18.3 శాతం మంది యువతకి వ్యసనంగా సోషల్ మీడియా
విద్యార్థుల్లో 68.2 శాతం మందికి నిద్ర సమస్య
రోజుకు 5 నుంచి 8 గంటలు ఫోన్‌తోనే గడుపుతున్న 29.6 శాతం మంది
2 నుంచి 4 గంటలు ఫోన్ చూస్తున్న వారు 44.9 శాతం మంది
55 అధ్యయనాల వివరాలు వెల్లడించిన మెటా
పడుకునే ముందు స్క్రీన్ చూస్తే నిద్రపై తీవ్ర ప్రభావం
సెల్ ఫోన్ ఎక్కువగా వాడితే నిద్ర నాణ్యతకు దెబ్బ
సాక్షి, అమరావతి: రాత్రి భోజనం అయిన వెంటనే మంచంపైకి వెళ్లి ఫోన్ చేతిలోకి తీసుకోవడం.. రీల్స్, షార్ట్స్, సోషల్ మీడియా పోస్టులు చూడటం.. మధ్యలో ఓ వెబ్‌సిరీస్ ఎపిసోడ్.. ‘ఐదే నిమిషాలు’ అంటూ మొదలయ్యే ఈ అలవాటు గంటల తరబడి సాగిపోతుంది. ఫలితంగా నిద్ర సమయం తగ్గిపోయి, నిద్ర నాణ్యత దెబ్బతిని.. చివరకు ఆరోగ్యం దెబ్బతింటోందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా పడుకునే ముందు సోషల్ మీడియా, స్ట్రీమింగ్ వంటి డిజిటల్ మీడియా వినియోగం ఎక్కువగా ఉన్నవారిలో నిద్ర సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సమస్య కేవలం స్క్రీన్ వెలుతురుతోనే కాదు.
ఆసక్తికరమైన కంటెంట్ మెదడును చురుగ్గా ఉంచుతుంది. దాని వల్ల నిద్ర రాదు. అందుకే పడుకునే ముందు సెల్ ఫోన్, సోషల్ మీడియాను దూరంగా ఉంచటం, మంచంపై ఫోన్ వాడకపోవడం, అవసరం లేని నోటిఫికేషన్లు ఆపేయడం వంటి అలవాట్లు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కేవలం ఒకటి రెండు అధ్యయనాలు చెప్పిన విషయం కాదు. 55 అధ్యయనాల పేపర్లు, 41,716 మంది పాల్గొన్న డేటాను విశ్లేíÙంచిన ‘మెటా’ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. రోజూ 5 నుంచి 8 గంటలు సెల్‌ఫోన్‌తో గడుపుతున్న వారు 29.6 శాతం ఉన్నట్లు వెల్లడించింది. 2 నుంచి 4 గంటలు ఫోన్ చూస్తున్న వారు 44.9 శాతం ఉన్నట్లు గుర్తించింది. నిద్రకు ముందు గంటలో స్క్రీన్ ఉపయోగిస్తున్నామని 46.7 శాతం మంది తెలిపారు.
18.3 శాతం మందిలో సోషల్ మీడియా వ్యసనం
ఈ ఏడాది ప్రచురితమైన ‘బియాండ్ స్క్రీన్ టైమ్’ అధ్యయనంలో 722 మంది పెద్దలను పరిశీలించారు. నిద్రకు ముందు డిజిటల్ మీడియా వినియోగం, నిద్ర నాణ్యత, నిద్ర వ్యవధి, నిద్ర పట్టేందుకు పట్టే సమయాన్ని విశ్లేషించారు. సోషల్ మీడియా, స్ట్రీమింగ్ వినియోగం ఎక్కువగా ఉన్న వర్గాల్లో సుమారు 8 శాతం వరకు నిద్ర తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. నిద్ర పట్టే సమయంలోనూ సుమారు 15 శాతం వ్యత్యాసం ఉన్నట్లు తెలుసుకున్నారు.
» మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా ప్రాంతంలో 18 నుంచి 25 ఏళ్ల వయసున్న 750 మంది కాలేజీ విద్యార్థులపై ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన అధ్యయనంలో 18.3 శాతం మందిలో సోషల్ మీడియా వ్యసనం ఉన్నట్లు తేలింది. ఈ వ్యసనం పెరిగేకొద్దీ నిద్ర నాణ్యత తగ్గుతున్నట్లు గుర్తించారు. రోజుకు 3 గంటలకు మించి సోషల్ మీడియా వినియోగం కూడా వ్యసనంగా భావించాలని అధ్యయనం తెలిపింది.
» 2024లో తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో జరిగిన అధ్యయనంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీకి చెందిన 792 మంది విద్యార్థులను పరిశీలించగా.. 17.7 శాతం మందికి సోషల్ మీడియా వ్యసనం ఉన్నట్లు తేలింది.
» పట్నాలోని ఏడు మెడికల్ కాలేజీలకు చెందిన 510 మంది అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులపై 2025 జూన్‌లో నిర్వహించిన మరో అధ్యయనంలో 68.2 శాతం మందికి నిద్ర నాణ్యత సరిగా లేదని తేలింది.


