అచ్చ కాంగ్రెస్‌లో పచ్చ మీడియా చిచ్చు | Sakshi Editorial On Yellow Media and Congress Party by Vardhelli Murali | Sakshi
Sakshi News home page

అచ్చ కాంగ్రెస్‌లో పచ్చ మీడియా చిచ్చు

Aug 30 2026 12:23 AM | Updated on Aug 30 2026 12:23 AM

Sakshi Editorial On Yellow Media and Congress Party by Vardhelli Murali

జనతంత్రం

తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ ఎపిసోడ్‌ ముగిసినట్లేనా? ఇంకా సశేషంగానే ఉన్నాదా? ప్రస్తుత రాజకీయ పరిశీల కుల మెదడుకు మేత వేస్తున్న ప్రశ్న ఇది. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాలపై లోతైన అవగాహన ఉన్నవారు మాత్రం మరోరకంగా ఆలోచిస్తున్నారు. వాళ్లను తొలుస్తున్న ప్రశ్నావళి సురేఖ ఉదంతం కంటే విస్తృతమైనది. రాష్ట్ర కాంగ్రెస్‌లోగానీ, ఎమ్మెల్యేలు, మంత్రి వర్గ సహచరుల్లోకానీ నిజంగానే రేవంత్‌రెడ్డికి మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నాదా? ఆయన పాలనపై అధిష్టానం వైఖరి ఏమిటి? ప్రభుత్వ పనితీరు మీద ప్రజల్లో కనిపిస్తున్న పెదవి విరుపు ఎక్కడికి దారితీయనున్నది? అసలు తెలంగాణ కాంగ్రెస్‌ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతున్నది? ఇటువంటి ప్రశ్నలు తలెత్త డానికి సహేతుకమైన కారణాలే కనిపిస్తున్నాయి. కారణాలు న్నాయి కనుకనే యెల్లో మీడియా కలవరపాటుకు లోనవు తున్నది. ఆవేదన వెళ్లగక్కుతున్నది. 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పార్టీ–ప్రభుత్వ వ్యవహారాల్లో పూర్తి స్వేచ్ఛనివ్వడం లేదని కాంగ్రెస్‌ అధిష్టానంపై యెల్లో మీడియా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నది. రేవంత్‌ నాయకత్వా నికి కంట్లో నలుసుగా వుండే నేతలను ఏరిపారేసి ఆయన్ను బలోపేతం చేయకుంటే కాంగ్రెస్‌ పార్టీకి పోగాలం దాపురిస్తుందని హెచ్చరించడానికి కూడా యెల్లో మీడియా వెనుకాడటం లేదు. తెలుగుదేశం పార్టీకి యెల్లో మీడియా అనుబంధ పరిశ్ర మగా పని చేస్తు్తన్నదని కొత్తగా చెప్పుకోనవసరం లేదు. కాంగ్రెస్‌ వ్యతిరేకతే పునాదిగా తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్‌ ఏర్పాటు చేశారన్నది నిజం. కేంద్రంలో రాజీవ్‌ సర్కార్‌ను గద్దెదించడం కోసం నేషనల్‌ ఫ్రంట్‌కు ఎన్టీఆర్‌ రూపశిల్పిగా మారిన సంగతి కూడా నిజం. అటువంటి తెలుగుదేశం పార్టీకి, దాని అనుబంధ యెల్లో మీడియాకు తెలంగాణ కాంగ్రెస్‌పై ఇంతటి అవ్యాజమైన వాత్సల్యం కుదరడానికి కారణమేమిటి? 

ఇది కూడా బ్రహ్మరహస్యమేమీ కాదు. తెలుగు ప్రజలంద రికీ తెలిసిన విషయమే. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణపై పెత్తనం చేయాలనే కోరిక చంద్రబాబుకు చావ లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల ఓట్ల కొనుగోలుకు ప్రయ త్నిస్తూ ఆడియో సాక్షిగా చంద్రబాబు, వీడియో సాక్షిగా అప్పటి ఆయన సహచరుడు రేవంత్‌రెడ్డి క్యాష్‌తో సహా దొరికిపోవడం, ఫలితంగా హైదరాబాద్‌ను వదిలేసి చంద్రబాబు పారిపోవడం తెలిసిన కథే. తామేదో రహస్యంగా దొంగతనం చేయబోతే అన్యాయంగా పట్టుకుని కేసీఆర్‌ అల్లరి పెట్టాడనే కోపం అప్ప ట్నుంచే చంద్రబాబుకూ, రేవంత్‌కూ ఉన్నది. చంద్రబాబుకు జలుబు చేస్తే ముక్కు చీదే అలవాటున్న యెల్లో మీడియా కూడా నాటినుంచే కేసీఆర్‌ను శత్రువుగా ప్రకటించుకున్నది. 

ఉమ్మడి రాష్ట్రంలో వరుసగా రెండుసార్లు రాజశేఖరరెడ్డి చేతిలో ఓటమి పాలైన చంద్రబాబు, జగన్‌ రాజకీయ జీవితాన్ని మొగ్గలోనే తుంచేయడం కోసం పదిహేనేళ్ల కిందనే కాంగ్రెస్‌ అధిష్టానంతో స్నేహం నెరపడం ప్రారంభించారు. సిద్ధాంత రాద్దాంతాలు, విశ్వసనీయత వగైరాలతో తనకు ఏ రకమైన సంబంధం లేదని కొన్ని డజన్లసార్లు చంద్రబాబు నిరూపించుకున్నారు. అందువల్లనే ఎన్డీయేతో బహిరంగ స్నేహం, కాంగ్రె స్‌తో రహస్య ప్రేమ ఏకకాలంలో ఆయన నడపగలిగారు. ఆ స్నేహం ఉపకరించి వర్తమాన రాజకీయ పరిస్థితికి బాటలేసింది. ఎన్నికల సమయం నాటికి కూడా అత్యధిక ప్రజామోదం కలిగిన నేతగా కేసీఆర్‌ ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పలేదు. కర్ణుడి చావుకు కారణాలు అనేకం. తవ్వుకోవడం అనవసరం.

వ్యవహార దక్షత, ఎన్నికలకు అవసరమయ్యే వనరులను సమీకరించగలిగే సామర్థ్యం రేవంత్‌రెడ్డికి సహజంగానే ఉన్నా యని చెబుతారు. దానికోసం యెల్లో మీడియా, తెలుగుదేశం పార్టీల సంపూర్ణ మద్దతు ఉండనే ఉన్నది. బీజేపీ వ్యతిరేకత మొత్తం బీఆర్‌ఎస్‌ మీదనే కేంద్రీకృతమవడంతో అటువైపునుంచి కూడా రేవంత్‌ కాంగ్రెస్‌కు ఇబ్బంది లేకుండా పోయింది. అధికా రంలోకి వచ్చిన తర్వాత మొన్నటి అమెరికా పర్యటనను అడ్డు కోవడం మినహా ఇతరత్రా రేవంత్‌ సర్కార్‌ను బీజేపీ ఇబ్బంది పెట్టిన ఘటనలు లేకపోవడం ఆశ్చర్యమే. కాంగ్రెస్‌ పార్టీలో తనకో సొంత వర్గాన్ని తయారు చేసుకోవడం కోసం తెలుగు దేశం పార్టీ తెలంగాణా అవశేషాలను కాంగ్రెస్‌లోకి రేవంత్‌ బదిలీ చేయగలిగారు. ఇప్పుడీ అవశేష తెలుగుదేశం శ్రేణులకే పెత్తనం దక్కాలనే వాంఛ యెల్లో మీడియాలో కనిపిస్తున్నది. 

దశాబ్దాల చరిత్ర కలిగిన కొందరు కాంగ్రెస్‌ నాయకులను ఈ కారణాల వల్లనే యెల్లో మీడియా టార్గెట్‌ చేస్తున్నదనీ, వారిమీద నెగెటివ్‌ ముద్రలు వేస్తున్నదనే ఆరోపణలు కాంగ్రెస్‌ శ్రేణులనుంచి వినపడుతున్నాయి. కొండా సురేఖ వివాదం నలుగుతున్న సందర్భంగా ఒకరోజు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి వస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అక్కడున్న మీడియాతో మాట్లాడవలసి వచ్చింది. ఈ సందర్భంగా ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి మీడియాపై పేరు పెట్టి మరీ ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్టీలో మీక్కావలసిన ఎవరినో బలోపేతం చేయడం కోసం నాలాంటి నిజాయితీపరు లైన నాయకుల మీద నిందలేస్తున్నారని ఆయన దుమ్మెత్తి పోశారు. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. 

వర్తమాన కాలంలోని సగటు రాజకీయ నాయకులకు భిన్నంగా జనసామాన్యంలో మంచి పేరున్న నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. గత ఇరవయ్యేళ్లుగా తన తల్లి పేరుమీద ఏర్పాటు చేసిన ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఏం వ్యాపారాలు చేస్తారో ఎక్కడ చేస్తారో తెలి యదు కానీ, నియోజకవర్గంలో మాత్రం కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు రాజగోపాలరెడ్డి వెనుకాడరని స్థానిక ప్రజలు చెబుతారు. సొంత అసెంబ్లీ నియోజకవర్గం మునుగోడులోనే కాకుండా భువనగిరి లోక్‌సభ స్థానం పరిధిలోని అన్ని నియోజక వర్గాల్లో కోమటిరెడ్డి సోదరులకు అనుచరగణం, పలుకుబడి ఉన్నాయని చెబుతారు. కాంగ్రెస్‌ పార్టీలో ఇమడలేని పరిస్థితి ఏర్పడినప్పుడు తన అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి మరీ రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారు. ఆ పార్టీతో భావసారూప్యత పొసగక తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. ఇటువంటి నేపథ్యం ఉన్న తనపై అవాకులు చవాకులు ప్రచారం చేస్తున్నదని మీడియాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని తప్పు పట్టగలమా? 

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌పై కూడా ఆ మధ్యన ఒక టీవీ ఛానల్‌ ధారావాహిక దాడికి పాల్పడింది. ముఖ్యమంత్రికి సన్నిహితులైనవారు ఈ ఛానల్‌ను నడిపిస్తారని చెబుతారు. మహేష్‌గౌడ్‌ మూడున్నర దశాబ్దాల కిందనే ఎన్‌ఎస్‌యూఐ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. యూత్‌ కాంగ్రెస్‌ నాయకునిగా, సేవాదళ్‌ కార్యకర్తగా పని చేస్తూ ఏనాడూ కాంగ్రెస్‌ జెండాను భుజం మీదినుంచి కిందకు దింపలేదు. వందలాది ఎకరాల సాగుభూములున్న కుటుంబం నుంచి వచ్చిన మహేశ్‌గౌడ్‌కు ఏనాడూ అవినీతి మకిలి అంటింది కూడా లేదు. అటువంటి వ్యక్తిని అయోగ్యుడిగా చిత్రించడానికి సదరు టీవీ ఛానల్‌ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఒకటి రెండు ఉదాహరణలు మాత్రమే ఇవి. 

కొండా సురేఖ తాజా వివాదానికి ఆమె కుమార్తె సుష్మిత ముఖ్యమంత్రిపై చేసిన ఘాటు వ్యాఖ్యలే కారణమనే సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై సుష్మిత ఉపయోగించిన పరుష పదజాలాన్ని ఎవరూ హర్షించరు. ఆమె చేసిన వ్యాఖ్యలకు కారణమెవరు? వరంగల్‌ జిల్లా పరకాల నియోజక వర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో కూడా రేవూరి ప్రకాశ్‌రెడ్డి పోటీ చేస్తారని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ స్థానంపై ఎప్పటి నుంచో దృష్టి పెట్టిన సుష్మిత ఘాటుగా స్పందించారు. సుష్మిత సంగతి పక్కన పెడితే కాంగ్రెస్‌ కల్చర్‌లో అభ్యర్థులను ముందు గానే ముఖ్యమంత్రి నిర్ణయించే సంప్రదాయం ఉన్నదా? అంతే కాకుండా ఇంకో పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని కూడా రేవంత్‌రెడ్డి పలుమార్లు ప్రకటించారు. 

పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ సీఎం స్థానం నిజంగా అంత బలంగా ఉన్నట్లయితే సురేఖ మీద చర్య తీసుకోవడానికి ఇంత తతంగం ఎందుకు? మొదట 20 మంది శాసనసభ్యులతో ప్రెస్‌ మీట్, సురేఖను తప్పించాలని క్రమశిక్షణ కమిటీ సిఫార్సు, దాన్ని హైకమాండ్‌కు పంపించడం, సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ కేసీ వేణుగోపాల్‌ రాకకోసం నిరీక్షణ... ఇదంతా అవస రమా? సీఎం తలుచుకుంటే ఏ మంత్రినైనా తప్పించే అధికారం రాజ్యాంగబద్ధంగానే ఉన్నది. ఆ అవకాశాన్ని వినియోగించు కోలేని అశక్తత ఎందుకొచ్చింది? గత ఎన్నికల సందర్భంగా రేవంత్‌ను ఫోకస్‌ చేయడం కోసం నల్లగొండ గద్దర్‌ నర్సన్న పాడిన ఒక పాట పాపులరయింది. ‘‘మూడు రంగుల జెండా పట్టి... సింగమోలే కదిలినాడు... మన రేవంతన్న’’ అని సాగు తుందా పాట. 

ఎక్కడ ముఖ్యమంత్రి సభ జరిగినా ఆ రికార్డు పెట్టడం రివాజు. గత కొంత కాలంగా గాంధీ భవన్‌లో జరిగే కార్యకర్తల సమావేశంలాంటి కార్యక్రమాల్లో ఆ పాట వినిపించ కూడదనే ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం. పరకాల సంగతేమోగానీ కొండా సుష్మిత కాంగ్రెస్‌ పార్టీలోకి ఒక కొత్త పదబంధాన్ని తెచ్చారు. ‘అచ్చ కాంగ్రెస్‌–పచ్చ కాంగ్రెస్‌’ అనే మాటపై విస్తృతంగా చర్చ జరుగుతున్నది. యెల్లో మీడియా ట్రాప్‌లో పడి ‘అచ్చ’ కాంగ్రెస్‌ నేతలను టార్గెట్‌ చేస్తూపోతే కాంగ్రెస్‌ పార్టీ బలపడుతుందనుకోవడం భ్రమ. ఒక పక్కన ప్రభుత్వ పాలనపై జనసామాన్యంలో పేరుకొంటున్న తీవ్ర అసంతృప్తి నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీని సమైక్యంగా నడిపించ డంపై దృష్టి పెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో దారుణమైన పరాజ యాన్ని మూట కట్టుకోవలసి వస్తుందని గ్రహిస్తే మంచిది.


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement