తిరుపతిలో దారుణం.. రూ.6 కోట్ల వ్యవహారంలో కలకలం! | Friends Kidnap Sumanth At Tirupati Full Details Here | Sakshi
Sakshi News home page

తిరుపతిలో దారుణం.. రూ.6 కోట్ల వ్యవహారంలో కలకలం!

Sep 3 2026 7:37 AM | Updated on Sep 3 2026 7:53 AM

Friends Kidnap Sumanth At Tirupati Full Details Here

సాక్షి, తిరుపతి: డబ్బు ఆశతో స్నేహితుడినే కిడ్నాప్‌ చేసిన ఘటన తిరుపతిలో కలకలం రేపింది. రూ.6 కోట్ల ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో స్నేహితుడిని కిడ్నాప్‌ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనలో కీలక నిందితులుగా ఉన్న గౌతమ్‌, మనోజ్‌, యశ్వంత్‌రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. స్థానికంగా ఈ కిడ్నాప్‌ వార్త చర్చనీయాంశంగా మారింది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతిలోని చంద్రగిరి మండలం నాగపట్నం గ్రామానికి చెందిన సుమంత్‌ యూకేలో చదువు పూర్తి చేసుకుని ఇటీవల భారత్‌కు తిరిగి వచ్చాడు. అనంతరం ‘నాని క్రికెట్‌ ప్రిడిక్షన్‌’ పేరుతో టెలిగ్రామ్‌ ఛానల్‌ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో నార్త్‌ ఇండియాకు చెందిన వ్యక్తులకు సుమంత్‌ రూ.6 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. ఇందుకు అడ్వాన్స్‌గా రూ.30 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వివిధ హవాలా మార్గాల్లో సుమంత్‌కు భారీ మొత్తంలో నగదు చేరినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న అతడి స్నేహితులు అత్యాశకు గురై సుమంత్‌ను కిడ్నాప్‌ చేయాలని పథకం వేశారు.

ఇండోనేషియా నుంచి రాగానే కిడ్నాప్‌
ఇండోనేషియాకు వెళ్లిన సుమంత్‌ తిరిగి వచ్చిన వెంటనే జూలై 29న బెంగళూరులో అతడిని కిడ్నాప్‌ చేసిన స్నేహితులు.. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలోని ఓ హోమ్‌స్టేకు తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మనోజ్‌కు చెందిన అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ మనోజ్‌, చరణ్‌ మద్యం మత్తులో ఉండగా సుమంత్‌ తన యూరప్‌లో ఉన్న గర్ల్‌ఫ్రెండ్‌కు వాట్సాప్‌లో మెసేజ్‌ పంపాడు. తనను కిడ్నాప్‌ చేశారని ఆమెకు సమాచారం అందించాడు. దీంతో ఆమె హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. కిడ్నాప్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

రూ.30 లక్షలు స్వాధీనం
ఈ ఘటనపై కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల నుంచి రూ.30 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. తిరుపతి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన కిడ్నాప్‌ ఘటనపై సుమంత్‌ ఆగస్టు 28న ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు ముమ్మరం చేసిన తిరుపతి రూరల్‌ పోలీసులు చంద్రగిరికి చెందిన బాలాజీ, చరణ్‌, వాజిద్‌ భాషాలను అరెస్ట్‌ చేశారు. అయితే ఈ కిడ్నాప్‌ వెనుక ప్రధాన సూత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న యశ్వంత్‌, మనోజ్‌, గౌతమ్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement