దేశ రాజధానిలోని జంతర్‌మంతర్‌లో జెన్ జీ సాగించిన ఉద్యమం తర్వాత బీజేపీ, ఆరెస్సెస్‌లతోపాటు రాజకీయ పక్షాలన్నీ మేల్కొన్నాయి. ఆ తరానికి చేరువకావటానికి... దాని ఆశలేమిటో, ఆకాంక్షలేమిటో తెలుసుకోవటానికి ప్రయత్నించటం మొదలెట్టాయి. ఇవన్నీ ఆశావహమైన మార్పులకు సంకేతంగా అందరూ భావించారు. కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఈ ఉద్యమాన్ని పాఠశాలలకు సైతం విస్తరించాలని సంకల్పించి, ‘స్కూల్ ఠీక్ కరో’ పేరిట వివిధ రాష్ట్రాల్లో బడుల స్థితిగతులు బయటపెట్టేందుకు నడుం కట్టింది. కానీ చాలాచోట్ల దానికెదురవుతున్న ఆటంకాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. రాజస్థాన్‌లో జైపూర్ సమీపంలోని రాంపురా కన్వర్‌పురా గ్రామంలో పట్టుమని పదిమంది కూడా లేని సీజేపీ బృందంపై గ్రామస్థులమని చెప్పుకున్నవారు రాళ్లతో దాడిచేశారు. ఒకరి చేయి విరగ్గొట్టారు. మహిళల్ని కూడా మినహాయించలేదు. వాహనాలు ధ్వంసం చేశారు.
గొడ్లపాకలో నడుస్తున్న ఈ బడి గురించి ఒక చానెల్‌లో వచ్చిన కథనంతో జెన్ జీ ఆ గ్రామానికి వెళ్లింది. కొన్ని రోజుల క్రితం పశ్చిమ బెంగాల్‌లోనూ ఇంతే. ఒక పాఠశాల వీడియో తీసేందుకు అనుమతి కోరిన సీజేపీ కార్యకర్త ఇంటిపై గుంపు దాడిచేసి అతన్ని కొట్టబోగా, అడ్డొచ్చిన అతని తండ్రి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లో బడి పిల్లల్ని రెచ్చగొడుతున్నారంటూ పలు జిల్లాల్లో అనేకమందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. శిథిలావస్థలో ఉన్న బడుల్ని చూపించిన యూట్యూబర్‌లపై కేసులు పెట్టారు. బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లోనూ సీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి.
ఈ పాలకులకు ఏమైంది? బడి బాగులేదంటే, ఉపాధ్యాయుల కొరత ఉందంటే, బడుగుల పిల్లలకు నాసిరకం చదువులే దక్కుతున్నాయంటే వీరెందుకు ఉలిక్కిపడు తున్నారు? బయటి ప్రపంచానికి తెలియకూడదని ఎందుకంత ఆత్రం? నిజానికి జంతర్ మంతర్ ఆందోళన ముగియటానికి కొంచెం అటూ ఇటూగా జెన్ ఆల్ఫా పిల్లలు రోడ్డెక్కారు.లక్నో శివారులో ఒక బడినుంచి వెల్లువలా బయటికొచ్చిన ఆడపిల్లలు రహదారిని దిగ్బంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వచ్చింది. పిల్లలు ఏకరువుపెట్టిన సమస్యలు, వారి భావోద్వేగాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. జిల్లా కలెక్టర్ వచ్చి హామీ ఇస్తే తప్ప ఆందోళన విరమించలేదు. ఆ వెంటనే నలుగురు కొత్త టీచర్లొచ్చారు.
ఈమధ్య జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిందేమిటి? రాష్ట్రాల్లో పాలకులు చేస్తున్నదేమిటి? ‘ఒక రోజు, ఒక యూనివర్సిటీ’ కార్యక్రమం చేపట్టాలని కేంద్రమంత్రులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు, పనితీరు స్థానిక ప్రతినిధులద్వారా తరచు తెలుసుకోవాలని కోరారు. అదే పని సీజేపీ చేస్తే తప్పేమిటి? సమస్యలేమిటో, పిల్లలు పడుతున్న బాధలేమిటో బయటి ప్రపంచానికి చెప్పడంకాక, వారివల్ల ఇంకేం జరుగుతుందని ప్రభుత్వాలు వణుకుతున్నాయి? స్వాతంత్య్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలవుతున్నా ఒకే ఒక్క గదితో, అయిదు తరగతులకు ఒకే టీచర్‌తో కొన్ని బడులు నడుస్తున్నాయంటే వింతకాదా? దేశంలో ఏకంగా 29 లక్షలమంది పిల్లలు చదువుకునే బడులు ఏకోపాధ్యాయ పాఠశాలలు! బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే కాదు... ఇతరచోట్ల సైతం ఇలాంటి దుఃస్థితే.
ఆంధ్రప్రదేశ్‌లో 2019–24 మధ్య వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎవరూ కోరకుండానే రూ. 11,700 కోట్లతో ‘మన బడి: నాడు–నేడు’ కార్యక్రమం కింద వేలాది పాఠశాలలకు సౌకర్యవంతమైన భవంతులు నిర్మించింది. కార్పొరేట్‌లను తలదన్నే సదుపాయాలు కల్పించింది. 38,059 బడుల రూపురేఖల్ని మార్చింది. మరిన్ని పాఠశాలలకు విస్తరించాల్సివున్న తరుణంలో... కూటమి ప్రభుత్వం వచ్చి కొత్త నిర్మాణాల సంగతలావుంచి, మెరుగుపడిన బడుల్ని కాస్తా నాశనం చేసిపెట్టింది. అందుకే సీఎంలంతా తమ నిర్వాకాన్ని సమీక్షించుకుని దిద్దుబాటుకు సిద్ధపడాలి. లక్ష్య నిర్దేశం చేసుకుని బడుల్ని బాగుచేస్తామని హామీ ఇవ్వాలి. అధికారం ఉందికదా అని పోలీసులతో, రౌడీలతో బెదరగొడదామనుకుంటే ఆ చర్యలు వికటిస్తాయి. మూర్ఖత్వాన్ని వదులుకుని సావధానంగా ఆలోచించటం... రేపటి పౌరుల శ్రేయస్సుకోసం సరైన నిర్ణయాలు తీసుకోవటం అవసరమని గుర్తించాలి.


