డామిట్‌.. సభ అడ్డం తిరిగింది..! | Women protested that they had not received schemes for two years | Sakshi
Sakshi News home page

డామిట్‌.. సభ అడ్డం తిరిగింది..!

Sep 3 2026 5:58 AM | Updated on Sep 3 2026 5:58 AM

Women protested that they had not received schemes for two years

జమ్మలమడుగు ముఖాముఖిలో తిరగబడ్డ మహిళలు

కూటమి ఎమ్మెల్యేపై ప్రశ్నల వర్షం 

రెండేళ్లుగా పథకాలు అందలేదని నిలదీసిన మహిళలు 

‘మహిళా బాగు.. సంభాషణ’ సభలో కూటమి సర్కారుకు షాక్‌ 

జమ్మలమడుగు: మహిళలకు ఏదో చేసేశామని కలరింగ్‌ ఇచ్చుకొనేందుకు కూటమి నేతలు సభ పెట్టారు. కానీ, మాకే పథకమూ అందలేదంటూ మహిళలు తిరగబడటంతో నేతలు కంగుతిన్నారు. చివరకు వచ్చే రెండేళ్లలో పథకాలు ఇప్పిస్తామంటూ వెళ్లిపోయారు. వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగులో బుధవారం ఏర్పాటు చేసిన ‘మహిళా బాగు.. సంభాషణ’ కార్యక్రమంలో చంద్రబాబు సర్కారుకు మహిళలు ఇచ్చిన షాక్‌ ఇది. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి, కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

సభ ప్రారంభమైన వెంటనే మహిళలు ఒక్కసారిగా లేచి కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలో ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందడంలేదంటూ నిలదీశారు.  కొత్తగా వితంతు పెన్షన్లు, వికలాంగుల, వృద్ధాప్య పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు మంజూరు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్లు ఎప్పుడు ఇస్తారంటూ నిలదీశారు. ‘తల్లికి వందనం’ నిధులు, మహిళల స్వయం ఉపాధికి తోడ్పడే ’పావలా వడ్డీ’ రుణాలు ఏవని ఎమ్మెల్యేని నిలదీశారు. 

ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ‘తల్లికి వందనం’ ఇస్తామని మాట తప్పారని ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని విధాలా అర్హత ఉన్నా తమ ఇద్దరు పిల్లలకు ఈ పథకం రాలేదని, తల్లిదండ్రులు చనిపోయిన ఆ ఇద్దరు పిల్లలను ఎలా సాకాలని ఓ వృద్ధురాలు కన్నీటి పర్యంతమైంది. తన కోడలు స్త్రీనిధి కింద బ్యాంకులో రుణం తీసుకుందని.. అయితే కొడుకు, కోడలు ఇద్దరూ చనిపోయారని, ఆ అప్పు తీర్చాలని బ్యాంకర్లు తమపై ఒత్తిడి తెస్తున్నారని మరో వృద్ధురాలు వివరించింది. 

నా భర్త మీ దగ్గరే పనిచేశారు.. అయినా పెన్షన్‌ లేదు 
‘నా భర్త మీ వద్దే 15 ఏళ్లపాటు నమ్మకంగా పనిచేశారు. ఆయన చనిపోయి ఏడాది దాటింది. కుటుంబ భారం మోయలేక వితంతు పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసి, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా. ఇప్పటికీ మంజూరు కాలేదు‘ అంటూ ఎమ్మెల్యేకు ఓ మహిళ చెప్పింది. 

మహిళల మైకులు కట్‌ 
ఇలా మహిళల నుంచి విపరీతమైన ప్రశ్నలు, నిలదీతలు ఎదురవుతుండటంతో మైక్‌ల సౌండ్‌ తగ్గించేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, భూపేష్ రెడ్డి కలగజేసుకుని.. మరో రెండు సంవత్సరాల్లో ఈ పథకాలన్నీ అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహిళలు మాట్లాడేందుకు మరో అవకాశం ఇవ్వలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement