జనతంత్రం
భారత రాజ్యాంగానికి అతీతులమనే భావన ఆంధ్రప్రదేశ్ పాలకుల్లో బలంగా పాతుకొనిపోయింది. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన చట్టుబండలైన చలనదృశ్యాలు గజ్జెకట్టి మరీ గంతు లేస్తున్నాయి. రక్షకులే భక్షకులుగా మారిన ఆటవిక రాజ్య వికటాట్టహాసం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నది. ప్రాథమిక హక్కుల సంగతి దేవుడెరుగు, ప్రజల ప్రైవేట్ ఆస్తులను సైతం గద్దెలమీదున్న గద్దలు ఇష్టారీతిన ఎగరేసుకు పోవడం రివాజుగా మారింది. ప్రజాప్రతినిధులు కలెక్షన్ కింగ్స్‌గా మారి ప్రైవేట్ ట్యాక్స్‌లను పిండుకుంటున్నారు. ప్రకృతి వనరులను సొంత ఖజానాల్లోకి తవ్వి పోసుకుంటున్నారు. రొచ్చు గుంటల్ని సైతం వదలకుండా చేపలవేటకు బయల్దేరు తున్న నాయకమన్యుల కక్కుర్తి కంపు ప్రజల నాసికాఘ్రాణ సహనాన్ని సవాల్ చేస్తున్నది.
యువతరం ఆశల మీద, ఆకాంక్షల మీద పాలకులే పూను కొని గంజాయి మత్తును వెదజల్లుతున్నారనేందుకు సాక్ష్యాలు లభ్యమవుతున్నాయి. నవయువత స్వప్నతరంగాలను దారి మళ్లించేందుకు కుట్ర చేస్తున్నారని బలంగా నమ్మవలసి వస్తున్నది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ‘ఉడ్‌తా పంజాబ్’ రోజులను గుర్తుకు తెస్తున్నది. పోలీసు వాహనాల్లోనే రాచమర్యాదలతో గంజాయి రవాణా గమ్యంవైపు సాగి పోతున్నది. అనధికార రాష్ట్ర మొక్క హోదాను గంజాయి మొక్క అనుభవిస్తున్నదనుకోవాలేమో! పగల్లేదు, రాత్రి లేదు... ఎనీ టైమ్, ఎనీ సెంటర్, ఎనీ లొకాలిటీ... విచ్చలవిడిగా మద్యం అందు బాటులో ఉంటున్నది.
లైసెన్స్‌డ్ షాపులకు అనుబంధంగా ఏర్పడిన బెల్ట్ షాపులే కాదు, వాటికి మొలతాడు షాపులు కూడా మొలకెత్తి డోర్ డెలివరీ స్టేజికి చేరుకున్నాయి. క్షేత్ర స్థాయిలో ప్రవహిస్తున్న మద్యం క్యూసెక్కుల లెక్కకూ, రాష్ట్ర స్థాయి విక్రయాల లెక్కకూ హస్తిమశకాంతరం కనిపిస్తున్నది. అనధికార కల్తీ సరుకు అంగళ్లను ముంచెత్తుతున్నదనేందుకు ఇదే పెద్ద రుజువు. అనధికార అమ్మకాలకు సంబంధించిన ధరవరలను, వేలం పాటలను ప్రజాప్రతినిధులే దగ్గరుండి నిర్వహించి వాటాలను నిర్ణయిస్తున్నారనే వార్తలు బహిరంగ రహస్యాలుగా చలామణి అవుతున్నాయి. అడ్డుకట్టల్లేని వారుణి వాహిని ఊరూవాడల్ని ముంచెత్తుతుంటే జనజీవనం మీద దాని పర్యవసనాలెలా ఉంటాయో విజ్ఞులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అద్దంకి ఘటన చెబుతున్నదేమిటి? ఆ ప్రాంతంలో గ్రానైట్ తవ్వకాలు చేసే వ్యాపారులు పరిమితిని మించి అక్రమ రవాణాను యథేచ్ఛగా చేసుకోవడానికి అడ్డంకులు లేకుండా ఎవరి వాటాలు వారికి పంచే ఒప్పందం కోసం ఒక పొట్టేళ్ల పార్టీ ఏర్పాటు చేశారట. ఈ పార్టీకి ఒక మంత్రి పీఏ సమన్వయకర్తగా వ్యవహరించారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. గ్రానైట్ వ్యాపారులతో పాటు కొందరు అధికార రాజకీయ నేతలు, అరడజన్ మందికి పైగా ఎస్‌ఐలు, ఒకరో ఇద్దరో సీఐలు, ఎంపిక చేసుకున్న కొందరు పెంపుడు మీడియా ప్రతినిధులు ఈ పార్టీలో పాల్గొన్నట్టు సమాచారం. ఒక ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల దాకా పార్టీ జరిగింది.
లిక్కర్ గ్లాసుల గలగలలూ, పొట్టేళ్ల మాంసం ఘుమ ఘుమల మధ్య చర్చలు, ఒప్పందాలు పూర్తయిన తర్వాత అతిథులను తగురీతిన సత్కరించి గ్రానైట్ వ్యాపారులు వీడ్కోలు పలికారట. అలా బయల్దేరిన ఒక కారుకు సమీపంలోని శంఖవరప్పాడు అనే గ్రామం వద్ద ఆక్సిడెంట్ జరిగింది. చుట్టుముట్టిన గ్రామస్తులు అందులో ప్రయాణిస్తున్న మఫ్టీలో ఉన్న ఇద్దరు ఎస్‌ఐలను గుర్తించలేదు. డ్రైవర్‌తోపాటు ఈ ఇద్దరూ ప్రయాణంలో కూడా తాగుతున్నట్టుగా గమనించి ఆ కారును అక్కడే నిలిపేశారు. 108 వాహనాన్ని పిలిచి ప్రమాదా నికి గురైన ఆటోలోని ప్రయాణికుల్ని అందులో పంపించారు. కారు డిక్కీలో కూడా మద్యం బాటిళ్లు ఉండొచ్చనే అనుమానంతో తెరవాలని డిమాండ్ చేశారు.
ఈలోగా సమాచారం అందుకున్న స్థానిక సీఐ హుటా హుటిన అక్కడికి చేరుకున్నారు. డిక్కీ ఓపెన్ చేయడానికి వీల్లేదని స్థానిక ప్రజలపై బెదిరింపునకు దిగారు. అదే సమయంలో ఒక పాలక పార్టీ నాయకుడిదిగా అనుమానిస్తున్న కారు అక్కడికి చేరుకొని మఫ్టీ ఎస్‌ఐలను ఎక్కించుకొని వెళ్లిపోయింది. సీఐ బెదిరంపులను లెక్క చేయకుండా స్థానిక ప్రజలు కారు డిక్కీని ఓపెన్ చేసి నిర్ఘాంతపోయారు. పెద్ద మొత్తంలో గంజాయి, ఒక బ్లూ కలర్ బ్యాగ్‌లో భారీ మొత్తంలో నగదు, ఒకటో రెండో ఫారిన్ లిక్కర్ బాటిళ్లు అందులో కనిపించాయి. జరిగిన ఘటనపై స్థానిక డీఎస్పీ, ఎస్పీలు చెరో రకమైన కథను వినిపించారు. దూడ గడ్డి కోసమే తాటిచెట్టు ఎక్కారనేది వారు చెప్పిన కథల సారాంశం. పోలీసు వాహనాల్లోనే యథేచ్ఛగా గంజాయి రవాణా జరుగుతున్నదనే విమర్శలు గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఆ విమర్శలు నిజమేనని అద్దంకి ఘటన రుజువు చేసింది. అక్రమ వ్యాపారులు, రాజకీయ నాయకులు, అధికార యంత్రాంగ గణం ఏకమై వనరుల్ని లూటీ చేసి వాటాలు పంచుకుంటున్నారనే ఆరోపణకు కూడా ఈ ఘటన సాక్ష్యంగా నిలబడింది. ఘటన జరిగి ఇన్ని రోజులైనా ప్రభుత్వ పెద్దలుగానీ, పోలీసు ఉన్నతాధికారులుగానీ, దీనిపై మౌనం వీడకపోవడాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి వ్యవహారాలే ఇప్పుడు ‘ఆర్డర్ ఆఫ్ ద డే’గా అర్థం చేసుకోవలసి వస్తున్నది.
డీఎస్‌సీ – 2025 పరీక్షలను రాష్ట్రప్రభుత్వం ఎంత ప్రహస నంగా మార్చిందో వెల్లడిస్తూ జరిగిన అవకతవకలను చాలా కాలం క్రితమే ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి సాక్ష్యాధారాలతో నిరూపించారు. ఈ పరీక్షలను రద్దు చేయాలనీ, అక్రమాలకు బాధ్యుడైన విద్యామంత్రి లోకేశ్ రాజీనామా చేయాలనీ కోరుతూ రాష్ట్రంలో ఆందోళనలు కూడా ప్రారంభమయ్యాయి. ప్రతిపక్ష నేత చూపెడుతున్న ఆధారాలపై స్పందించకపోగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై ఎదురుదాడికి దిగింది. జగన్ హయాంలో జరిగిన గ్రూప్–1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ప్రభుత్వ పెద్దలు, యెల్లో మీడియా డైవర్షన్ గేమ్‌ను ఆశ్రయించారు. మొన్న గురువారం నాడు జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ విసిరారు. గ్రూప్–1 పరీక్షలతో పాటు, డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణకు నేను సిద్ధమే, మీరు సిద్ధమా? అని ప్రశ్నించారు.
ఈ సవాల్‌పై రెండు రోజులు గడిచినా పాలకపక్షం నోటమాట పెకల్లేదు. డీఎస్సీలో జరిగిన అక్రమాల గురించి వారికి స్పష్టంగా తెలుసు కనుకనే సీబీఐ విచారణ పేరు వినగానే బాబు, లోకేశ్‌ల నోళ్లు మూతపడ్డాయి. రద్దయిన నీట్ పరీక్షల్లో పేపర్ లీకేజీ అంశం ఒక్కటి మాత్రమే ఉన్నది. డీఎస్సీలో లీకేజీతోపాటు స్పోర్ట్ కోటా పేరుతో మూడొందల పైచిలుకు పోస్టులకు బేరాలు పెట్టడం, డీఎస్సీ పరీక్ష రాయని వారితో ఆ పోస్టులను నింపేయడం, అందుకోసం పాత జీవోల స్థానంలో కొత్త జీవోలను విడుదల చేయడం, పని పూర్తికాగానే పాత నిబంధనలతో మళ్లీ కొత్త జీవోలు ఇవ్వడం అనే కుట్రపూరిత వ్యవహారం ఇమిడి ఉన్నది. ఉన్నత స్థాయి వ్యక్తులు ఉద్దేశ పూర్వకంగా ఆడిన నాటకం, చేసిన నయవంచన అనేందుకు జీవోల ప్రహసనమే తిరుగులేని సాక్ష్యం.
నిబంధనలకూ, సంప్రదాయాలకు విరుద్ధంగా డీఎస్సీ పరీక్షల నిర్వహణను, ప్రశ్నాపత్రాల తయారీని ఒకే సంస్థ చేతిలో పెట్టారు. ఆ సంస్థకు సంబంధించిన ఔట్‌సోర్సింగ్ విద్యార్థికి మొదటి మెరిట్‌లిస్ట్‌లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఒకసారి ప్రశ్నా పత్రం లీకయితే ఒక్కడితోనే ఆగిపోతుందా? ఒక్కడితోనే ఆగిపోతే మాత్రం అది చెల్లుబాటవుతుందా? లీకేజీ జరిగిందని గమనించినందువల్లనే తదుపరి మెరిట్ లిస్ట్ నుంచి సదరు వ్యక్తి పేరును తొలగించి, సర్టిఫికెట్లు సబ్మిట్ చేయకుండా అతని లాగిన్ ఐడీని తీసేశారన్నది నిజం కాదా? అక్రమాలను కప్పి పుచ్చుకోవడానికి ఎంపికయిన టీచర్ అభ్యర్థులను రెచ్చగొట్టి వారి చేత ప్రదర్శనలు చేయించే చౌకబారు ఎత్తుగడలకు సర్కార్ దిగజారింది. ఎంపికైన అభ్యర్థుల్లో ఎక్కువమంది మెరిటోరియస్ అభ్యర్థులే ఉండవచ్చు. సందేహం లేదు. లీక్ కారణంగా రద్దయిన నీట్ పరీక్షలో కూడా చాలామంది మెరిట్ అభ్యర్థులు సెలెక్టయ్యారు. రెండోసారి నీట్ పరీక్ష నిర్వహించినప్పుడు కూడా వారు ఎంపికయ్యారు. కాకపోతే వారికి అనవసర ఆందో ళన, అధిక శ్రమ. అందుకు కారణం మరెవరో కాదు. పరీక్ష నిర్వాహణా వ్యవస్థ నిర్వాకం. ప్రభుత్వ అసమర్థత. డీఎస్సీకి కూడా ఇదే వర్తిస్తుంది.
అద్దంకి గంజాయి, డీఎస్సీ అవినీతి బయటకు స్పష్టంగా కనిపిస్తున్న ప్రభుత్వ నిర్వాకాలు మాత్రమే. అన్ని రంగాల్లోనూ రెండేళ్లల్లోనే ఈ సర్కార్ సర్వభ్రష్టత్వాన్ని సాధించింది. జగన్ సర్కార్ మెరిట్ విద్యార్థులకూ, పేద రోగులకూ అందు బాటులోకి తెచ్చిన పదిహేను మెడికల్ కాలేజీలను పీపీపీ జపంలో ఈ సర్కార్ మూలన పడవేసింది. పిల్లలందరికీ న్యాయమైన ఉచిత విద్యను అందించాలని జగన్ సర్కార్ ప్రారంభించిన విద్యారంగ సంస్కరణలకు బాబు సర్కార్ పాతరేసింది. ఫలితంగా ఇప్పటికే ఐదులక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్లను వదిలేసినట్టు అసెంబ్లీలోనే ప్రభుత్వం అంగీ కరించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
పీపీపీ ముసుగులో చేస్తున్న ప్రైవేటీకరణ ఎంత దూరం వెళ్లిందంటే ఇకమీదట ఆస్పత్రి సేవలు, తాగునీటి సరఫరా, ఆర్టీసీ సేవలు, చివరకు చెత్త ఎత్తడం కూడా పీపీపీలోకి మారబోతున్నాయి. క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో విచ్చలవిడిగా ప్రభుత్వ ఆస్తులను దోచిపెట్టే లక్ష్యంతోనే పీపీపీ మంత్రాన్ని బాబు సర్కార్ జపిస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరో పక్క ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం మోపడం, యువతరాన్ని మత్తులో జోగేలా చేయడం, రాజీకీయ ప్రత్యర్థులను వేటాడటం, ప్రభుత్వ ఆస్తుల్ని తెగనమ్మడం ప్రధాన ఎజెండాలుగా పాలక కూటమి అమలుచేస్తున్నది. సొంత ప్రయోజనాల కోసం పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకోవడం మొదలు పెట్టింది. ఇదే అదునుగా కొందరు పోలీసు అధికారులు రెచ్చిపోయి పౌరహక్కులకు పాతరేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఇప్పటికే ఒక్కొక్కడూ వందల కోట్లు వెనకేసుకున్నారని అదే పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యేలను చూసి క్షేత్రస్థాయి అధికార యంత్రాంగం అవినీతి కూపంలో మునకలేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు మాత్రం నానాటికీ తీవ్ర సంక్షోభంలో కూరుకు పోతున్నారు. ఇటువంటి ఆటవిక పాలనను ఇంకెంతకాలం భరించాలి? చైతన్యవంతులైన ప్రజలు ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com


