నిషేధాన్ని తుంచి... విషాదాన్ని పంచి | State Health Department officials distributed pills in Gullaguppa Polavaram district | Sakshi
Sakshi News home page

నిషేధాన్ని తుంచి... విషాదాన్ని పంచి

Sep 3 2026 5:48 AM | Updated on Sep 3 2026 5:48 AM

State Health Department officials distributed pills in Gullaguppa Polavaram district

క్లోరోక్విన్‌తో కూడిన ఊహాజనిత చికిత్స ఇకపై వాడవద్దని 2013 మలేరియా డ్రగ్‌ పాలసీలో స్పష్టం చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ

‘గిరి’బిడ్డల ప్రాణాలతో చెలగాటం 

మలేరియా నిర్ధారణ కాకుండా ‘క్లోరోక్విన్‌’ వాడవద్దని కేంద్రం మార్గదర్శకాలు

పోలవరం జిల్లా గుల్లగుప్పలో మాత్రలు పంపిణీ చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు 

మందు వికటించి బాలిక మృతి.. మరొకరి పరిస్థితి విషమం 

అస్వస్థతతో 52 మంది వరకు ఆస్పత్రిలో చేరిక 

సాక్షి, అమరావతి: గిరిజన బిడ్డల ప్రాణాలతో చంద్రబాబు ప్రభు­త్వం చెలగాటమాడుతోంది. పోతే పోయేది ప్రాణాలే కదా అనే నిర్లక్ష్య ధోరణితో వ్యవహారిస్తోంది. గిరి‘జనం’లో వ్యాధుల వ్యాప్తిని అరికట్టడంలో­నూ విఫలమవుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను సైతం తుంగలో తొక్కుతోంది. వ్యాధి నిర్ధారణ కాకుండా క్లోరోక్విన్‌ మాత్రలు వాడవద్దన్న నిబంధనలను సైతం కాలరాసి వారి ఉసురు తీస్తోంది. తాజాగా,  పోలవరం జిల్లా గుల్లగుప్పలో మలేరియా నివారణ చర్యల్లో భాగంగా క్లోరోక్విన్‌ మాత్రలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పంపిణీ చేసింది. మాత్రలు వికటించి ఏడేళ్ల గిరిజన బాలిక మృతి చెందింది. మరో బాలిక పరిస్థి­తి విషమంగా ఉంది. సుమారు 52 మంది వరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

13 ఏళ్ల కిందటే స్పష్టమైన మార్గదర్శకాలు
దేశంలో 2013లోనే మలేరియా ముందస్తు నివారణ చికిత్సలో క్లోరోక్విన్‌ మాత్రల వినియోగాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ నిషేధించింది. మలేరియా చికిత్సపై స్పష్టమైన మార్గదర్శకాలనూ ఇచ్చింది. జ్వరం ఇతర మలేరియా అనుమానిత లక్షణాలు ఉన్న వారికి ర్యాపిడ్‌ డయాగ్నస్టిక్‌ కిట్‌ (ఆర్‌డీటీ)/ మైక్రోస్కోపీ రక్త పరీక్ష చేసి వ్యాధి నిర్ధారణ చేయకుండా మాత్రల పంపిణీ చేయడాన్ని నిషేధిం చింది. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో ఈ మార్గదర్శకాలు ఉల్లంఘించకూడదని స్పష్టం చేసింది. మలేరియాకు సంబంధించి టెస్ట్, ట్రీట్, ట్రాక్‌ (టీ3) విధానం అమలు చేయాలని తేల్చి చెప్పింది. అయినా గుల్లగుప్ప గ్రామంలో వ్యాధి నిర్ధారణ చేయకుండా రాష్ట్ర వైద్య శాఖ క్లోరోక్విన్‌ మాత్రలు పంపిణీ చేయడం ప్రాణాల మీదకు తెచ్చింది.

నిర్ధారణ చేయకుండా ఎందుకు వాడకూడదు? 
పిల్లల్లో క్లోరోక్విన్‌ సురక్షిత పరిమితి చాలా తక్కువ. మోతాదు ఏమాత్రం ఎక్కువైనా అది తీవ్ర గుండె సమస్యలు, రక్తపోటు, ఫిట్స్‌/ప్రాణాంతక విషప్రభావం వంటి అంశాలకు దారి తీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. డెంగీ, టైఫాయిడ్‌ జ్వరాలు, ఇతర వైరల్‌ ఇన్ఫెక్షన్‌లతో వచ్చి ఉంటే, ఊహాజనితంగా క్లోరోక్విన్‌ వాడితే అసలైన వ్యాధికి చికిత్స అందక ఆరోగ్యం విషమించే ప్రమాదం ఉంది.  ఆరోగ్య శాఖ గుల్లగుప్పలో ఇవేమీ పట్టించుకోకుండా పాఠశాల విద్యార్థులు సహా 71 మందికి క్లోరోక్విన్‌ మాత్రలు వేసింది.

ఆసుపత్రి పాలయ్యాక
ఇక చికిత్స నియమావళి ప్రకారం వైవాక్స్‌ మలేరియా నిర్ధారణ అయిన రోగులకు క్లోరోక్విన్‌ను మూడు రోజుల పాటు శరీర బరువు ఆధారంగా ఇస్తారు. వ్యాధి నిర్ధారణ కాకుండా, విద్యార్థుల బరువు పట్టించుకోకుండా గుల్లగుప్పలో మందుల పంపిణీ చేశారు. బాలిక మృతి చెంది, పదుల సంఖ్యలో బాధితులు ఆస్పత్రి పాలయ్యాక ప్రభుత్వం మేలుకొంది. దీని ఫలితమే బుధవారం జాతీయ మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement