పతకాలు చెప్పే పాఠం | Sakshi Editorial On Asian Games | Sakshi
Sakshi News home page

పతకాలు చెప్పే పాఠం

Oct 7 2026 1:20 AM | Updated on Oct 7 2026 1:20 AM

Sakshi Editorial On Asian Games

నువ్వా నేనా అన్నట్టు తలపడే క్రీడోత్సవాల్లో కూడా యుద్ధంలో మాదిరే అవతలి పక్షంపై గెలిచి తీరాలన్న తపన, పట్టుదల ఉంటాయి. ఈర్ష్య, అహంకారం వంటివీ అప్పుడప్పుడు కనబడకపోవు. కానీ దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా చెప్పినట్టు ప్రపంచాన్ని మార్చే శక్తి, కోట్లాదిమందికి ప్రేరణగా నిలిచే సామర్థ్యం, ప్రపంచ పౌరుల్ని ఒక్కటిచేసే సత్తా క్రీడలకే ఉంటుంది. జపాన్‌లోని నగోయాలో రెండు వారాలు కొనసాగి, ఎన్నో అద్భుతాలు ప్రపంచానికందించిన ఆసియా క్రీడల సంరంభం ఆదివారం ముగిసింది.  చైనా, జపాన్, దక్షిణ కొరియా క్రీడాకారుల తర్వాత పతక విజేతల్లో మన ఆటగాళ్లది నాలుగో స్థానం. 2023నాటి చైనా క్రీడోత్సవాల్లోనూ మన స్థానం అదే గనుక ఫర్వాలేదన్న అభిప్రాయం కలుగుతుంది. కానీ సంఖ్యరీత్యా ఈసారి తీసికట్టే. గతంలో 28 స్వర్ణపతకాలు గెలుచుకున్న మన దేశం ఇప్పుడు 21కి సరిపెట్టుకోవాల్సివచ్చింది. వెండి పతకాల్లో చూస్తే 38 నుంచి 28కి పడిపోయాం. కాంస్యంలోనూ అంతే. గతంలో వాటి సంఖ్య 41 కాగా ఇప్పుడు 37. షూటింగ్, ఆర్చెరీ, అథ్లెటిక్స్‌ విభాగాల్లో అనుకున్న స్థాయిలో స్వర్ణాలు గెలుచుకోలేకపోవటం పెద్ద లోటు. మనం నాలుగో స్థానంలో ఉన్నామన్న మాటేగానీ తొలి ముగ్గురితో పోలిస్తే చాలా దూరంలో ఉన్నట్టు లెక్క. ఉదాహరణకు 341 పతకాలతో చైనా, 269తో జపాన్, 150తో దక్షిణ కొరియా ఉన్నాయి. గతంలో 107 పతకాలు గెల్చుకున్న మన జట్లు ఇప్పుడు 85కి పరిమితమయ్యాయి.

మన క్రీడాకారుల ఎంపిక ఈసారి కొంత కఠినంగానే ఉంది. పతకాలు రాబట్టగలిగేవారినే ఎంపిక చేయాలన్న పట్టుదల కనబడింది. అందుకు నిర్దేశించిన గీటురాళ్లు కూడా చిన్నవేం కాదు. గత క్రీడోత్సవాల్లో, ఆసియన్‌ చాంపియన్‌షిప్, అంతర్జాతీయంగా గుర్తింపుపొందిన ఇతర టోర్నీల్లో తొలి ఆరుస్థానాల్లో నిలిచినవారినే జపాన్‌ పంపాలన్నది అందులో ముఖ్యమైన ది. గతంలో ‘సొంత ఖర్చులతో వస్తాం. అవకాశమీయండి’ అని అడిగే క్రీడాకారులు... మన్నించిన అభ్యర్థనలూ తక్కువేం కాదు. ఈసారి కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ అలాంటివారికి ఎట్టి పరిస్థితుల్లోనూ చోటీయరాదన్న కృతనిశ్చయంతో ఉంది. మెరుగ్గా ఆడేవారికి మాత్రమే అవకాశం ఇవ్వాలన్న సంకల్పం మంచిదే. ఇందువల్ల వెళ్లిన క్రీడాకారుల సంఖ్య తగ్గింది. వారిలో ఎక్కువ శాతంమంది మెడల్‌ రౌండ్‌ వరకూ వెళ్లగలిగారు. ఎప్పట్లాగే ఇతర ఈవెంట్లతో పోలిస్తే మనకు అథ్లెటిక్స్‌లోనూ, షూటింగ్‌లోనూ ఎక్కువ పతకాలొచ్చాయి. వాటిల్లో కూడా సంఖ్యాపరంగా తగ్గినట్టే. 

ఆసియా క్రీడోత్సవాలను ఒలింపిక్స్‌కు ముందస్తు పరీక్షలుగా భావిస్తారు. అక్కడ పనితీరునిబట్టే ఒలింపిక్స్‌లో జాతకం ఎలా ఉండబోతోందో చెప్పవచ్చంటారు. చైనా క్రీడోత్సవాలకూ, జపాన్‌ ఉత్సవాలకూ మధ్య మన దేశం దాదాపు రూ. 98 కోట్లు వ్యయం చేసింది. కానీ సాధించింది చాలా తక్కువే. మనకొచ్చిన స్వర్ణాల్లో కూడా అత్యధికం...అంటే 21లో 13 టీమ్‌ ఈవెంట్స్‌కు సంబంధించినవే. సమష్టిగా, సమన్వయంతో ఆడి గెల్చుకోవటం ప్రశంసించదగ్గదే అయినా, ఒలింపిక్స్‌లో ఈ ఈవెంట్స్‌కు చోటుండదు. ఆటగాళ్ల పనితీరు మెరుగుపడిందా లేదా అన్నది చూడాలి తప్ప, పతకాలను చూసి అంచనాకు రాకూడదన్న అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధి ఆదెల్‌ సుమారీవాలాతో ఏకీభవించటం కొంత కష్టమే. సగం స్వర్ణాలు క్రికెట్, కబడ్డీ, హాకీ వగైరాలకే వచ్చాయి. ఇవన్నీ జట్టు సమష్టి బలాన్ని చాటాయి... నిజమే. కానీ వ్యక్తిగత ఈవెంట్లలో మరింత మెరుగ్గా ఉంటే ఒలింపిక్స్‌కు అది లాభిస్తుంది. 

అంతర్జాతీయ సందర్భాల కోసం కఠిన నిబంధనలతో క్రీడాకారుల ఎంపిక, శిక్షణ వగైరాలు మంచిదే. కానీ పాఠశాల స్థాయినుంచే ఈ రంగంలో అర్హులైనవారిని గుర్తించి, స్పోర్ట్స్‌ అథారిటీలు, అకాడెమీలద్వారా వారిని సానబడితేనే జాతీయ స్థాయిలో మెరికల్లాంటి క్రీడాకారులు రూపొందుతారు. మన బడుల్లో మంచినీరు, మరుగుదొడ్లువంటి మౌలిక సదుపాయాల కల్పనే అంతంతమాత్రం. అలాంటిచోట క్రీడలకు చోటిస్తారని ఆశించటం దురాశే. ఏదేమైనా ఇప్పుడు బయటపడిన లోటుపాట్లను నిశితంగా గమనించి సరిదిద్దుకుంటే 2028లో జరిగే లాస్‌ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌ నాటికి, 2030లో జరిగే దోహా ఆసియా క్రీడోత్సవాలనాటికి మన దేశం మరింత ఉన్నత స్థాయికెదుగుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement