ఊరు నీరై.. బతుకు గోదారై! | Poor conditions in Polavaram rehabilitation colonies | Sakshi
Sakshi News home page

ఊరు నీరై.. బతుకు గోదారై!

Sep 3 2026 6:11 AM | Updated on Sep 3 2026 6:12 AM

Poor conditions in Polavaram rehabilitation colonies

పోలవరం పునరావాస కాలనీల్లో దయనీయ పరిస్థితులు

సాక్షి ప్రతినిధి, కాకినాడ / రంపచోడవరం/దేవీపట్నం: ఆంధ్రుల జీవనాడి పోలవరం నిర్మాణం పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని వారంతా కష్టాలను, అనుబంధాన్ని దిగమింగుకుని సర్వస్వం త్యాగం చేశారు. పుట్టిన గడ్డతో దశాబ్దాలుగా పెంచుకున్న మమకారాన్ని ప్రాజెక్టు కోసం వదులుకున్నారు. ఇళ్లు, సారవంతమైన వ్యవసాయ భూ­ము­లను అప్పగించి నిర్వాసిత కాలనీల్లో తలదాచుకున్నారు. 

ఇలా పోలవరం కోసం సర్వం కోల్పోయిన నిర్వాసితులు పునరావాస కాలనీల్లో దుర్భర జీవితాలు గడుపుతున్నారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ పూర్తి స్థాయిలో అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీల్లో కనీస మౌలిక వసతు­లు లేక దయనీయంగా బతుకీడుస్తున్నారు. పొట్ట కూటి కోసం కూలీలుగా మారిపోయి కిలోమీటర్లు వెళ్లి వస్తున్నారు. పోలవరం జిల్లాలోని ప్రాజె­క్టు నిర్వాసిత కాలనీల్లో గడుపుతున్న వారి దుస్థితి ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌లో వెలుగులోకి వచ్చింది. 

కాలనీల్లో కన్నీటి కష్టాలు.. 
పోలవరం పరిధిలోని గిరిజనులకు ఇందుకూరుపేట, పోతవరం, ఇందుకూరు, పెదబియ్యంపల్లి పరిసర ప్రాంతాల్లో పున­రావాస కాలనీలు నిర్మించారు. గిరిజనేతరులకు మైదాన ప్రాంతంలో నిర్మించారు. వీటిలో సుమారు 7,344 మందికి పైగా నివసిస్తున్నారు. ‘సాక్షి’ బృందం తాళ్లూరు, తెలిపేరు, కొండమొదలు, నాగళ్లపల్లి, దండంగి తదితర కాలనీలను పరిశీలించగా గోకవరం మినహా మిగిలిన అన్ని చోట్లా కుప్పలు తెప్పలుగా సమస్యలు బహిర్గతమయ్యాయి. 

» తాళ్లూరు గ్రామస్తులు రెండేళ్ల క్రితం ఊరు ఖాళీ చేసి నిర్వాసిత కాలనీకి తరలి వచ్చారు. వారి విన్నపాలను ఏమాత్రం పట్టించుకోకుండా నిర్మిం­ంచిన కాలనీలో అడుగడుగునా నాసిరకం 
నిర్మాణాలే దర్శనమిస్తున్నాయి. 
»    భూమి చదును చేయకుండా నిర్మాణాలు చేపట్టారు. ఇళ్లు 12 అడుగుల ఎత్తుకు బదులు 11 అడుగులతో సరిపెట్టేశారు. 
»   మరుగుదొడ్లు 7 అడుగుల ఎత్తుకు గాను 5 అడుగుల్లో­నే నిర్మించడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా­రు. 
»  ఇళ్ల స్లాబ్‌లు వర్షపు నీటికి లీకవుతున్నాయి. వర్షం పడితే నీళ్లన్నీ ఇంట్లోకి చేరుతున్నాయి. దీనిపై నిర్వాసితులు గ్రామానికి వచ్చిన జాతీయ ఎస్టీ కమిషన్‌ డైరెక్టర్లకు ఫిర్యాదు చేయడంతో తూతూమంత్రంగా స్లాబ్‌పై ఇసుక, చిప్స్‌ వేసి చేతులు దులిపేసుకున్నారు. దీంతో పరిస్థితి మళ్లీ యథాతథంగా మారింది. 
»   మురుగు కాలువల నిర్మాణం దారుణంగా ఉంది. ఎత్తు పల్లాలు చూడకుండా కట్టేయడంతో ఎక్కడి నీరు అక్కడే నిల్వ ఉంటోంది. దీంతో దోమలు వృద్ధి చెంది నిర్వాసితులు రోగాల బారిన పడుతున్నారు. 
»  ఇళ్ల నిర్మాణానికి భూమి చదును చేయకుండానే రూ.40 లక్షల వరకూ నిధులు స్వాహా చేసినట్లు కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు.  
»  గొందూరు, నేలకోట, నాగళ్లపల్లి, డి.రావిలంక, బో­డుగూడెం నిర్వాసితులకు నిర్మించిన కాల­నీల్లో మరుగుదొడ్లు నిర్మించలేదు. నిర్వాసితులే సొంత­ంగా బాత్‌రూములు కట్టుకున్నా డబ్బులు ఇవ్వలే­దు. 
»  కాలనీల్లో తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. బోర్లలో నీరు రావడం లేదు. కాలనీలకు సత్యసాయి పథకం కింత తాగునీరు సరఫరా చేస్తామన్న హామీని నెరవేర్చలేదు. నీటి కోసం నిర్వాసితులు పక్క గ్రామం పోతవరం వెళ్లాల్సి వస్తోంది.

పొలం పోయి.. ఉపాధి దూరమై
చిత్రంలో కనిపిస్తున్న కుర్ల రామిరెడ్డి పోలవరం నిర్వాసితుడు. దేవీపట్నం మండలం తాళ్లూరులో ఆయనకున్న అరెకరం భూమి, ఇల్లు ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవడంతో రెండేళ్ల క్రితం తాళ్లూరు పునరావాస కాలనీకి వచ్చారు. నిబంధనల మేరకు బాధితుడికి భూమికి బదులు భూమి ఇవ్వాలి. అది సాగుకు యోగ్యమైనదిగా ఉండాలి. కానీ, తామిచ్చిన భూమే తీసుకోవాలంటూ ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. 

తాతముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూమి కోల్పోడంతో నలుగురు ఉంటున్న కుటుంబాన్ని పోషించేందుకు 50 కి.మీకు పైగా ప్రయాణించి రాజమహేంద్రవరంలో కూలి పనులకు వెళ్లి బతుకుబండి లాగుతున్నారు. ఆర్థిక పరిస్థితులు సహకరించక ఆయన కుమార్తె డిగ్రీ చదువు మధ్యలో ఆగిపోయింది. సాగు భూమి ఇవ్వాలని కాళ్లరిగేలా తిరుగుతున్నా కనికరించే నాథుడే లేడని రామిరెడ్డి వాపోతున్నాడు. తల్లి కుర్ల చెల్లాయమ్మకు రావా­ల్సిన ప్యాకేజీ సైతం అందలేదని చెబుతున్నాడు.

అలాంటి భూములే ఇవ్వమంటున్నాం.. 
గ్రామాన్ని ఖాళీ చేసి పునరావాస కాలనీకి వచ్చాం. మా ఊరి రైతుల భూమి 30 ఎకరాల వరకూ పోలవరం ముంపులో పోయింది. ఇప్పటి వరకూ ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదు. సాగుకు పనికిరాని భూమి ఇస్తామంటే వద్దని చెప్పాం. మేం రెండు పంటలు పండే భూములు ఇచ్చాం. అలాంటి భూములే కావాలని అడుగుతున్నాం. ఎవరూ పట్టించుకోవడం లేదు. కాలనీలు అధ్వానంగా ఉన్నాయి. కాంట్రాక్టర్‌ నాసిరకంగా నిర్మించారు. – పాములేటి శ్రీనివాస్‌రెడ్డి, తాళ్లూరు పునరావాస కాలనీ 

డీ–పట్టాకు పరిహారం ఏది? 
దండంగి, సీతారం, గంగంపా­లెం గ్రామాల్లో 300 ఎక­రాల డీ­–­పట్టా భూమి ఉంది. గ్రా­మా­న్ని ఖాళీ చేసినా ఆ భూ­మికి ఇంతవరకు పరిహారం ఇవ్వ­లే­దు. ఆ భూమి సాగు చేసుకునేందుకు వెళ్దామంటే చుట్టూ వరద నీరు ఉంటోంది. గ్రామాల్లో ఉపాధి లేక ప­నుల కోసం మైదాన ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి.  – సోదే వెంకన్నదొర, నాగళ్లపల్లి కాలనీ

పరిహారం ఇవ్వలేదు.. 
తెలిపేరు నుంచి 2019లో తాళ్లూరు కాలనీకి వచ్చాం. ఇక్కడ ఐదు మంది ఉంటున్నాం. ముగ్గురు పిల్లలున్నారు. మాకు ఇంతవరకూ పరిహారం ఇవ్వలేదు. కుటుంబ పోషణ భారంగా మారింది. ఉపాధి కోసం రాజమహేంద్రవరం, 
ఇందుకూరుపేట వెళ్లాల్సి వస్తోంది.  – పుల్ల కాంతమ్మ, తాళ్లూరు కాలనీ 

నోటిఫై అయినా పరిహారం లేదు.. 
గంగన్నపాలెంలో రెండెకరాల డీ–పట్టా భూమి పోలవరం ముంపులో పోయింది. నోటిఫై చేసి­నా పరిహారం అందడం లేదు. అదేమని ప్రశ్నిస్తే సమాధానం చెప్ప­డం లేదు. భూమి సాగు చేసుకుందామనుకుంటే ముంపులో ఉంది. భూమికి బదులు భూమి ఇస్తారా అంటే అదీ లేదు. పొట్టకూటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. – కోసి సోమన్నదొర, గంగంపాలెం

41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలో..
పోలవరం ముంపు గ్రామాలు 172 
పునరావాస కేంద్రాలకు తరలించాల్సిన కుటుంబాలు 38,060
ఇంకా పునరావాసం కల్పించాల్సినవి 20,799
నిర్మించాల్సిన పునరావాస కాలనీలు 121
నిర్మించిన కాలనీలు 26
ఇంకా నిర్మించాల్సినవి 95

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement