితే కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు సూచించారు. దీంతో పదేళ్ల కాలపరిమితి దాటిన డీజిల్‌ ట్రక్కులను నిషేధించాలని కేంద్రప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. వాటిస్థానంలో ఈ–ట్రక్కులు కొనుగోలు చేసేందుకు పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. మరోవైపు ఈ–ట్రక్కుల కోసం చార్జింగ్‌ స్టేషన్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. 2030 నాటికి 50 వేల ట్రక్కు చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. 

2050 నాటికి దేశంలో 1.50 లక్షల ట్రక్కు చార్జింగ్‌ స్టేషన్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఈ చార్జింగ్‌ స్టేషన్లు ఎక్కడున్నాయన్నది ట్రక్కు డ్రైవర్లు ఎప్పటికప్పుడు రియల్‌ టైమ్‌ విధానంలో తెలుసుకునేందుకు వీలుగా స్కౌట్‌ చార్‌్జ–పార్క్‌ డిజిటల్‌ పరికరాన్ని రూపొందించారు. తమకు సమీపంలో ఉన్న చార్జింగ్‌ స్టేషన్లు, పార్కింగ్‌ జోన్లు, దాబాలు, పోలీస్‌స్టేషన్లు, ఆస్పత్రులు, ఇతర సమాచారం కూడా ఈ పరికరం ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక ట్రక్‌ యజమానులు కూడా తమ ట్రక్కు ఎక్కడ ఉంది, సరైన మార్గంలోనే గమ్యస్థానానికి చేరుతోందా లేదా అన్నది కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. రహదారి భద్రత, నేరాల నియంత్రణ  కోసం పోలీసు, ఇతర శాఖలకు కూడా ఈ పరికరం ఉపయోగపడుతుంది. స్కౌట్‌ చార్ట్–పార్క్‌ పరికరంపై విస్తృత అవగాహన కల్పించాలని ఐసీసీటీ నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement