రోగికి హాని చేయకుండా ఉండటమే ఆస్పత్రికి ఉండాల్సిన మౌలిక లక్షణమని ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు ఆద్యురాలైన ఫ్లోరెన్స్ నైటింగేల్ ఒక సందర్భంలో చెప్పారు. దురదృష్టవశాత్తూ ఈ లక్షణాన్ని అలవర్చుకోవటంలో మన ఆస్పత్రులు విఫలమవు తున్నాయి. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్న తేడా ఏం లేదు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా ఆసుపత్రిలో సోమవారం వేకువజామున నవజాత శిశు సంరక్షణ యూనిట్‌లో వెంటిలేటర్ పేలి ముగ్గురు నవజాత శిశువులు చనిపోయారు. ఒకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మూడు విభాగాలుగా ఉన్న ఆ యూనిట్‌లో 39 మంది నవజాత శిశువులుండగా మిగిలినవారిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. తరచిచూస్తే అసలు ఇలాంటి ఉదంతాలను ప్రమాదాలనవచ్చా అనే సందేహం తలెత్తుతుంది. నెలలు నిండకముందే పుట్టి సరిపడా బరువులేని పిల్లలూ, తీవ్ర అస్వస్థత పాలైన పిల్లలూ ఈ యూనిట్‌లో ఉంటారు. ఇలాంటివారిని కంటికి రెప్పలా చూసుకోవా ల్సిన ఆసుపత్రిలో వెంటిలేటర్ పేలిందంటే అర్థమేమిటి? అక్కడ రోజువారీ తనిఖీలు సక్రమంగా లేవని, కనీసం నిప్పును ఆర్పే యంత్రాలు కూడా మొక్కుబడిగా మిగిలాయని ఈ ఉదంతం జరిగేవరకూ ఎవరికీ తెలియలేదు.
ఫలితంగా ఆ యూనిట్ మొత్తం తగలబడిపోయింది. అందరూ గాఢనిద్రలో మునిగివుండే వేళ పెద్ద చప్పుడుతో వెంటి లేటర్ పేలి, నిప్పు రాజుకున్నప్పుడు ఆ నవజాత శిశువుల తల్లులు మేల్కొని కేకలు పెట్టడంతో సెక్యూరిటీ సిబ్బంది సహా అందరూ వచ్చారు. కానీ తక్షణం మంటల్ని అదుపులోకి తీసుకురాలేని నిస్సహాయస్థితిలో ఎంతమంది ఉండి ఏం ప్రయోజనం? ఇటువంటి సందర్భాల్లో మంటలు వ్యాపించటం కాస్తయినా ఆలస్యమవుతుందిగానీ... వెనువెంటనే దట్టంగా పొగలు అలుముకుంటాయి. ఏం జరుగుతున్నదో, ఎవరెక్క డున్నారో తెలియని అయోమయం ఏర్పడుతుంది. కొందరైనా ప్రాణాలకు తెగించి వెళ్లకపోతే ప్రమాద తీవ్రత మరింత పెరుగుతుంది. వెంటిలేటర్ పనితీరు ఎప్పటికప్పుడు గమనించుకుంటే అది అసాధారణంగా వేడెక్కుతున్నదని సులభంగానే తెలుస్తుంది. విద్యుత్ వైర్ల లోపాన్ని పసిగట్టడానికి, దానంతటదే విద్యుత్ నిలిచిపోవటానికి అవసరమైన సాంకేతికతలు అందుబాటులోనే ఉన్నా ఇలాంటి విషాదం జరిగిందంటే ఎవరిని నిందించాలి?
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఈ ఉదంతంలో బాధ్యుల్ని గుర్తించి చర్యలు తీసుకుంటామంటున్నారు. మంచిదే. కారణాలు దర్యాప్తులో బయటపడతాయి. ఎవరినో బాధ్యులుగా గుర్తిస్తారు. మరి నిత్యమూ పర్యవేక్షించాల్సిన వ్యవస్థల నైతిక బాధ్యత మాటేమిటి? మనకు క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం ఉంది. నేషనల్ బిల్డింగ్ కోడ్ (ఎన్‌బీసీ) ఉంది. ప్రత్యేకించి ఆస్పత్రులకు సంబంధించి అయితే బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణకు నిబంధనలున్నాయి. ఎన్‌బీసీ ప్రకారం స్థానిక అగ్నిమాపక విభాగం నిశితంగా పరిశీలించి నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) ఇవ్వాలి. ముఖ్యంగా ఐసీయూలాంటి ప్రమాదాలు పొంచివుండే విభాగాలకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చూడాలి. రోగి భద్రత, ఆస్పత్రి ఆవరణలో అంటురోగాల నియంత్రణ, అత్యవసర పరిస్థితుల్లో ఆ ఆస్పత్రికుండే సంసిద్ధత వగైరాలను వివిధ గీటురాళ్లతో గుర్తించి ఆస్పత్రులకూ, ఆరోగ్యసేవలందించే ఇతర సంస్థలకూ జాతీయ అక్రిడిటేషన్ బోర్డు ధ్రువీకరణ పత్రం జారీచేస్తుంది. వృత్తిపరంగా ఎలాంటి భద్రతలున్నాయో, సిబ్బంది ఆరోగ్యం, పని పరిస్థితులెలా ఉన్నాయో నిర్ధారించేందుకు ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఇవన్నీ కాగితాల్లో భద్రంగా ఉంటాయి. చెప్పుకోవటానికే ఇవన్నీ. కానీ ఆచరణలో అన్నీ నీరుగారుతున్నాయి. రెండు రోజుల క్రితం మధ్యప్రదేశ్ ఆస్పత్రిలో కూడా అగ్నిప్రమాదం జరిగి ఒక శిశువు చనిపోగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
ఆరోగ్యమే మహాభాగ్యమంటారు. పౌరులకు మెరుగైన చికిత్స, ఆరోగ్యం అందించగలిగితే ఉత్పాదకత, సృజనాత్మకత పెరుగుతాయంటారు. అవి అంతిమంగా దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పతాయి. అందుకే ఆరోగ్య సేవ అంగడి సరుకు కాకూడదని చెబుతారు. కానీ మన దేశంలో చదువు మొదలుకొని అన్నీ వ్యాపారమే. ఈ విషయంలో సాక్షాత్తూ సుప్రీంకోర్టు చెప్పినా పట్టించుకునే దిక్కులేదు. పౌరుల ప్రాణాలు ఇలా గాల్లో దీపం కావటం ఎంత సిగ్గుచేటు!


